Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్యూబా ఎన్నటికీ లొంగదు

క్యూబా ఎన్నటికీ లొంగదు

- Advertisement -

– ఆర్‌.అరుణ్‌కుమార్‌
క్యూబన్ల ప్రతిఘటనా శక్తి అచంచలం

ప్రస్తుత కాలంలో యుద్ధాలు కేవలం కదన రంగంలోనే జరగడం లేదు, మానసికంగా బలహీనులను చేస్తూ, తామనుకున్న ఆలోచనలకు, తమ ఉద్దేశ్యాలకు ఒక రూపమిచ్చేలా సమాచార యుద్ధం కూడా సమాంతరంగా జరుగుతోంది. క్యూబా విషయంలో ఇదే జరుగుతోంది. నెల రోజులకుపైగా పశ్చిమాసియాలో భీకరంగా పోరు సాగుతోంది. ఇరాన్‌ తమకు ముప్పుగా మారిందని ఇజ్రాయిల్‌, అలాగే ఇరాన్‌ అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికా కలిసి మూకుమ్మడిగా ఆ దేశంపై యుద్ధం సాగిస్తున్నాయి. ఇరాన్‌ కూడా ఏ మాత్రమూ వెనక్కి తగ్గకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇరాన్‌ తర్వాత లక్ష్యం క్యూబానే అని ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించారు. క్యూబా ప్రజల ప్రతిఘటనా శక్తిని ఛేదించాలన్నది అమెరికా లక్ష్యంగా వుంది.
ఈ ఏడాది జనవరి చివరిలో అమెరికా ఒక ఉత్తర్వు జారీ చేసింది. క్యూబాను అసాధారణమైన ముప్పుగా ప్రకటించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య భయంకరంగా డిజిటల్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. హింసకు పాల్పడాలని, పౌర ఉల్లంఘనోద్యమం చేపట్టాలని పలుమార్లు క్యూబా ప్రజలను అమెరికా కోరింది. క్యూబాను ఒక అసాధారణమైన ముప్పు అని, ఉగ్రవాదానికి ఊతమిచ్చే, భౌగోళిక, రాజకీయ ముప్పు అని, దుష్ట కూటమిలో ఒకటి అని పేర్కొంటూ అప్రతిష్ట పాల్జేయాలని చూస్తోంది. క్యూబాలో మానవ హక్కులు లేదా ప్రజాస్వామ్యం లేవని ప్రచారం చేస్తోంది. ఇదంతా ట్రంప్‌ చాలా గుంభనంగా చేస్తున్నాడు. క్యూబా గురించి వారి దేశంలో అలాగే బయట సందేహాలు, అనుమానాలు తలెత్తేలా చేసి విదేశీ జోక్యానికి ఒక భూమికను సిద్ధం చేసుకోవాలన్నది ట్రంప్‌ లక్ష్యంగా వుంది.
క్యూబాపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న అమెరికా ఆర్థిక దిగ్బంధనం గురించి, క్యూబా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నిజమైన కారణం అమెరికా, వారి చర్యలే అని బయటి ప్రపంచం ఏ మాత్రమూ గుర్తించకుండా నివారించాలన్నది వారి లక్ష్యం. 67 సంవత్సరాలుగా యథేచ్ఛగా కొనసాగుతున్న ఆర్థిక యుద్ధం వల్లే క్యూబన్లకు సమస్యలు తలెత్తాయన్నది నిర్వివాదాంశం. క్యూబన్లలో 80శాతం మంది ఆర్థిక ఆంక్షల కాలంలోనే పుట్టి, అందులోనే జీవితాలు సాగిస్తున్నారని క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్‌ డియాజ్‌ కానెల్‌ చెప్పారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ ఆంక్షలేవీ కూడా అలాగే స్తంభించపోలేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఇవీ పెరుగుతూ వస్తున్నాయి. 2019లో ఈ ఆంక్షలు మరింత ఉధృత రూపాన్ని సంతరించుకున్నాయి. క్యూబాతో ఏ దేశమూ లేదా కంపెనీ వ్యాపారం చేయకూడదన్నది ఆ ఆంక్షల ముఖ్యోద్దేశం. క్యూబాకు అవసరమయ్యే ఏ చిన్న పరికరమూ అమెరికాలో తయారవకూడదు, మరెవరూ అందజేయకూడదు. అమెరికా ఆర్థిక సంస్థల ఆధిపత్యం, డాలరు ప్రాబల్యాన్ని దృష్టిలో వుంచుకుని అనేక కంపెనీలు ఆ ఒత్తిళ్లకు తలొగ్గాయి. 243 కొత్త ఆంక్షలు విధించారు ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాల జాబితాలో క్యూబాను చేర్చారు. సోషలిస్టు దేశంగా క్యూబాకు గల గుర్తింపును, అక్కడ సామాజిక వ్యవస్థను నాశనం చేయాలన్నదే వారి లక్ష్యంగా వుంది. ఇక్కడ విచారకరమైన అంశం ఏమంటే స్వేచ్ఛా మార్కెట్‌ను ప్రోత్సహించే పెట్టుబడిదారీ వాదం, సామ్రాజ్యవాదం క్యూబాకు మాత్రం ఆ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి నిరాకరిస్తోంది. అమెరికాను వ్యతిరేకిస్తూ ఒక బలమైన ప్రతిఘటనా శక్తిగా నిలిచిన క్యూబన్లను చీల్చి అక్కడి ప్రభుత్వానికి ఎదురు తిరిగేలా చేయాలన్నది అమెరికా ఉద్దేశంగా వుంది.

