సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్
గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు…
సీసీ కెమెరాల ద్వారా జాతరను పరిశీలించిన డీజీపీ
నవతెలంగాణ-ములుగు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మూడో రోజైన శుక్రవారం భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెల వద్దకు చేరుకోవడంతో మేడారం జనసంద్రంగా మారింది. ప్రముఖులు సైతం సందర్శనకు రావడంతో రహదారులన్నీ రద్దీగా మారాయి. శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. వారు వనదేవతలను దర్శించుకుని నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి దనసరి అనసూయ కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు పసుపు, కుంకుమ అందించారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ వుమెన్ అమ్మవారి దర్శనం చేసుకొని నిలువెత్తు బంగారం చెల్లించారు. అనంతరం గద్దల వద్ద జరిగిన నూతన కట్టడాలు అభివృద్ధి గురించి, అందులోని విశేషాలు గురించి మంత్రి సీతక్క ఆయనకు వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ్ మేడారానికి విచ్చేసి తల్లులకు మొక్కులు సమర్పించారు. అలాగే, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మేడారం జాతరను సందర్శించి వనదేవతల దర్శనం చేసుకున్నారు.
మేడారంలో మొక్కులు చెల్లించుకున్న డీజీపీ, తదితరులు
మేడారంలో సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీ సౌమ్య మిశ్రా, పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురాం తదితరులు దర్శించుకుని మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా జాతరలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ పరిస్థితులను ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను అడిగి తెలుసుకున్నారు. కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల ద్వారా మేడారం పరిసర ప్రాంతాలను పరిశీలించారు.



