జీడీపీ 5.7 శాతానికి పతనం : మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో భగ్గుమంటున్న చమురు మంట భారత వృద్ధి రేటుకు విఘాతాన్ని కల్పించనుందని అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం మోర్గన్ స్టాన్లే హెచ్చరించింది. ముడి చమురు ధరలు ఒక్క త్రైమాసికం పాటు బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరితే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత వృద్ధి 5.7 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషించింది. కరోనా మహమ్మారి తర్వాత భారత్ నమోదు చేసే అత్యల్ప వృద్ధిరేటు ఇదే అవుతుందని మంగళవారం విడుదల చేసిన చేసిన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే 111 డాలర్ల పైనే కొనసాగుతుండటం.. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువకు..
చమురు ధరల పెరుగుదల దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఒకవేళ చమురు 150 డాలర్ల మార్కును తాకితే.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ గరిష్ట పరిమితి అయిన 6 శాతం దాటిపోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. దీనికి తోడు కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) కూడా జీడీపీలో 3 శాతానికి పెరిగే ముప్పు ఉంది. సాధారణ పరిస్థితుల్లో బ్రెంట్ క్రూడ్ సగటున 95 డాలర్ల అంచనాతో భారత జీడీపీని గతంలోని 6.5 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించింది. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.1 శాతానికి పెంచడం గమనార్హం.
మందగమనానికి మూడు కారణాలు..
ఈ వృద్ధి మందగమనానికి ప్రధానంగా మూడు కారణాలను నివేదిక విశ్లేషించింది. ఇంధనం, ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమై తయారీ రంగంపై ప్రభావం పడుతుంది. రెండోది నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గి వినియోగం మందగిస్తుంది. ఇక మూడో కారణం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రభావిత ప్రాంతాలకు ఎగుమతులు తగ్గడం. వెరసి, ముడిచమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై బహుముఖ ప్రభావం చూపే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది.
భారతవృద్ధికి ముడి చమురు విఘాతం
- Advertisement -
- Advertisement -



