Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రపంచానికి స్ఫూర్తి క్యూబా

ప్రపంచానికి స్ఫూర్తి క్యూబా

- Advertisement -

క్యూబాలో గత సంవత్సరం మార్చి నెలలో పర్యటించాను. అయినా నాటి స్మ ృతులు నేటికీ మదిలో పదిలంగా వున్నాయి. ప్రజాశక్తి పత్రిక ఎడిటర్‌గా తోటి వామపక్ష పత్రికల సంపాదక బృందంతో కలిసి క్యూబాలో మేము చూసిన అద్భుత అభివృద్ధి నేడు అమెరికా ఆంక్షల తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటోంది. నాటి పర్యటనలో మేము గమనించిన అనేక అంశాల్లో కొన్ని…

చే స్మారక కేంద్రానికి చేరుతుండగానే ఒక విధమైన స్ఫూర్తి మమ్మల్ని ఆవహించింది. అక్కడ భద్రపరచిన ప్రతి వస్తువూ, చిత్రపటాలు ఉత్తేజాన్నిచ్చాయి. చే వాడిన పెన్ను, గన్నులతోపాటు ఆయన ఉపయోగించిన కెమేరా, బైనాక్యులర్స్‌, పెట్రోమాక్స్‌ లైట్‌తో సహా అక్కడ ప్రదర్శించారు. ఆయన చేతి రాతలు లేఖలు, డైరీ ప్రతులు భధ్రపరిచారు. దేశాభివృద్ధి కోసం చే సాగించిన శ్రమదాన కార్యక్రమాల ఫొటోలు, కార్యకర్తలకు సూచనలిస్తున్నవీ ఉత్తేజం కలిగిస్తాయి. చే విప్లవ గమనంలో చివరి మజిలీ, సిఐఎ కుట్రతో గాలించి ఆయనను హత్యగావించిన వైనాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. చే అమరజ్యోతి వెలిగే హాల్లో నిశ్శబ్దం, వెలుపల వివిధ దేశాల పర్యాటకుల సందడి ఓ ఆశ్చర్యంలా ఉంటుంది.

ప్రాథమిక అవసరాలు ప్రభుత్వ బాధ్యత
క్యూబాలో విద్య, వైద్యం, గృహవసతి పూర్తిగా ఉచితం. అయితే ఆయా కుటుంబాలు వినియోగించే విద్యుత్‌కు, నీటికి మాత్రం ఛార్జీలు చెల్లించాలి. ఇంటి సివిల్‌వర్క్‌ రిపెయిర్లతోసహా ప్రభుత్వమే నిర్వహిస్తుంది కానీ గృహోపకరణాల్ని నివాసితులే సమకూర్చుకోవాలి. ఇంటి కేటాయింపులో వారి పని ప్రదేశానికి సామీప్యత, మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య ప్రధానమైన కొలబద్దలు చూస్తారు. బియ్యం, రొట్టె, బీన్స్‌, కోడిగుడ్లు, వంటనూనె తదితర సరుకులు నామమాత్ర ధరకు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి రేషన్‌ షాపుల ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. లభ్యతను బట్టి మాంసం కూడా కొన్ని సందర్భాల్లో రేషన్‌ షాపుల ద్వారా ఇస్తారు.

ప్రజల స్నేహభావం
క్యూబా ప్రజలు భారతదేశం పట్ల చాలా ప్రేమ చూపుతారు. రోడ్డు వెంట నడుస్తున్నప్పుడు ప్రజలు దగ్గరికి వచ్చి ‘మీది భారతదేశమా?’ అంటూనే- ‘మీకు ఏదైనా సహాయం కావాలా?’ అని అడుగుతారు. ఆపై వీడ్కోలు చెప్పి వెళ్లిపోతారు. క్యూబన్‌ ఆహారంలో రుచి కంటే ఆరోగ్యంపై దృష్టి ఎక్కువ. వాటిలో ఏవీ కారంగా లేవు. బాగా ఉడికిస్తారు. చికెన్‌, మటన్‌, పంది మాంసం మీకు నచ్చిన విధంగా దొరుకుతాయి. చేపలు ఎక్కువగా లభిస్తాయి. కూరగాయలు, ఆకు కూరలు వండినవి, పచ్చివీ ఆహారంతో వడ్డిస్తారు.

సమిష్టి క్షేత్రాల్లో వ్యవసాయం
ప్రపంచ విప్లవకారునిగా పేరొందిన చే గువేరా మెమోరియల్‌కు హవానాకు 300 కిలోమీటర్ల దూరంలోని శాంటాక్లారాను మేం సందర్శించాం. జాతీయ రహదారి పొడవునా చెట్ల నీడ, పంట పొలాలు ఉన్నాయి. అక్కడ వ్యవసాయం సమిష్టిగా చేస్తారు. భూసారం, సాగు నీటి లభ్యతను బట్టి పంటలు పండిస్తారు. ఎక్కడ ఏ పంట వెయ్యాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వందల ఎకరాల భూఖండాల్లో ఒకే పంట సాగు చేస్తున్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు (కనిష్టంగా వాడతారని చెప్పారు) సరఫరా చేస్తారు. పనిముట్లు సొసైటీవే. రైతులు ఆ క్షేత్రాల్లో పని చేసినందుకు వేతనం పొందుతారు. పంట అమ్మాక డివిడెండ్‌ లభిస్తుంది. పనిని బట్టి స్త్రీ పురుషులందరికీ సమాన వేతనం ఇస్తారు. రోజుకు ఎనిమిది గంటల పని, ఆదివారం సెలవు.

కాస్ట్రో నినాద స్ఫూర్తి
సోషలిజం ఎదురుదెబ్బలు తిని, సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమై ప్రపంచం అతలాకుతలమవుతున్న సమయంలో క్యూబా విప్లవ నేత, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫిడల్‌ కాస్ట్రో ఇచ్చిన ‘సోషలిజం, కాకపోతే మరణం’ అన్న నినాదం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక అనిర్వచనీయమైన శక్తినిచ్చింది. కానీ, క్యూబా ఇప్పుడు కొత్త పరిస్థితిలో ఉంది. అమెరికా ఆంక్షలు దాని ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం ప్రారంభించాయి. సోషలిస్ట్‌ దేశమైన క్యూబా ఆర్థిక వ్యవస్థ చక్కెర, పొగాకు, కాఫీ ఎగుమతిపై ఆధారపడి అభివృద్ధి చెందింది. ప్రసిద్ధ హవానా సిగార్లు పొగాకు వ్యవసాయానికి పునాది. అలాగే చక్కెర, ఇథానాల్‌, రమ్‌ తయారీకి చెరకు పంట పునాది. క్యూబా ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. 64.12 శాతం మంది శ్వేతజాతీయులు, 26.62 శాతం మంది మిశ్రమ జాతి వారు, 9.26 శాతం మంది ఆఫ్రికా- క్యూబన్‌ జాతి సమూహాలు. 58.9 శాతం మంది క్రైస్తవులు, 17.6 శాతం మంది ఇతర జానపద మతాలకు చెందినవారు ఉన్నారు. అలాగే మత విశ్వాసులు లేనివారు కూడా 23.2 శాతం మంది ఉన్నారు. క్యూబా జాతి, మత వివక్షలు లేని దేశం.

మహిళల ముందంజ
సోషలిస్ట్‌ వ్యవస్థలో వినిమయతత్వాన్ని పెంచి పోషించే మార్కెట్‌ వ్యవస్థ అభివృద్ధి చెందే అవకాశం లేదు. ప్రజల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వమే తీరుస్తుంది. నివాస ప్రాంతాల్లోనూ, కొన్ని రోడ్లపైనా ఇంటిలోని ముందు గదిని షాపులా మార్చి, రిటైల్‌ వ్యాపారం సాగుతోంది. అక్కడ పచారీ సామాన్లతోపాటు కొన్నిచోట్ల బట్టలు తదితర రోజువారీ అవసరమైన సరుకులూ అమ్ముతారు. దాదాపు అన్నీ నిర్ణీతధారలే ఉంటాయి. అయితే కూడలి ప్రదేశాల్లో చిన్న సంతల మాదిరిగా ఉండే వాటిలో వివిధ సరుకులు ముఖ్యంగా పర్యాటకులు కొనడానికి బహుమతులు అమ్ముతారు. అక్కడ బేరాలుంటాయి. సంగీతం, కళ క్యూబన్ల గుండెల్లో ఉన్నాయి. వారు శ్రావ్యత కంటే పాప్‌ సంగీతాన్ని ఇష్టపడతారు. జానపద నృత్యాలు కూడా సంస్క ృతిలో భాగం. అన్ని వయసులవారూ ఉత్సాహంగా పాల్గొంటారు. సినిమా థియేటర్లు పుష్కలంగా ఉన్నాయి.

సమాజంలోని అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉన్నారు. వివిధ సంస్థలను మహిళలే నడుపుతున్నారు, నిర్వహిస్తున్నారు. నిరంతర ఆవిష్కరణల ద్వారా మాత్రమే ఏ గొప్ప దార్శనికత అయినా ముందుకు సాగగలదని క్యూబా అనుభవం మనకు తెలియజేస్తుంది. అమెరికా ఆంక్షలు క్యూబాకు ఆటంకం అయినప్పటికీ, వారు ఉన్నత రాజకీయ విధానాన్ని ఆయుధంగానూ రక్షణగాను ఉపయోగిస్తున్నారు. మార్క్సిజానికి కట్టుబడి, బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ సాగుతున్న క్యూబా ప్రగతిగాముకులకు ప్రభావశీలి. క్యూబా అన్ని విముక్తి పోరాటాలతో లోతుగా అనుసంధానించబడిన దేశం. క్యూబా అనేది ఒక దేశం పేరు మాత్రమే కాదు; సంక్షోభాలతో పోరాడుతున్న ప్రపంచానికి ఒక బలం. ఆ విధంగా, క్యూబా ప్రపంచానికి ఓ స్ఫూర్తి.

ఆరోగ్య రంగం క్యూబా బలం
ఆరోగ్య రంగం క్యూబా బలం.. అందుకే ప్రకతి వైపరీత్యాలు, అంటువ్యాధుల సమయంలో ప్రపంచానికి సహాయం చేయడానికి క్యూబా వైద్యులను పారా మెడికల్‌ వర్కర్లను పంపగలిగింది. కోవిడ్‌ కాలంలో క్యూబా యాభైకి పైగా దేశాలకు వైద్యులను, వాలంటీర్లను పంపింది. క్యూబా 90 శాతానికి పైగా ప్రభావ రేటుతో వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయగలిగిందనే వాస్తవం వారి విజయాలకు సూచిక. మరింత పురోగతికి అవసరమైన పరికరాలు, ఇతర వనరులను పొందటానికి అమెరికా దిగ్బంధనం అడ్డంకిగా మారుతోంది. క్యూబా వైద్యవిధానం కూడా వేరు. ఉపయోగించే మందుల్లో గణనీయమైన భాగం ప్రకృతిసిద్ధంగా తయారుచేసినవే! బహుళజాతి కంపెనీలు తయారుచేసే ఖరీదైన ఔషధాల వినియోగం దాదాపు ఉండదని అంబులెన్స్‌లో సేవలందించే పారా మెడికల్‌ చెప్పారు.

విద్యార్థులు ఏ స్థాయిలో ఏ కోర్సు చదివినా పుస్తకాలు, భోజనం, వసతి సహా అన్నీ ఉచితమే! ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, యూనిఫాం ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. హైస్కూల్‌ చదువు తర్వాత ఏ కోర్సుకు వెళ్లాలన్నది విద్యార్థి అభిరుచిని తెలుసుకోవడంతోపాటు అతని / ఆమె సామర్ధ్యాన్ని ఉపాధ్యాయులు అంచనా వేశాక ఎంచుకుంటారు. ఫైనల్‌ ఎగ్జామ్‌కి ముందు దాదాపు మూడు నెలలు ఈ ప్రక్రియ అప్పుడప్పుడూ నడుస్తుందని మాకు సహాయపడిన కమీలా చెప్పారు. విద్యార్థి అభిరుచికే ప్రాధాన్యత ఉంటుంది. ఉన్నత విద్య పొందాలనుకునే వారెవరైనా క్యూబా చరిత్ర, గణితం, స్పానిష్‌ భాష… ఈ మూడు సబ్జెక్టులతో ప్రవేశపరీక్ష రాయాలి. వైద్య కోర్సుతో సహా ఏది చదవాలన్నా ఇది తప్పనిసరి. అందులో వచ్చిన మార్కులు తొలి ప్రామాణికం. ఇక ఏ కోర్సు తీసుకుంటారో దాన్నిబట్టి మరో పరీక్ష, కొన్నిటికి ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ కూడా ఉంటాయి. తమ బ్యాచ్‌లో హవానా విశ్వవిద్యాలయ జర్నలిజం కోర్సులో చేరడానికి 300 మందికిపైగా పరీక్ష రాయగా, 60 మందిని ఎంపిక చేశారనీ, ఇప్పుడు 58 మంది మూడో ఏడాది చదువుతున్నట్టు మార్లా చెప్పారు.

విద్యా విషయంలో అత్యున్నత ప్రమాణాలతో అధునాతన విద్య ఉచితంగా అందుతోంది. క్యూబన్లకేగాక పాలస్తీనా, ఇంకొన్ని లాటిన్‌ అమెరికన్‌, ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన విద్యార్థులకూ ఈ సౌకర్యం ఉంది. అయితే ఆయా దేశాల ప్రభుత్వాలకు, క్యూబా ప్రభుత్వానికి ఒప్పందం ఉండాలి. అలాగే స్పానిష్‌ భాష నేర్చుకోవాలి. ప్రవేశ పరీక్షలో నెగ్గాలి. ఆపైన క్యూబన్లతో సమానంగా అన్నీ ఉచితంగానే లభిస్తాయి. అలాంటి సౌకర్యం పొందిన ఒక పాలస్తీనా వైద్య విద్యార్థినితో మా ప్రతినిధివర్గం మాట్లాడింది. దాదాపు 2,000 మంది పాలస్తీనా విద్యార్థులు హాస్టల్‌ వసతి సహా ఉచితంగా చదువుతున్నారని ఆమె చెప్పారు.

– బి.తులసీదాస్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -