పిల్లలు, పెద్దల రక్షణకోసం చర్యలు..: డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు, వికలాంగులను కనిపెట్టడానికి పోలీసు శాఖ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ (సీటీఎంఎస్) రిస్ట్ బ్యాండ్ పేరిట ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శనివారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ రిస్ట్ బ్యాండ్‌ను డీజీపీ ఆవిష్కరించారు. వొడాఫోన్, ఐడియా ఫోన్ కంపెనీల సహకారంతో ఈ వినూత్న రిస్ట్ బ్యాండ్‌ను ఎస్‌ఐబీ ఐజీ సుమతి రూపొందించారని ఆయన తెలిపారు. దీనికి అమర్చిన క్యూఆర్ కోడ్ ఆధారంగా ఈ జాతరలో ఎక్కడ పిల్లలు, వృద్ధులు తప్పిపోయినా వారిని గుర్తించడానికి వీలవుతుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…..ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని వివరించారు. ఇంతటి భారీ రద్దీలో చిన్న పిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగులు తప్పిపోయే అవకాశం ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వారి భద్రతను పటిష్టం చేయడానికే ఈ సాంకేతికతను తీసుకొచ్చామని తెలిపారు. ఎస్‌ఐబీ ఐజీ బి.సుమతి గత ఒకటిన్నర నెలలుగా కష్టపడి ఈ విధానాన్ని సిద్ధం చేశారని, దీనిని రూపొందించడంలో వొడాఫోన్ యాజమాన్యం అందించిన సహకారం అభినందనీయమని కొనియాడారు. మహిళా భద్రత విభాగం డీజీ చారుసిన్హా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జాతరలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా వంటి ఇతర భారీ ఉత్సవాల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని డీజీపీ అభిప్రాయపడ్డారు.ఈ సీటీఎంఎస్ విధానం ద్వారా జాతరకు వచ్చే పిల్లలు, వికలాంగుల వివరాలను నమోదు చేసి వారి చేతికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ కడతారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లోని బృందాలు పిల్లల పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లను నమోదు చేస్తాయి. ఒకవేళ ఎవరైనా తప్పిపోయి కనిపిస్తే, అక్కడి వాలంటీర్లు లేదా పోలీసు సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్‌లతో ఆ బ్యాండ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. వెంటనే వారి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఫోన్ నంబర్లు, డయల్ 100 వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల తక్షణమే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, సురక్షితంగా అప్పగించే అవకాశం ఉంటుంది. అనంతరం వారు కుటుంబంతో కలిసిన ఫోటోను కూడా సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తారు.ఈ కార్యక్రమం కోసం మొత్తం 25,000 రిస్ట్ బ్యాండ్లను అందుబాటులో ఉంచారు.
ఇవి ఈ నెల 27 నుంచి 31 వరకు 24 గంటల పాటు పనిచేసే 11 కేంద్రాల్లో లభిస్తాయి. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్‌లోని ఉప్పల్ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్‌స్టేషన్లతో పాటు వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా భద్రత విభాగం, టీజీఎస్‌ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా క్యూఆర్ కోడ్ బ్యాండ్ ధరించిన వ్యక్తి ఒంటరిగా కనిపిస్తే వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ లు మహేశ్ ఎం. భగవత్, చారుసిన్హా, డి.ఎస్. చౌహాన్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, బి.సుమతి, డాక్టర్ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.



