ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల ముగింపుసభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక చైతన్యం వల్లనే నాడు రైతాంగ సాయుధ పోరాటం అనంతర కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం విజయవంతమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కళా ప్రక్రియలు వల్ల యువత దారి తప్పరని చెప్పారు. అందుచేతనే పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు క్రీడా విధానంతో పాటు సాంస్కృతిక విధానం కూడా అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రవీంద్ర భారతి ప్రధాన వేదిక రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఒలంపిక్స్‌కు రాష్ట్రం నుంచి గెలిచేలా స్పోర్ట్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్తాయిలో గెలిచిన వారికి ప్రభుత్వ గ్రూప్1, 2 ఉద్యోగాలు, భారీ నగదు ఇచ్చామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ్యులు, మండలి సభ్యులకు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంప్రదాయం మరుగునపడిందని చెప్పారు. మరల ప్రజా ప్రభుత్వంలో క్రీడా సాంస్కృతిక వేడుకలు నిర్వాహిస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం ప్రతి పక్షం దూరంగా ఉండటం బాధాకరమన్నారు. వచ్చే సంవత్సరం ప్రతిపక్ష సభ్యులు కూడా పాల్గొనాలని సూచించారు. ఫిట్ లీడర్స్, ఫిట్ స్టేట్ తమ లక్ష్యమని చెప్పారు. శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి వాకిటి శ్రీహరి ఎన్‌టీఆర్ నటించిన సినిమా దాన వీర సూర కర్ణ లోని దుర్యోధన ఏక పాత్ర అభినయం చేశారు. ప్రేక్షకుల చప్పట్లు అందుకున్నారు. శాసన సభ్యులు నాగరాజు గద్దర్ పాత్ర అభినయంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రూపకం ప్రదర్శించారు. శాసన సభ్యులు రామదాసు జాటటి బృందంతో నాగోబా జాతర జానపద రూపకం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మరో శాసన సభ్యులు మందుల సామేల్ జాన పద గీతం అలపించారు.



