సామరస్య భావన, సహజీవన సంస్కృతి, అలాయి బలాయి కార్యక్రమం. భారతీయ సంస్కృతి వేలాది సంవత్సరాల నుండి వస్తున్న వారసత్వం. భిన్నత్వంలో ఏకత్వమే కాక ఏకత్వంలో భిన్నత్వం కూడ ఈ దేశపు భూమిక. ఇలాంటి దేశంలో ఘనచరిత్ర సంస్కృతి ఉన్న తెలంగాణ మతసామరస్యానికి, లౌకిక జీవనానికి పెట్టింది పేరు.
మహ్మదీయులకు సంబంధించిన ఉర్సులు, మొహరం వేడుకలలో హిందువులే ఎక్కువగా పాల్గొంటారు. మతసామరస్య భావాలు తెలంగాణలో పాదుకుని వున్నాయి. సామరస్య భావన, అలాయి బలాయి, సహజీవన సంస్కతి ఈ నేల పాదులో వుంది. దానికి ప్రతీకగా వరంగల్ జిల్లా అన్నారం యాకూబ్ షావలి దర్గా సాక్షిభూతంగా నిలబడి ఉంది.
హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో భక్తుల కొంగుబంగారంగా ఈ దర్గా మారడంతో అన్నారం కాస్తా అన్నారం షరీఫ్‌గా మారిపోయింది. అన్నారం షరీఫ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కందూరు. భక్తులు తమ కోర్కెలు నెరవేరితే కందూరు చేస్తామని యాకూబ్ షావలిసాహెబ్‌కు మొక్కుతారు. డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా దర్గా వద్దకు చేరుకుంటారు. సామూహిక భోజనాలు చేస్తారు. ఈ దర్గా వద్ద ఏడాదికోసారి గంధం ఉత్సవం ఘనంగా చేస్తారు.
మూడురోజులపాటు జరిగే వేడుకలకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరవుతారు. ఆరుబయట చెట్ల కింద వసతి ఏర్పాటు చేసుకొని బసచేస్తారు. యాటలు, కోళ్లు, మలీద ముద్దలు, అత్తరు సువాసనాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ వేడుకలతో అన్నారం షరీష్ గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. తెలంగాణలోని జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివస్తారు. శుక్ర, ఆదివారాలు భక్తులు అధికసంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
ఇప్పటికీ ఖ్యాతి తగ్గని క్షేత్రం
ఈ ప్రాంతంలో ఎటుచూసినా యాకమ్మ, యాకయ్య, యాకూబ్, యాకూబ్ రెడ్డి వంటిపేర్లు వినిపిస్తాయి. దేశంలో రాజస్థాన్ అజ్మీర్ దర్గా, కర్ణాటక గుల్బర్గ, కడప, నెల్లూరుతో పాటు తెలంగాణలోని పెదగట్టు దర్గా, రంగాపూర్ నిరంజన్ షావలి దర్గా పేరిట నిరంజన్ పేరు పెట్టుకుంటారు. అలాగే జాంగీర్ పీర్ల దర్గా జంగీర్ పేర్లు, బాలపీర్ల దర్గా పేర్లు పెట్టుకుంటారు. నాగర్ కర్నూలు బారుసావుల దర్గా, వసంతాపూర్ అల్లాజిబాబ, జటప్రొల్ మాసుంబాబ, కొల్లంపల్లి దర్గా, ఖాజా గరీబ్ నవాజ్ దర్గా, జాన్ పాడ్ సైదులు ఇట్లా అనేక దర్గాలు వున్నాయి. దర్గా సంస్కతిని నిలబెట్టేందుకు, దర్గాలు జనజీవనంలో పాదుకొల్పిన సహజీవన భావనను మరింతగా ప్రజలలోకి తీసికెళ్లే ప్రయత్నం చేస్తూ తెలంగాణలోని సాహిత్యకారులు నడుంకట్టారు. ‘అన్నదమ్ములవలెను జాతులు, దేశస్థులందరు మెలగవలెనోయ్’ అని గురజాడ ప్రబోధించిన భావనను ప్రచారం చేయాలని సంకల్పించారు.
విడదీసి పబ్బం గడుపుకునే సంస్కృతిని ఎండగట్టే ప్రయత్నాలు చెల్లవని చెప్పడానికి పూనుకున్నారు. తెలుగు సమాజంలో గొప్ప పేరు వున్న నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా హిందువుగా జన్మించి క్రిష్టీయన్ ను పెండ్లి చేసుకున్న ఆయన, దర్గాలో కూర్చొని తన సాహిత్యసృజన చేసుకున్నారని ప్రతీతి. దర్గా అందరినీ ఐక్యతగా ఉంచుతుందని, దగ్గరకు చేర్చుతుందని ప్రజల నమ్మకం.
తెలంగాణలోని ప్రముఖకవులు, కవయిత్రులు, రచయితలు కూడా గంగాజమున తహాజిబ్‌ను కాపాడేందుకు అన్నారం యాకన్న దర్గా వద్ద గత వారం కవిసమ్మేళనం, అలాయి బలాయి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరం ఒకటేననే భావనను గుర్తుచేసే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్గా వద్ద కందూర్ చేసిన తర్వాత కవులందరూ అలాయి బలాయి తీసుకున్నారు. హిందు ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. కవిసమ్మేళనం ఏర్పాటు చేశారు. అధికసంఖ్యలో కవులు, కవయిత్రులు పాల్గొన్నారు.
కవిత్వంలో మత సామరస్యం, మతాతీత జీవనం వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈకార్యక్రమంలో ప్రముఖ ప్రజాకవి, శాసనమండలి సభ్యులు డాక్టర్ గోరటి వెంకన్న, సాహితీవేత్తలు కవియాకూబ్, జి.లక్ష్మీనర్సయ్య, ప్రసేన్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జిలకర శ్రీనివాస్, స్కైబాబ హాజరయ్యారు. పెద్దసంఖ్యలో సాహిత్యకారులు దయాకర్ వడ్లకొండ, బండారి రాజ్ కుమార్, ఒద్దిరాజు ప్రవీణ్, కళ్యాణి కుంజా, యాకమ్మ, యాకూబ్ రెడ్డి, రాధికా మోహన్, యాదయ్య, వడ్డెబొయిన శ్రీ నివాస్, ముచ్చర్ల దినకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని జిల్లాల్లో వున్న దర్గాల వద్ద ఇటువంటి సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నారం యాకన్న దర్గా అలాయి బలాయి సాహిత్య లోకంలో మంచి ప్రయత్నం.
- ముచ్చర్ల దినకర్, 9440704535



