చైనాలో శాస్త్రవేత్తల ప్రయోగం సక్సెస్
బీజింగ్ : ఒకప్పుడు చైనా వాయవ్య ప్రాంతంలో ఎక్కడ చూసినా బీడు భూములే కన్పించేవి. కానీ నేడవి పచ్చని పంట మొక్కలతో కళకళలాడు తున్నాయి. ఎడారిని తలపించే ఆ ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన ప్రత్యేక ప్రయోగమే దీనికి కారణం. జీవ సంబంధమైన కృత్రిమ నేలపై దట్టమైన, గట్టి పొరను సృష్టించడానికి వారు ఇసుకపై నేల విత్తనాలు చల్లుతున్నారు. మట్టి దిబ్బలను స్థిరీకరించి, భవిష్యత్తులో మొక్కల పెరుగుదలకు బలమైన పునాదిని అందించడమే దీని ఉద్దేశం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనుబంధ సంస్థ అయిన నార్త్‌వెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకో-ఎన్విరాన్‌మెంట్ అండ్ రిసోర్సెస్‌లో ఉన్న షాపోటౌ ఎడారి పరిశోధన-ప్రయోగ కేంద్రంలో అభివృద్ధి చేశారు. ఇసుక తిన్నెల ఏర్పాటుకు సాధారణంగా వందల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ పరిశోధనల కారణంగా ఆ పని మూడు సంవత్సరాలకే పూర్తవుతుంది. దిబ్బలను స్థిరీకరించడం అంటే తేమ లేదా ఇతర కారణాలతో గాలికి కొట్టుకుపోకుండా వృక్షాలను స్థిరంగా ఉంచడం. అవే ఇసుక తిన్నెలు. ఎడారి ప్రాంతాలలో ఇవి వృక్ష సంపదను కాపాడతాయి.
ప్రారంభంలో విఫలమైనా…
ప్రారంభంలో శాస్త్రవేత్తలు సైనోబాక్టీరియాను నేరుగా ఎడారిలో ప్రవేశపెట్టారు. కానీ అవి ఓ వారం రోజులకే అదృశ్యమయ్యాయి. బలమైన గాలులు వీయడంతో సున్నితమైన జీవ పొరలు విచ్ఛిన్నమై పోయాయి. దీంతో శాస్త్రవేత్తలు సహజ వర్షపాతంతో ప్రేరణ పొంది, పీడనతో స్ప్రే చేసే పద్ధతిని అనుసరించారు. అంటే ఇసుక కణాల మధ్యకు సైనోబాక్టీరియా సూక్ష్మజీవులను పంపారు. ఇవి పొర ఏర్పడే సమయాన్ని పదిహేను నుంచి ఒకటి రెండు సంవత్సరాలకు తగ్గించాయి. అంతేకాక 60 శాతం వరకూ పొరను కాపాడాయి. సూర్యకాంతి కారణంగా పొర ఎండిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇసుకకు సహజంగా నీటిని నిలుపుకునే సామర్ధ్యం ఉంటుంది. అయితే ఈ విధానాన్ని అనుసరించాలంటే విద్యుత్, వాహన సౌకర్యాలు ఉండాలి. ఎడారి ప్రాంతాలలో అవి లభించడం కష్టం కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకే ఈ విధానం పరిమితం కావడంతో శాస్త్రవేత్తలు సైనోబాక్టీరియాను ఘన విత్తనంగా అభివృద్ధి చేశారు. వీటిని రవాణా చేయడం, వ్యాప్తి చేయడం తేలిక. సైనోబాక్టీరియా ద్రావణాన్ని సేంద్రియ పదార్థం, సూక్ష్మ కణాలతో కలిపి పేస్ట్ లాంటి మిశ్రమాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో 5,300-6,600 హెక్టార్ల ఎడారి భూమిని సస్యశ్యామలం చేయడమే శాస్త్రవేత్తల లక్ష్యం. ఈ ప్రయోగం విజయవంతమైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీడు భూములను పంట పొలాలుగా మార్చవచ్చు.
నేల విత్తనం అంటే…
ఇది సాధారణ విత్తనం కాదు. సైనోబాక్టీరియాతో తయారైన ఘన ఐనోక్యులం. సైనోబాక్టీరియా అనేది నేల పై భాగంలో పొరను ఏర్పరచే సూక్ష్మజీవి. ఈ పొర ఇసుక కణాలను కలిపి ఉంచుతుంది. కోతకు గురికాకుండా చూస్తుంది. క్రమేపీ నేలను సారవంతం చేస్తుంది. ఎడారి ఉపరితలంపై ఈ విత్తనాలను చల్లితే వర్షం పడినప్పుడు నేల పొర ఏర్పడడం ప్రారంభ మవుతుంది.



