Monday, November 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుల్కచర్లలో దారుణం

కుల్కచర్లలో దారుణం

- Advertisement -

ముగ్గురిని హత్య చేసి తానూ ఆత్మహత్య
కుటుంబ కలహాలే కారణం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌


నవతెలంగాణ-కుల్కచర్ల
కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై పాశవికంగా వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు.. నిద్రలో ఉన్న వారిపై విచక్షణ కోల్పోయి ముగ్గురినీ అతికిరాతకంగా హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్య(38) మహబూబ్‌నగర్‌ జిల్లా గండ్వీడ్‌ మండలం పగిడ్యాల్‌ గ్రామానికి చెందిన అలివేలు(32)ను 14 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి అపర్ణ, శివాణి(4) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గొడవపడ్డ ప్రతిసారి అలివేలు తన పుట్టింటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న అలివేలు అక్క హనుమమ్మ(40) కుల్కచర్ల మండల కేంద్రానికి వచ్చి గ్రామంలోని పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. పెద్దమనుషులు యాదయ్యను మందలించి సక్రమంగా కాపురం చేసుకోవాలని సూచించారు.

ఇది అవమానంగా భావించిన యాదయ్య తన పరువు పోయిందని శనివారం అర్థరాత్రి 1.30 గంటలకు ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు, కూతురు శివాణి, అలివేలు అక్క హనుమమ్మను వేట కోడవలితో కిరాతకంగా దాడి చేశాడు. కుటుంబీకులను హత్య చేశానని భావించిన యాదయ్య తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురు అపర్ణపై కూడా కత్తితో దాడి చేయగా స్పృహ కోల్పోయింది. ఆమె తల, చేతికి గాయాలయ్యాయి. స్పృహలోకి వచ్చిన అపర్ణ బంధువులకు, ఇరుగుపొరుగు వారికి జరిగిన ఉదాంతాన్ని తెలిపింది. స్థానికులు వెంటనే కుల్కచర్ల పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన అపర్ణను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, తన సిబ్బందితో ఘటనాస్థలానికి వెళ్లి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలివేలు అన్న తోక నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రమేష్‌కుమార్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -