డిమాండ్‌కు తగినట్టుగా సరఫరాకు ‘ఎస్పీడీసీఎల్’ చర్యలు
అదనంగా 7,531 డీటీఆర్స్, 256 పీటీఆర్స్ ఏర్పాటు
ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తయ్యేలా డిస్కం ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ- సిటీబ్యూరో
రానున్న వేసవి కాలంలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తగు చర్యలు చేపడుతోంది. వేసవిలో డిస్కం పరిధిలో రికార్డు స్థాయిలో నమోదయ్యే విద్యుత్ డిమాండును తట్టుకునేలా సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలతో డిస్కం అధికారులు సమ్మర్ యాక్షన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రేటర్‌లోని మూడు జోన్లలో 3,357 డీటీఆర్‌లు, 163 పీటీఆర్‌లను ఏర్పాటు చేయనున్నారు. రూరల్ జోన్‌లో 4,174 డీటీఆర్స్, 370 పీటీఆర్‌లను అదనంగా ఏర్పాటు చేసేందుకు డిస్కం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు ఫిబ్రవరి మొదటి వారం వరకు పూర్తికానున్నట్టు డిస్కం అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి
గ్రేటర్ పరిధిలోని జోన్లతోపాటు రూరల్ జోన్‌లోనూ సమ్మర్ రాకముందే విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో నమోదు కావాల్సిన విద్యుత్ డిమాండ్ జనవరి నాలుగో వారంలోనే వెలుగు చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఏప్రిల్ చివరి నాటికి గ్రేటర్‌తోపాటు రూరల్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ 5 వేల మెగావాట్లకు చేరుకోనున్నట్టు డిస్కం అంచనా వేసింది. వేసవి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్‌స్టేషన్లు / ఫీడర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, ఆ మేరకు వాటి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులను చేపట్టింది. మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లతోపాటు రూరల్ ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తోంది.
గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో కొత్తగా 3,357, రూరల్ పరిధిలో 4,174 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్)లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, గ్రేటర్ పరిధిలో 163, రూరల్ పరిధిలో 207 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు డిస్కం చర్యలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 80శాతానికి పైగా పూర్తి చేశారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు గ్రేటర్ తోపాటు రూరల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయడమే లక్ష్యంగా డిస్కం చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలో సబ్ స్టేషన్లలో అనూహ్యంగా పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 163 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్), కొత్తగా 11 కేవీ ఫీడర్లు 527, 33 కేవీ ఫీడర్లు 118 అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే, రూరల్ పరిధిలో 207 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్), కొత్తగా 11 కేవీ ఫీడర్లు 323, 33 కేవీ ఫీడర్లు 93 ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి.
పెరుగుతున్న కొత్త కనెక్షన్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 55.98 లక్షల గృహ, 9.15 లక్షల వాణిజ్య, 38 వేల పారిశ్రామిక, 1.53 లక్షల వ్యవసాయ, మరో 90 వేలకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నట్టు అంచనా. ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల కనెక్షన్లు పెరుగుతున్నాయి.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండాకాలంలో ప్రతి ఏడాదీ సగటున 15శాతం వృద్ధితో విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఇదే తరహాలో ఈసారి వేసవిలోనూ విద్యుత్ డిమాండ్ గతం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని డిస్కం అంచనా వేసింది. డిమాండ్ ఎంతగా పెరిగినా సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలనే సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు అధికారులు డిమాండ్‌ను మదింపు చేస్తూ తగు ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగమయ్యారు.
సిబ్బంది, అధికారులు అప్రమత్తం
ముషారఫ్ ఫరూఖీ, సీఎండీ, టీజీ-ఎస్పీడీసీఎల్
వేసవిలో పెరుగనున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయమూ ఏర్పడకుండా చూసేందుకు డిస్కం సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో సమ్మర్ యాక్షన్ ప్లాను పనులను పూర్తి చేసేందుకు మా సిబ్బంది, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పలు కారణాల వల్ల కొన్ని చోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించాం. డిమాండ్ ఎంత పెరిగినా అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తాం.




