- Advertisement -
- వారి నుంచి రూ.30 లక్షలు కాపాడిన అధికారులు
- డిజిటల్ అరెస్ట్ చేశామంటూ బాధితుడికి నిందితుల ఫోన్‌కాల్
- 1930కు ఫోన్ చేయటం ద్వారా అప్రమత్తమైన పోలీసులు
- నేరస్థుల ఖాతాల్లోకి నగదు వెళ్లకుండా అడ్డుకున్న తీరు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
డిజిటల్ అరెస్ట్ పేరిట ఒక వ్యాపారికి చెందిన రూ.30 లక్షలను దండుకోవాలని ప్రయత్నించిన సైబర్ నేరస్థుల కుట్రకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు అడ్డుకట్ట వేశారు. సీఎస్‌బీ డీజీపీ శిఖా గోయెల్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన ఒక వ్యాపారిని మనీలాండరింగ్‌కు పాల్పడ్డావంటూ సైబర్ నేరస్థులు ఫోన్ ద్వారా బెదిరించారు. వీడియోకాల్ ద్వారా ఆ వ్యాపారిని బెదిరించటమేగాక ముంబయిలో నీపై కేసు నమోదైంది, నిన్ను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందంటూ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిందిగా పేర్కొంటూ ఓ నకిలీ పత్రాన్ని కూడా బాధితుడికి చూపించారు. ఈ కేసును ఈడీ, సీబీఐలు విచారణ జరుపుతున్నాయంటూ ఆ సంస్థల పేరిట నకిలీ అరెస్ట్ వారెంట్లను కూడా వీడియోకాల్‌లో చూపించి నిన్ను డిజిటల్ అరెస్ట్ చేశామనీ, ఎక్కడకూ కదలొద్దని బెదిరించారు. అంతేగాక రూ.30 లక్షలు తమకు పంపితే ఈ కేసు లేకుండా చేస్తామంటూ నమ్మబలికారు.
దాంతో ఆ వ్యాపారి తనకు తెలిసినవారి వద్ద బంగారం కుదువ పెట్టి రూ.30 లక్షలను ఈ సైబర్ నేరస్థులు తెలిపిన అకౌంట్‌కు పంపించాడు. దీంతో బాధితుడి మిత్రులకు అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. వెంటనే రంగంలోకి దిగిన నిజామాబాద్ సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్‌రావు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ రూ.30 లక్షలు సైబర్ నేరస్థుల ఖాతాలోకి వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిలు, ఈడీ, సీబీఐ, ఇతర పోలీసు అధికారుల పేరిట వచ్చే కాల్స్‌ను ఎవ్వరూ విశ్వసించరాదనీ, ఆ విధంగా కాల్స్ వస్తే వెంటనే తమకు సమాచారాన్ని అందించి సహాయపడాలని సీఎస్‌బీ డీజీ శిఖా గోయెల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -