– మత్స్యకారులపై చిన్నచూపు తగదు
– కేరళ తరహాలో సమగ్ర బీమా, రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేయాల్సిందే.. :అఖిల భారత మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వీవీఎస్ స్టాన్లీ
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్
‘సముద్ర అలలతోనూ, చెరువు లోతులతోనూ పోరాడుతూ దేశానికి ఆహార సంపద, ఆదాయం సృష్టిస్తున్నది మత్స్యకారులు. కానీ, ప్రభుత్వాల సంక్షేమ అజెండాలో మాత్రం వారు అట్టడుగు పేజీలో ఉండటం దేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాల పట్ల పాలకులు చూపిస్తున్న వివక్షకు అద్దం పడుతోంది’ అని అఖిల భారత మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వీవీఎస్ స్టాన్లీ అన్నారు. కరీంనగర్ వేదికగా జరుగుతున్న తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (టీఎమ్‌కేఎమ్‌కేఎస్) రాష్ట్ర నాలుగో మహాసభ బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మత్స్యకారుల స్థితిగతులు, ప్రభుత్వ విధానాలపై స్టాన్లీ, టీఎమ్‌కేఎమ్‌కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రసంగించారు.
మత్స్యకారుల వృత్తి అత్యంత ప్రమాదకరమైనదని, వారి భద్రతకు దేశానికే ఆదర్శంగా ఉన్న ‘కేరళ తరహా బీమా’ విధానాన్ని తెలంగాణలోనూ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుడు ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అంత్యక్రియలు, ఇతర అవసరాల కోసం రూ.2 లక్షల తక్షణ సాయం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. జీపీఎస్ పరికరాలు, లైఫ్ జాకెట్లను ఉచితంగా లేదా భారీ సబ్సిడీపై ప్రభుత్వం అందించాలని కోరారు. మత్స్యకారులు శ్రమిస్తున్నా, ఫలితం దళారుల పాలవుతోందని స్టాన్లీ అభిప్రాయపడ్డారు. దీని నివారణకు మౌలిక వసతుల కల్పన అత్యావశ్యకమని చెప్పారు. రాష్ట్రంలో కనీసం 10 హోల్‌సేల్, 100 రిటైల్ ఆధునిక చేపల మార్కెట్లను నిర్మిస్తేనే మత్స్యకారులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. చెరువులు, జలవనరులు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయని, ఎఫ్‌టీఎల్ హద్దులను శాటిలైట్ సర్వే ద్వారా పకడ్బందీగా నిర్ణయించి కాపాడాలని అన్నారు. ఈ మహాసభలో టీఎమ్‌కేఎమ్‌కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, టీఎమ్‌కేఎమ్‌కేఎస్ జిల్లా అధ్యక్షులు పిట్టల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి జునగరి గణేష్, కోశాధికారి పప్పు సదానందం, మర్రి శశికళ, నాగుల అరుణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
ప్రాణాలు పణంగా పెట్టి సంపద సృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



