‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుతున్న నాటకం, వింత నాటకం’ అని తాతా మనవడు సినిమాలో కుటుంబ సంబంధాలలో వచ్చిన మార్పులకు బాధపడుతూ పాడే పాట అది. ఇప్పటికి మూడు తరాలు మారాయి. ఇపుడు మరింత కఠినంగా, క్రూరంగా, ఘోరంగా మారిన సంబంధాలపై మరో వేదనాగీతాన్ని పాడుకోవాల్సి ఉంది. దుర్మార్గంగా మారిన మానవ సంబంధాలపై ప్రజలలో కుటుంబాలలో తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భయాలకూ గురవుతున్నారు. కొందరైతే ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థంకాక నిశ్చేష్టులవుతున్నారు. కొందరు నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను, వారి ఆలోచనా ధోరణులను తిట్టిపోస్తున్నారు. కానీ వ్యక్తులు, ఆలోచనలు అలా మారడానికి నిజమైన కారణాలను తెలుసుకుని విశ్లేషించకపోతే, మనం దేనిపై పోరాడాలో, వేటిని నిర్మూలించుకోవాలో స్పష్టంగా బోధపడదు. మనం నివసిస్తున్న ఈ సమాజమే, దాని గమనమే ఈ దారుణ ఆలోచనలకు పురుడుపోస్తోంది.
ఇటీవల మన రాష్ట్రంలో ఇరుగుపొరుగులో జరుగుతున్న సంఘటనలు ఊహకు అందనివిగా ఉన్నాయి. ఒక తల్లి తన సౌఖ్యానికి అడ్డుగా ఉందని బిడ్డను చంపేయడం. తన ప్రేమకు, సహజీవనానికి ఆటంకంగా మారిందని ఒక కూతురు తల్లిని గొంతు నులిమి మరీ చంపడం. ప్రియుడితో కొనసాగేందుకు తాళికట్టిన భర్త అడ్డంకిగా ఉన్నాడని ప్రణాళికవేసి హతమార్చడం. ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో మానవ సంబంధాలలో వచ్చిన మార్పుల గురించి వాటి కారణాల గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొందరు మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని మాట్లాడుతున్నారు. కానీ నేర ప్రవృత్తికి జెండర్, ప్రాంతం, కులం, మతం, జాతి భేదాలు పెద్దగా ఉండవు. పురుషాధిక్య సమాజంలో పురుషులు స్త్రీలపై చేసే నేరాలే ఎక్కువగా ఉంటాయి. కానీ అవి సాధారణీకరమైపోయి, ఇప్పుడివి కనపడగానే ప్రత్యేకంగా చూస్తాము. అసలు సమాజంలోనే నేరాల శాతం పెరిగింది. కుటుంబంలో మానవ విలువలన్నీ ధ్వంసమవుతున్నాయి. నైతిక విలువల పతనం, బాధ్యతారాహిత్యం, విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయి.
హింసా ప్రవృత్తి పెరగడానికి ఏయే అంశాలు దోహదం చేస్తాయి? అసలు మన మానసిక స్థితిని తీర్చే సాధనాలేమిటో తెలుసుకోవాలి. కుటుంబము మొదటిది. తర్వాత పాఠశాల అంటే విద్యా వ్యవస్థ. ఆ తర్వాత మతం, దాని తాత్వికత, ఆచరణ. కులం అందులో భాగమే. సాంస్కృతిక సామాజిక వ్యవస్థ. ముఖ్యమైనది రాజ్యం, పాలనా విధానం. పాఠశాల, విద్య లక్ష్యాలు ఫలితాలు మారిపోయాయి. విద్య వ్యాపార వస్తువైంది. ఫలితంగా మార్కులు, ర్యాంకులు వాటి లక్ష్యాలయ్యాయి. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి విద్యనే నేర్చుకున్న తల్లిదండ్రులు పిల్లల్ని తమ ఆకాంక్షలకు, లక్ష్యాలకు అనుగుణంగా తయారుచేసే పనిలో ఉన్నారు. డబ్బుపెట్టి కొంటున్న విద్య, తిరిగి డబ్బు సంపాదనకు ఉపయోగపడాలనేది దీని నీతి. కాబట్టి డబ్బు ప్రధానం. మనిషికాదు. ప్రపంచీకరణతో వ్యాపార, వస్తు వినియోగ, విలాస జీవన సంస్కృతిని పెంచి పోషించింది. అనుభవించడం, ఆనందించడమే పరమార్థంగా మార్కెట్ మనిషిని మార్చింది. ఇప్పుడున్న మనుషులు మార్కెట్ మలచిన మనుషులు. కుటుంబాలలోకి మార్కెట్ విలువలే ప్రవేశించాయి. ఈ వ్యాపార లాభాలకనుగుణమైన నీతిని, న్యాయాన్ని, చట్టాన్ని, భాషను, ప్రవర్తనను మార్చుకున్నది.
ఒకసారి మీరు సినిమా కళను పరీక్షించండి. దేవదాసు సినిమాలో పారు కోసం, ఆమెపై ప్రేమతో జీవితాంతం ఎదురుచూస్తూ మత్తుకు బానిసై మరణిస్తాడు తప్ప, ఆమెనేమీ అనడు. ‘నిరీక్షణ’ సినిమాలో తాను ప్రేమించినవాడు జైలుకుపోయినా, తిరిగి వస్తాడని వార్థక్యం వరకూ వేచి చూస్తుంది నాయిక. ప్రేమాభిషేకంలో తాను చనిపోతానని తెలిసి, ప్రేయసి జీవితాన్ని దుఃఖమయం చేయటమెందుకని, ఆమే ద్వేషించేట్లుగా మారతాడు. కానీ నేటి సినిమాలు, ఆమె ప్రేమించకున్నా వన్ సైడ్ లవ్ వచ్చింది. తర్వాత నేను ప్రేమిస్తే, నన్ను నువ్వూ ప్రేమించాలి. అంతేకాదు, నేను ప్రేమించినది వేరే వాళ్లకుదక్కడానికి వీలులేదు. ఇవి మార్కెట్ విలువల ఆధారంగా వస్తున్న ఆలోచనలు. మతాన్ని కూడా అలానే మార్చారు.
ఆనాడు అన్ని మతాల సారం దేవుడు ఒకడే అని నమ్మారు. ఇపుడు నా మతం, నా దేవుడే గొప్ప అనేది వచ్చింది. అంతేకాదు, ఇతర మతాన్ని, దేవుడ్ని ద్వేషించడం పెరిగింది. ఇది ద్వేష భావాన్ని మనిషిలో నింపుతోంది. నేటి యుద్ధ లక్ష్యాల్లో కూడా ఆధిపత్యమూ, వ్యాపారము, లాభాలే ప్రధాన లక్ష్యాలు. అఃతస్సారంగా సాంస్కృతిక జీవనంలోనూ ఇదే ప్రతిబింబిస్తోంది. విపరీత వ్యాపార సాధనాలుగా మారిన సెల్ఫోన్లు, సోషల్ మీడియా, సినిమాలు, అందులోని కంటెంట్ అంతా మనుషుల్లోని ఉద్వేగాలను, సహజ కోర్కెలను రెచ్చగొట్టి, తమ లాభాలను పిండుకోవటానికి సాగుతోన్న దాడి మూలంగా స్వార్థం, నేర ప్రవృత్తి పెరుగుతోంది. చంపడం, నరకడం, హింసించడం ఏదయినా సాధారణం, సామాన్యమయిపోతున్న మానసిక స్థితిని ఇవి కల్పిస్తున్నాయి. చంపడమేకాదు, చావడం కూడా టేకిట్ ఈజీ పాలసీ మార్కెట్ సృష్టించిందే. శారీరక సౌఖ్య సుఖాలే ప్రధానం చేసింది ఈ మార్కెట్ సంస్కృతి. నేరమూ దాని ఫలమే. ప్రజాస్వామిక విలువలను, మానవీయ సంబంధాలను, నైతికతను నిలబెట్టేందుకు నిరంతరం ఈ దుష్టత్వంపై పోరాటం చేయాల్సిందే!