మౌలిక సదుపాయాలే లేవు
ఈ ఆంక్షల కారణంగా క్యూబన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసినట్లైతే, క్యూబన్లకు విదేశీ కరెన్సీ అనేది పూర్తిగా అందుబాటులో లేకుండా పోయింది. పర్యాటక రంగంపై ఆంక్షలు ముమ్మరమయ్యాయి. అమెరికా పౌరులెవరూ క్యూబాకు రావడానికి వీల్లేదు. ఆదాయం నిలిచిపోయింది. ఆహారం, ఔషధాలు కొరత పెరిగిపోయింది. రవాణా రంగం కుప్పకూలింది. ఆర్థిక వ్యవస్థలోని పలు విభాగాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
విదేశీ కరెన్సీ లేకపోవడంతో క్యూబా ఇంధనం కొనలేకపోతోంది. తమ విద్యుత్‌ వ్యవస్థకు అవసరమైన విడిభాగాలు సమకూర్చుకోలేకపోతోంది. థర్మో ఎలక్ట్రిక్‌ ప్లాంట్లకు కాలం చెల్లుతోంది. పెట్రో ఉత్పత్తుల దిగుమతి ప్రధాన సంక్షోభంగా మారింది. క్యూబాకు చమురు తీసుకురావడానికి షిప్పింగ్‌ సంస్థలు నిరాకరిస్తున్నాయి. అమెరికా ఆంక్షల కారణం గా అవి భయపడుతున్నాయి. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి స్తంభించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలే, దీంతో ప్రజలు పనులకు వెళ్లలేరు, పిల్లలు స్కూళ్లకు వెళ్లలేరు, మౌలిక సేవలవీ అందడం లేదు.

ఆరోగ్య రంగంపై దాడి
అమెరికా ఆంక్షలు క్యూబా ఆరోగ్యరంగంపై తీవ్రంగా దాడి చేశాయి. ఔషధాలు, వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సామర్ధ్యాలను దెబ్బతీశాయి. ముడి పదార్థాల కొరత బాగా పెరిగింది. దీంతో ఔషధాల తయారీ నిలిచిపోయింది. విషమ పరిస్థితుల్లో వుండే రోగులకు అవసరమైన వెంటిలేటర్లు వంటి ముఖ్యమైన పరికరాలేవీ అందుబాటులో లేవు. కోవిడ్‌ సమయంలో అనేక దేశాలకు మందులు, సేవలు అందించిన క్యూబా ఇప్పుడు తన ప్రజలకు కనీస సదుపాయాలు ఇవ్వలేని స్థితిలో దీనంగా నిలుచుంది. 51కి పైగా దేశాలు ఆనాడు కోవిడ్‌ సంక్షోభంలో క్యూబా సాయాన్ని తీసుకున్నాయి. క్యూబాతో ఎవరైనా వైద్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నా తీవ్రమైన పర్యవసానాలు తప్పవని అమెరికా బెదిరిస్తోంది. పేదలకు సేవ చేసే క్యూబన్‌ డాక్టర్లను బ్రెజిల్‌, ఈక్వెడార్‌ వంటి దేశాలు వెనక్కి తిప్పి పంపాల్సి వచ్చింది. లక్షా 20 వేల మందికి పైగా రోగులు ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో చిన్నారులే 11వేల మందికి పైగా వున్నారంటే వారెదుర్కొంటున్న దుర్భర పరిస్థితులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇంధన స్వాతంత్య్రం
దేశ ఇంధన అవసరాల్లో కేవలం 40శాతం తీర్చుకునే చమురు వనరులే క్యూబాకు వున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్యూబా వినూత్నంగా ఆలోచించింది. కొన్ని చర్యలు అమల్లో పెట్టింది. ఫలితంగా కొత్త రిఫైనింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసుకుని, ముడి చమురు వెలికితీతతో వచ్చే గ్యాస్‌నుండి విద్యుత్‌ను ఉత్పత్తిచేసుకోవడం ఆరంభించింది. చక్కెర రంగం నుండి వచ్చే వ్యర్థాలతో కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. వంట చెరకుగా ఉపయోగిస్తున్నారు. గతేడాది వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను అందించగల సోలార్‌ పార్కులను దేశవ్యాప్తంగా నెలకొల్పుకోగలిగింది. ఈ దిశగా చైనా కొంతమేర సాయపడింది.

ఆంక్షలున్నా అందిన సాయం
అమెరికా ఆంక్షలు వున్నా రష్యా, చైనా, మెక్సికో, ఇతర దేశాలనుండి క్యూబాకు సాయం అందింది. ఇటీవలే కొంతమంది సంఘీభావ సంస్థలకు చెందిన కార్యకర్తలు అవసరమైన మందులను క్యూబాకు తీసుకెళ్లి అందించారు. వియత్నాం బియ్యాన్ని పంపింది. మెక్సికో మందులు పంపింది. గత మూడు మాసాలుగా ఒక్క చుక్క చమురు కూడా ఆ దేశానికి అందలేదు. కొద్ది రోజుల క్రితమే రష్యా ట్యాంకర్‌ క్యూబాకు చేరుకుంది.
ఇక విద్యా రంగం పరిస్థితి చెప్పనక్కర్లేదు. అనుసంధానతపై ఆధారపడే విద్యా వేదికలు నిస్సారంగా మారిపోయాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా క్యూబాలో శిశు మరణాల రేటు అత్యంత తక్కువగానే వుంది. ప్రసూతి మరణాల సంఖ్య కూడా తక్కువే. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఆరోగ్య, విద్యాపరమైన సూచికలను కొనసాగిస్తోంది. అంటే క్యూబన్లు, పాలకుల సంకల్పం, వారి దృఢ దీక్ష గురించి చెప్పుకోవాల్సిందే. క్యూబన్లలో భయాందోళనలను, అనిశ్చితి వాతావరణాన్ని పాదుకొల్పాలన్నదే అమెరికా ప్రయత్నం, కానీ వాటన్నింటినీ క్యూబన్లు తమ ప్రతిఘటనా శక్తితో తిప్పికొడుతున్నారు.

అచంచలమైన స్ఫూర్తి
క్యూబా కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉందని అమెరికా దుష్ప్రచారం చేస్తోంది. కానీ ఇదంతా ఒక భ్రమ, వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా వుంది. క్యూబన్లకు రోజువారీ అవసరాల్లో ఈ ప్రతిఘటన అనేది నిత్యకృత్యంగా మారిపోయింది. ఇందులో క్యూబన్ల నిబద్ధత అచంచలమైనదిగా వుంది. ‘యుద్ధాన్ని క్యూబా కోరుకోదు, కానీ ఒకవేళ అదే సంభవిస్తే అందుకు మేం సిద్ధమే’ అని క్యూబా అధ్యక్షుడు మిగెల్‌ డియాజ్‌ కానెల్‌ ప్రకటించారు. విప్లవవారులు ఎల్లప్పుడూ అత్యంత అధ్వానమైన పరిస్థితులకూ సిద్ధంగానే వుంటారు. అటువంటి వాటినే మనం అధిగమించగలిగామంటే ఇక దేన్నైనా భరించడానికి మనం సిద్ధంగానే వున్నామని స్పష్టమవుతుందని అన్నారు. సార్వభౌమాధికారం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనేవి చర్చించేవి కావని స్పష్టం చేశారు.

క్యూబా ఎన్నటికీ లొంగిపోదు!
‘మేం ఎప్పటికీ లొంగిపోయేది లేదు,’ అని అధ్యక్షుడు డియాజ్‌ స్పష్టం చేశారు. ”మమ్మల్ని భయపెట్టాలని చూడకండి, మీరు ఎన్నటికీ విజయం సాధించలేరు. ఈ చర్యలతో కార్మికులను, సైనికులను మీరు భయపెట్టలేరు.” అన్న లెనిన్‌ మాటలను అమెరికా గుర్తుంచుకోవాలి. అప్పటికన్నా ఈ మాటలు ఇప్పుడు మరింతగా వర్తిస్తాయని డియాజ్‌ పేర్కొన్నారు.

67 ఏళ్ల ఆంక్షలను తట్టుకుని క్యూబా నిలిచింది. విఫలమైన దేశం అలా చేయలేదు. కానీ క్యూబా సాధించింది. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఎలాంటి ఉత్తర్వులు మమ్మల్ని ఏం చేయలేవు, డిజిటల్‌ ప్రచారాలేవీ మమ్మల్ని ఛేదించలేవు, ఆంక్షలేవీ మమ్మల్ని నాశనం చేయలేవు. క్యూబా దృఢంగా నిలబడుతుంది, క్యూబా ప్రతిఘటిస్తుంది, క్యూబా ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.!!
-మిగ్వెల్‌ డియాజ్‌ కానెల్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -