Friday, February 27, 2026
E-PAPER
Homeఆటలుదంచికొట్టారు

దంచికొట్టారు

- Advertisement -

జింబాబ్వేపై 72 పరుగులతో ఘన విజయం
టీమ్‌ ఇండియా సెమీఫైనల్‌ ఆశలు సజీవం
రాణించిన అభిషేక్‌, హార్దిక్‌, తిలక్‌, అర్ష్‌దీప్‌

భారత్‌ 256/4 జింబాబ్వే 184/6

భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. సెమీఫైనల్‌ రేసులో ఆశలు సజీవంగా నిలిచేందుకు అవసరమైన భారీ విజయాన్ని అందించారు. అభిషేక్‌ శర్మ (55), హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌), తిలక్‌ వర్మ (44 నాటౌట్‌) మెరవటంతో భారత్‌ 256/4 పరుగుల రికార్డు స్కోరు చేసింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు. రికార్డు ఛేదనలో బ్రయాన్‌ బెనెట్‌ (97 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీతో పోరాడినా.. జింబాబ్వే 184/6 పరుగులే చేసింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/24) మూడు వికెట్లతో మెరిసినా.. ఇతర బౌలర్లు వికెట్ల వేటలో, పరుగుల నియంత్రణలో అంచనాలను అందుకోలేదు. 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌ సెమీఫైనల్‌ రేసులో నిలిచింది.

నవతెలంగాణ-చెన్నై
జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసులో ఆశలను సజీవంగా నిలుపుకుంది. రికార్డు 257 పరుగుల ఛేదనలో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులే చేసింది. ఓపెనర్‌ బ్రయాన్‌ బెనెట్‌ (97 నాటౌట్‌, 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. మారుమణి (20, 20 బంతుల్లో 2 సిక్స్‌లు), సికందర్‌ రజా (31, 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/24) మూడు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (55, 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌, 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించగా, తిలక్‌ వర్మ (44 నాటౌట్‌, 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. హార్దిక్‌ పాండ్య ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

అభిషేక్‌ మెరిసెన్‌
ప్రపంచకప్‌లో వరుసగా నిరాశపరిచిన అభిషేక్‌ శర్మ (55) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగిన అభిషేక్‌ 26 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (24) జతగా తొలి వికెట్‌కు శుభారంభం అందించిన అభిషేక్‌.. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. సహజశైలిలో ఎదురుదాడి చేసినా.. స్లో బాల్స్‌ను స్టాండ్స్‌లోకి పంపటంలో ఇబ్బంది పడ్డాడు. రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో ఆకట్టుకున్న సంజు శాంసన్‌.. భారీ షాట్‌కు వెళ్లి వికెట్‌ కోల్పోయాడు. ఇషాన్‌ కిషన్‌ (38) 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో దండెత్తినా.. వికెట్‌ కాపాడుకోలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ (33) 3 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అభిషేక్‌, సంజులు 48 పరుగులు, అభిషేక్‌, కిషన్‌లు 72 పరుగులు, అభిషేక్‌, సూర్యలు 30 పరుగుల భాగస్వామ్యాలు జోడించి భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు.

హార్దిక్‌, తిలక్‌ అదరహో
14.2 ఓవర్లలో 172/4తో ఉన్న భారత్‌ను హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌), తిలక్‌ వర్మ (44 నాటౌట్‌) తిరుగులేని స్థితిలో నిలబెట్టారు. హార్దిక్‌ కాస్త నెమ్మదిగా బాదినా.. తిలక్‌ వర్మ వస్తూనే బౌండరీతో దండయాత్ర చేశాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 బంతుల్లో హార్దిక్‌ పాండ్య అర్థ సెంచరీ సాధించాడు. 4 సిక్సర్లు, 3 ఫోర్లతో తిలక్‌ 16 బంతుల్లోనే 44 పరుగులు పిండుకున్నాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 31 బంతుల్లోనే 84 పరుగులు జోడించింది. దీంతో భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పవర్‌ప్లేలో 80/1తో నిలిచిన భారత్‌.. మిడిల్‌ ఓవర్లలో 107/3, డెత్‌ ఓవర్లలో 69/0 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా (1/29) రాణించాడు.

సిక్స్‌తో మొదలెట్టి..
ప్రపంచకప్‌లో నిరాశపరిస్తూ వచ్చిన భారత బ్యాటర్లు జింబాబ్వేపై బ్యాట్‌ ఝులిపించారు. 17 సిక్సర్లు, 17 ఫోర్లతో రెచ్చిపోయారు. బౌండరీల రూపంలోనే ఏకంగా 170 పరుగులు పిండుకున్నారు. సంజు శాంసన్‌ సిక్సర్‌తో పరుగుల వేట మొదలెట్టిన భారత్‌.. హార్దిక్‌ పాండ్య వరుస సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ స్కోరే అత్యధికం కావటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -