లేకుంటే లీగల్‌గా ముందుకెళ్తాం : బీజేపీఎల్పీ ఉప నేత పాయల్ శంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలనీ, లేకపోతే లీగల్‌గా ముందుకెళ్తామని బీజేపీ ఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోసను పోసుకుంటున్నదని విమర్శించారు. ఫసల్ బీమాలో రైతు భాగస్వామ్యం అయివుంటే ఇవాళ ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతాంగం ఆగమైందన్నారు. 
తక్షణమే నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం భేషరతుగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పరిహారం కోసం రైతులకు అండగా నిలబడతామనీ, రైతాంగ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన పంట నష్టాన్ని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టం జరిగిన ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్‌చార్జిగా నియమించి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. మంత్రులు జూబ్లీహిల్స్‌లో కాకుండా వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు.

 
                                    