సాహిత్య పఠనం మరింత పెరగాలి..వృద్ధి చెందుతున్న మహిళా సాహిత్యం
తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌లో ప్రముఖ కవి, రచయిత్రి ఓల్గా
అంతరంగ ఆవిష్కరణ, గోలకొండ కలాలు, మరో రెండు పుస్తకాల ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వేచ్ఛతోనే మహిళల రచనల్లో మరింత సృజనాత్మకత పెరుగుతుందని ప్రముఖ కవి, రచయిత్రి ఓల్గా అన్నారు. మహిళల్లో సాహిత్య పఠనం పెరగాలని ఆకాంక్షించారు. నేటి కాలంలో మహిళా సాహిత్యం వృద్ధి చెందటం శుభపరిణామం అన్నారు. తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలోని తంగిరాల చక్రవర్తి ప్రాంగణంలో జరుగుతున్న లిటరరీ ఫెస్ట్‌లో అంతరంగ ఆవిష్కరణ పుస్తకాన్ని ఓల్గా ఆవిష్కరించారు. రెండో రోజు లిటరరీ ఫెస్ట్ నిర్వహణ విషయంలో సమన్వయం వహించడంలో తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్‌కే. సలీమా అధ్యక్షతన మహిళా సాహిత్యంపై కూలంకషంగా చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్గా మాట్లాడుతూ..మహిళలు తమ అంతరంగాల ను పూర్తి స్థాయిలో బయటపెడితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
మహిళా సాహిత్యాన్ని వెలికి తీయడంలో మొదటి నుంచీ అంత ఫోకస్ లేదన్నారు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ మహిళలు రాణించారనీ, వారి గురించి శోధించి వెలికి తీయాల్సిన బాధ్యత నేటి యువ రచయితలపై ఉందని నొక్కి చెప్పారు. గత చరిత్రను పునర్న్మిస్తూనే వర్తమానంలో ముందుకు సాగుతూ భవిష్యత్తును దర్శించుకోవాలని మహిళా రచయితలకు పిలుపునిచ్చారు. ఎక్కువ మంది మహిళలు తమలోని భావాలను పేపర్‌పై పెట్టకుండానే లోలోపల కుంగిపోతున్నారని పలువురు రచయితలను ఉదహరించారు. కవిత్వం విలాస వస్తువు కాదనీ, చెమటోడ్చి, రక్తమోడ్చి కూర్చాల్సిన జీవనం అని నొక్కి చెప్పారు. విద్యావేత్త, రచయిత్రి డాక్టర్ అమృతలత మాట్లాడుతూ…అంతరంగ ఆవిష్కరణ పుస్తకం మహిళలకు దిక్సూచి, ప్రేరణ కావాలని అభిలాషించారు.
కొత్త రూపాల్లో సమస్యలు ముంచుకొస్తున్న తరుణంలో తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన ఛాలెంజ్ మహిళలపై ఉందన్నారు. రచయిత్రులు, కవులు ఉప్పల పద్మ, సునంద, జ్వలిత, సంధ్య విప్లవ్, రూపారుక్మిణిలు మాట్లాడుతూ… 52 మంది మహిళా రచయితల అంతరంగాన్ని ఒకే పుస్తకంలో ఆవిష్కరించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత మహిళా రచయిత్రుల నుంచి రచనలు పెరిగాయన్నారు. అనేక అవరోధాలను దాటుకుని ముందుకు వస్తున్న మహిళా రచయితలకు అభినందనలు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాహిత్య పిపాసను పెంచాలని నొక్కి చెప్పారు. అనంతరం అమ్మంగి వేణుగోపాల్, బీఎస్.రాములు, ఎలనాగ, కాలువ మల్లయ్య, ఆశారాజు, ముదిగంటి సుజాతారెడ్డి, తదితరులను తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో సత్కరించారు.
తెలంగాణ సినిమా పాలసీ తీసుకురావాలి : సినిమా సాహిత్యంపై చర్చలో వంశీకృష్ణ, పొన్నం రవిచంద్ర, హెచ్.రమేశ్‌బాబు
తెలంగాణ సినిమా పాలసీ తీసురావాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సినీ విమర్శకులు, రచయితలు వంశీకృష్ణ, పొన్నం రవిచంద్ర, హెచ్.రమేశ్‌బాబు అన్నారు. ప్రముఖ కవి, విమర్శలు ప్రసేన్ అధ్యక్షతన సినిమా సాహిత్యంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కథలకు, దర్శకులకు కొదవలేదనీ, నిర్మాతలకు కొదవ ఉందని చెప్పారు. థియేటర్లు కొంత మంది చేతుల్లో బందీ అయ్యాయని వాపోయారు. తెలంగాణ కళాకారులకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదని ఎత్తిచూపారు.
తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గద్దర్ అవార్డులకే పరిమితమైందనీ, కళాకారులకు ప్రోత్సాహం, అవకాశాలు చూపెట్టడంతో విఫలమైందని విమర్శించారు. తెలంగాణలోని యువకళా కారులను, దర్శకులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ కళాకారులకు స్టూడియోల కోసం స్థలాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ఔత్సాహికులకు తలా రెండు కోట్లు ఇచ్చినా, ఏటా వంద కోట్లు కేటాయించినా అద్భుతమైన సినిమాలు వస్తాయని నొక్కి చెప్పారు. సినీరంగాన్ని చాలా మంది ఒక సాహిత్యం చూడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్చను గంగాధర్ సమన్వయం చేశారు.
విమర్శనా దృక్పథం మరింత పెరగాలి : సాహిత్య విమర్శకులు పి.జ్యోతి, చందుశివన్న, మహేందర్, బండారి రాజ్‌కుమార్
సాహిత్యప్రక్రియలో విమర్శనా దృక్పథం మరింత పెరగాలని సాహిత్య విమర్శకులు పి.జ్యోతి, చందుశివన్న, మహేందర్, బండారి రాజ్‌కుమార్ ఆకాంక్షించారు. ప్రముఖ విమర్శకులు, కవి బెల్లి యాదయ్య అధ్యక్షతన సాహిత్యంపై విమర్శ అనే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రచయితలను చూసి విమర్శ చేసే ధోరణి మారాలని అభిప్రాయపడ్డారు. సాహిత్య విమర్శ చేసే సమయంలో పాజిటివ్, నెగిటివ్ కోణాలను ముక్కుసూటిగా రాయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దోషాన్ని గుర్తించి ఆ పుస్తకానికి సంపూర్ణత చేకూర్చేలా ఆ పుస్తకంలోని అంతసారాన్ని పట్టుకుని ముందుకెళ్లాలని సూచించారు. సాహిత్యంపై విమర్శ చేసేవారు తగ్గుతుండటం పట్ల ఆందోళన వెలిబుచ్చారు.
యువ రచయితలను ప్రోత్సహించడంలో ముందు వరుసలో తెలంగాణ సాహితి : కోయి కోటేశ్వరరావు, యాకూబ్
అనంతరం తెలంగాణ సాహితి హైదరాబాద్ నగర కమిటీ ప్రచురించిన ‘గోలకొండ కలాలు’ కవితా సంకలనాన్ని కవి యాకూబ్ ఆవిష్కరించారు. ఏవీ. కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కోయి కోటేశ్వరరావు, రాధా కుసుమ, ఏభూషి నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోయికోటేశ్వరావు, యాకూబ్ మాట్లాడుతూ… యువ రచయితలను ప్రోత్సహించడంలో తెలంగాణ సాహితి ముందు వరుసలో ఉంటుందని కొనియాడారు.
అస్తిత్వ పోరాటాలు, బతుకు పోరాటాలు, సామాజిక పోరాటాల నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతం కంటే తెలంగాణలో ఎక్కువ సాహిత్యం పుట్టుకొచ్చిందని తెలిపారు. తమలాంటి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడంలో తెలంగాణ సాహితి పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో శ్రీసుధ, సలీం కంది కొండ, బూరుగు గోపికృష్ణ, మాడుగుల రాములు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 40 మందికిపై కవులు తమ కవితలను చదివి వినిపించారు. అనంతరం కవులు, రచయితలకు సన్మానాలు చేసి జ్ఞాపికలు, సర్టిఫికెట్లను అందజేశారు.
తెలంగాణ నవలా రచనల్లో పోరాట జీవితాలే ఎక్కువ
ప్రముఖ విమర్శకులు కేపీ.అశోక్‌కుమార్, శాంతిప్రబోధ, రూప్‌కుమార్ డబ్బీకార్
తెలంగాణ నవలా రచనల్లో అడుగడుగునా పోరాట జీవితాలే ఎక్కువ కనిపిస్తాయని ప్రముఖ సాహిత్య విమర్శకులు కేపీ. అశోక్‌కుమార్, శాంతి ప్రబోధ, రూప్‌కుమార్ డబ్బీకార్ తెలిపారు. తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌లో భాగంగా యువ రచయిత నర్రా ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన నవలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాట, తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన అనేక నవలలు ప్రజల్లో చైతన్యం నింపాయని తెలిపారు. ఆనాటి తెలంగాణ సామాజిక పరిస్థితులను కండ్లకు కట్టినట్టు చూపెట్టాయని వివరించారు. తెలంగాణ భాష ఇతివృత్తంగా, కాలానుగుణ పరిస్థితుల ఆధారంగా నవలలు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అలాంటప్పుడే తెలంగాణ రచయితలు రాసే నవలలకు మరింత పేరు వస్తుందన్నారు. నవలా రచనలోకి మరింత యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.



