Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఅశాస్త్రీయ అంశాలతో పాఠ్యాంశాలు

అశాస్త్రీయ అంశాలతో పాఠ్యాంశాలు

- Advertisement -

– న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ దేశానికి అత్యంత ప్రమాదం
– కరోనా ముందు నుంచి 1800కు పైగా అంశాలు మార్పు
– జీవపరిణామ క్రమ సిద్ధాంతాన్ని మార్చి దైవత్వాన్ని జొప్పించే యత్నాలు : బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే)
– 20వ వార్షికోత్సవ సెమినార్‌లో.. ప్రముఖ కవి, రచయిత, జీవశాస్త్ర ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు
– ట్రంప్‌, మోడీ ఫ్రెండ్సయితే మన దేశ దిగుమతులపై 50శాతం సుంకాలెందుకు? : మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

నూతన విద్యావిధానం దేశానికి అత్యంత ప్రమాదమని, బీజేపీ అధికారంలోకి వచ్చాక కోవిడ్‌ ముందు నుంచి ఇప్పటికీ 1800కు పైగా అంశాలను మార్చిందని జీవశాస్త్ర ప్రొఫెసర్‌, కవి, రచయిత దేవరాజు మహారాజు అన్నారు. మానవశక్తి స్థానంలో దైవశక్తిని జొప్పించి అజ్ఞానం వైపు విద్యావిధానాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) 20వ వార్షికోత్సత్సవం సందర్భంగా బోడేపూడి స్మారకోపన్యాసం, సావనీర్‌ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సైన్స్‌, చరిత్ర పాఠ్యాంశాల మార్పు’పై ఖమ్మం నగరంలోని మంచికంటి భవన్‌లో బీవీకే ట్రస్ట్‌ చైర్మెన్‌, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో దేవరాజు మహారాజ్‌ మాట్లాడారు. బోడేపూడి జనంతో మమేకమై జీవించేవారని తెలుసుకున్నానని చెప్పారు. పాఠ్యాంశాల మార్పు వల్ల భావి భారత పౌరులకు తీరని ప్రమాదమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం 1,800కు పైగా సహేతుకమైన అంశాలను మార్చి అహేతుకమైన అంశాలను జోడించారని తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న జాతీయ విద్యావిధానాన్ని మార్చి అసంబద్ధమైన, అవాస్తవాలతో కూడిన న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020ని తీసుకొచ్చారని తెలిపారు. జీవపరిణామక్రమ సిద్ధాంతాన్నే మార్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవజాతి ఈ భూమి మీదకు ఎలా వచ్చిందనేది తెలుసుకోకుండా జీవపరిణామ క్రమాన్ని సిలబస్‌ నుంచి తీసివేయాలనుకోవటం అవివేకం అన్నారు. సహజ వనరుల పుట్టుక దైవశక్తి నుంచి ఉద్భవించిందని చెప్పటం మరో లోపమన్నారు. జీవులన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించాల్సిందేనని తెలిపారు. ఇటువంటి చరిత్ర, జీవశాస్త్రాలతో కూడిన బయోడైవర్సిటీ అంశాల్ని పాఠ్యాంశాల నుంచి తొలగించి, అభూతకల్పనలతో కూడిన అంశాలను జొప్పిస్తున్నారని చెప్పారు. కుంభమేళాల గురించి పాఠ్యాంశాలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ.. ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నదని, హిందూ రాష్ట్రమనేది చరిత్రలో లేదని అన్నారు. అశోకుని కాలంలో మనదేశం బౌద్ధం, ఆ తర్వాత సువిశాలమైన దేశాన్ని మొఘలులు స్థాపించారని తెలిపారు. హిందూ అనేది భౌగోళిక పదం మాత్రమేనని, మతానికి సంబంధించింది కాదని స్పష్టంచేశారు. శివాజీ ఆస్థానంలో 40శాతం మంది అధికారులు ముస్లింలు, ఔరంగాజేబు ఆస్థానంలో అత్యధిక పాలకులు హిందువులని గుర్తుంచుకోవాలన్నారు. వైజ్ఞానిక అంశాల గురించి లోతైన అధ్యయనం జరిగిందని, కానీ వాటిని కాదని మతపరమైన, అశాస్త్రీయమైన అంశాలను పాఠ్యాంశాల్లో జొప్పించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో బీవీకే ట్రస్ట్‌ జనరల్‌ మేనేజర్‌ వై.శ్రీనివాసరావు, వైస్‌ చైర్మెన్‌ పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, బీవీకే మాజీ జీఎంలు సీహెచ్‌ రాజారావు, కె.శ్రీనివాస్‌, సత్యసాయి సేవ సమితి బాధ్యులు డి.సుధాకర్‌, ట్రస్ట్‌ సభ్యులు వాసిరెడ్డి వీరభద్రం, తుమ్మల వెంకట్రావు, గోవిందరావు, ఎస్‌కే ఎండీ జాన్‌, ఎస్‌కే అఫ్జల్‌, ఎస్‌.నాగేశ్వరరావు, ఎం.సుబ్బారావు, పొన్నం వెంకటేశ్వర రావు, బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు.
భారత్‌పై 50శాతం పన్నులపై స్పందించరేం? : తమ్మినేని
అమెరికా అధ్యక్షులు ట్రంప్‌, మోడీ ఫ్రండ్స్‌ అయినప్పుడు మనదేశ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించిస్తే ప్రధాని ఎందుకు స్పందించటం లేదని మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. సీపీఐ(ఎం) శాసనసభ పక్ష నేతగా, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులుగా బోడేపూడి వెంకటేశ్వరరావు అందించిన సేవలను గుర్తు చేశారు. రాజకీయాల్లో అయన ఎన్నడూ రాజీపడలేదన్నారు. చిర్రావూరి లక్ష్మీనారాయణ, మంచికంటి, ఏలూరి లక్ష్మీ నారా యణ, బోడేపూడి కార్యాచరణ ఆదర్శనీయమన్నారు. ఏ రైతాంగం కోసమైతే బోడేపూడి వంటివారు పాటుపడ్డారో అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ చర్యల వల్ల ఇప్పుడు ఆ రైతులే సంక్షోభంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌పై 19శాతం, కొన్ని దేశాలపై 10, 15శాతం దిగుమతి సుంకాలు మాత్రమే వేసి భారత్‌పై పెద్దమొత్తం పన్ను వేశారని విమర్శించారు. ప్రపంచశాంతి నోబెల్‌ బహుమతివ్వాలని ట్రంప్‌ తనకు తానుగా ప్రకటించుకోవటం హాస్యాస్పదమన్నారు. భారతీయ వ్యవసాయరంగాన్ని ఖతం చేయటమే ట్రంప్‌ లక్ష్యమని తెలిపారు. అమె రికా ఆగడాలను అడ్డుకోకపోతే దేశం సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img