Wednesday, May 21, 2025
Homeఎడిట్ పేజి'సాగు' సజావుగా సాగేనా?

‘సాగు’ సజావుగా సాగేనా?

- Advertisement -

ఈ ఏడాది నైరుతీ పవనాలు కేరళ తీరాన్ని సాధారణం కంటే ఐదు రోజుల ముందే తాకబోతున్నట్టు భారత వాతా వరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. జూన్‌ ఒకటిన రావాల్సిన పవనాలు ఈ నెల 27నే తీరాన్ని తాకనున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో జూన్‌ మొదటివారంలోనే తొలకరి వర్షాలు పడతాయని ముందస్తు శుభవార్త అందించింది. ఈ సారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ మోసుకొచ్చిన చల్లని కబురు అన్నదాతల్లో ఆశలు చిగురింప జేసింది. గతేడాది అకాల వర్షాలు, నాసిరకం, కల్తీ విత్తనాలు, పంటలకు ధరలేమి ఇత్యాది సమస్యలన్నీ కట్ట కట్టుకొని రైతులకు నష్టాలు మూటగట్టాయి. అప్పుల భారంతో ఎంతోమంది అన్నదాతలు తనువు చాలించారు. యాసంగి చివరిలోనూ అకాల వర్షాలు కన్నీరు పెట్టించాయి.కొద్దిరోజులుగా ఎక్కడో చోట ఏదోమూల అకాల వర్షాలు పడుతూ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనకంతంటికీ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు ఒక బాగమైతే, పంటల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసా యాన్ని నమ్ముకున్న రైతు వాటన్నంటినీ తట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఈమారైనా ‘కాలం’ కలిసి వస్తుందని రైతులు రాబోవు వానాకాలం పంటపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే విత్తనాలు జల్లేందుకు పంట పొలాలను రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతం పునరావృతం కాకుండా రాష్ట్రప్రభుత్వం రుణాల మంజూరు, విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుని రైతులకు సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. సాంకేతిక కారణాలతో రెండు లక్షల రుణమాఫీ సమస్య పూర్తికాలేదు. దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా సాయంపై అనుమానాలు అలానే ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు కోసం ఎక్కడికి పోవాలన్నది ప్రశ్న. సర్కారులో అలాంటి సన్నద్ధత ఉందా?
వానాకాలం సాగు కోసం రాష్ట్రంలో కోటి 34 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవ సాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. రేషన్‌దుకాణాల్లో సన్న బియ్యం అందించడం, రూ.500 బోనస్‌ అందించడం వల్ల సన్నరకాలకే రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో అత్యధికంగా వరి 66.80 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న, సోయా బీన్‌, మినుములు, కంది, ఇతర ఉద్వానవన పంటలు వేయనున్నారు. సాగుకు తగినట్టుగా 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 95 లక్షల పత్తి ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయా చిక్కుడు, తదితర పంటల విత్తనాలు అవసరమని భావించింది. విత్తన పంపిణీలో మాటలు ప్రతి ఏడాదీ కోటలు దాటుతున్నా, చేతలే గడప దాటట్లేదు. గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విత్తనాల పంపిణీ జరిగేది. ఇప్పుడు ప్రయివేటు కంపెనీల నుంచే ఎక్కువభాగం అందుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమీక్షలు ఎలా ఉన్నా సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరు వులు అందవు. క్యూలో నిలబడలేక రైతులు చెప్పులు పెట్టా ల్సిన పరిస్థితులు చూశాం. విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పుకుంటున్నా నాసిరకం విత్తనాలను కొనుగోలు చేయా ల్సిన అగత్యం ఏర్పడుతోంది. దీన్ని అనువుగా చూసుకుని ప్రయివేటు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటకట్టడం వల్ల వేలాది రూపాయలు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నకిలీ విత్తనాలు కొని సాగుచేయడం వల్ల ఆ మొక్కలు తిని పశువులు చనిపోయిన ఘటన ము లుగు జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. కర్నాటక, మహా రాష్ట్ర, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాష్ట్రంలో అడుగు పెడుతున్నాయి. అమ్మేవారిపై తప్ప నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నవారిపై చర్యలు ఉండవు. ఈ విష యంలో కేంద్రం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఏ భూమిలో ఏయే పంటలు సాగు యోగ్యమో రైతులకు వ్యవసాయశాఖ అవగాహన కల్పించాలి. ఏప్రిల్‌లోనే పరీక్షలు జరిపి మే నెలాఖరు నాటికి కార్డులు జారీ చేయాలని ఏండ్ల తరబడి అనుకుంటున్నా ముందుకు సాగడం లేదు. రైతు మహోత్సవాల పేరిట ఇటీవల సదస్సులు నిర్వ హించినా ఉపన్యాసాలకే పరిమిత మయ్యాయి. దీనివల్ల రైతుకు అవగాహన కాలేదు. రైతు చేతిలో భూసార కార్డు ఉంటే తన పొలంలో ఏపంట వేసుకోవాలి. ఎలాంటి ఎరువులను వాడా లన్నది తెలుసుకునే వాడు. పంటలు నష్టపోయిన రైతులు బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీల కోసం నిరీక్షిస్తు న్నారు. ఇటీవల అకాల వర్షాలతో వెయ్యికోట్లకు పౖౖెగా నష్టం వాటిల్లినా, వాటికి ఇంతవరకూ నష్ట పరిహారం అందించిన దాఖలాల్లేవు.ఖరీఫ్‌ ప్రారం భ వేళ రైతులను ముసురుకుంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలి.సాగునీటి విడుదల విషయమై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఉత్తుత్తి మాటలు శుష్క వాగ్దానాలతో సమయాన్ని వృథా చేయకుండా సాగు సజావుగా సాగేందుకు సర్కార్‌ అవసరమైన అన్ని చర్యలూ యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -