No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఎడిట్ పేజికస్టడీ తీర్పు!

కస్టడీ తీర్పు!

- Advertisement -

ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాల స్థిరత్వాన్ని కాపాడడం దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. కానీ కేంద్రం ప్రవేశపెట్టిన ”30 రోజుల కస్టడీలో ఉంటే పదవీచ్యుతి” బిల్లు ఆ బాధ్యతను విస్మరించి, సూటిగా ప్రజా స్వామ్యంపైనే దాడి చేస్తున్నది. పార్లమెంటు సమావేశాల చివరిరోజు సభలో పెట్టిన ఈ రాజ్యాంగ (130వ) సవరణ బిల్లులోని ప్రధాన నిబంధన ప్రకారం.. ఒక ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితో సహ) 30రోజుల పాటు కస్టడీలో ఉంటే, అతని పదవి తక్షణమే రద్దవుతుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య విధానానికీ గొడ్డలిపెట్టు.అందుకే ఈబిల్లుపై ప్రతిపక్షాలు పార్లమెంటు లోపాలా వెలుపలా నిరసన వ్యక్తం చేస్తుండగా.. మన ప్రధానమంత్రి గారేమో ‘యాభైగంటల కస్టడీతో ఉద్యోగాలే ఊడిపోతుంటే ప్రజాప్రతినిధులకు మాత్రం మినహాయింపెందుకు’ అని ప్రవచిస్తున్నారు!

నిజమే.. పైకి ఇది ప్రధాని చెపుతున్నట్టుగా అవినీతి లేదా నేరాలపై కఠిన చర్యగానే కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తేగానీ ఈ బిల్లులో దాగి ఉన్న రాజకీయ ఉద్దేశ్యమేమిటో బోధపడదు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడం, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలహీనపరచడమే లక్ష్యంగా తెచ్చిన బిల్లు అని అనిపించకమానదు. ఎంత న్యాయ విరుద్ధమైనదో కూడా తేటపడుతుంది. మన భారతీయ న్యాయసూత్రాల ప్రకారం.. నేరం నిరూపితమయ్యేవరకు ప్రతి నిందితుడూ నిర్దోషే. కానీ ఈ బిల్లు ఆ మూలసూత్రాన్ని తునాతునకలు చేస్తుంది. కోర్టుతీర్పు వెలువడకముందే, దోషిగా తేలకముందే, కేవలం 30 రోజుల రిమాండ్‌ ఆధారంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని పదవి నుండి తొలగిం చడం ఎలా న్యాయమవుతుంది? ప్రస్తుత నియమాల ప్రకారం నేర నిరూపణ జరిగి, శిక్ష ఖరారయ్యాకే అనర్హులవుతారు. ఇందుకు భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ బిల్లు న్యాయవ్యవస్థపైనా, ప్రజాస్వామ్య విలువలపైనా ప్రత్యక్షదాడి అంటూ ప్రతిపక్షాలు విమర్శించడం సత్యదూరం కాదు.

ఇప్పటికే కేంద్రం వివిధ ఏజెన్సీల (ఇడీ, సీబీఐ, ఐటీ)ను లోబరుచుకుని, వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి, తన జేబుసంస్థలుగా మార్చుకుని ప్రతిపక్ష నేతలపై, వారి రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా వినియోగిస్తున్నదో మనం చూ స్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఏదైనా ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో అరెస్టు చేయడం, ముప్పై రోజులు కస్టడీలో ఉంచడం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ఆ రాజకీయ క్రీడలకు ఈ బిల్లు ఒక కొత్త చట్టపరమైన ఆయుధం అవుతుంది. విచారణ పేరుతో వారిని అరెస్టు చేసి, 30 రోజులు కస్టడీలో ఉంచితే చాలు..వారి సభ్యత్వం రద్దు చేయవచ్చు. దీంతో అసెంబ్లీలు, పార్లమెంటులో సంఖ్యాబలాలను తారుమారు చేయ వచ్చు. ముఖ్యంగా ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరం చేయవచ్చు. ఇలా ఈబిల్లు దుర్వినియోగానికే అవకాశాలు ఎక్కువ.

ఇలాంటి చట్టం వల్ల రెండు తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. మొదటిది, ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక కేసులు మరింత పెరుగుతాయి. విచారణ పేరుతో వారిని పదవీచ్యుతులను చేసి, అసెంబ్లీలు, పార్లమెంటులో ప్రతి పక్షాన్ని బలహీనపరిచే చర్యలు ఉధృతమవుతాయి. రెండు, ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. ప్రజలు ఎన్ను కున్న ప్రతినిధులు ప్రజల ప్రమేయం లేకుండానే కేవలం 30 రోజుల కస్టడీ పేరుతో తొలగించబడతారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు అన్యాయంగా కూలిపోతాయి. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే.. కేంద్రంలో అధి కారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలపై ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించే అవకాశముంది. ప్రజాస్వామ్యానికి ఇంతకు మించిన అవమానమేముంటుంది.

నిజంగా కేంద్రం లక్ష్యం అవినీతి నియంత్రణే అయితే, విచారణ వేగవంతం చేయడం, న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఇవ్వడం, లోక్‌పాల్‌-లోకాయుక్తా వ్యవస్థలను బలోపేతం చేయడం, పారదర్శక న్యాయపద్ధతులను అమలు చేయడం వంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి, కేవలం 30 రోజుల కస్టడీతో పదవీచ్యుతు లను చేయడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం తప్ప మరొకటి కనిపించదు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాల స్థిరత్వం. దానిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈబిల్లు ఆ మూలాధారాన్నే పెకలిస్తుంది. ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వాలను, ప్రతినిధులను ఏజెన్సీల సహాయంతో తొలగించగలిగితే, ఇక ఆ ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? అందువల్ల ఈబిల్లును ప్రతి ప్రజాస్వామ్యవాది, న్యాయవాది, సమస్త పౌరసమాజం గట్టిగా ప్రతి ఘటిం చాలి. ఎన్నికైన ప్రతినిధులను తొలగించేది కేవలం ప్రజల తీర్పేగాని, ఏలినవారు ఏజెన్సీల ద్వారా ఆడే రాజకీయ క్రీడలు కాదని చాటిచెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే, ఈ బిల్లును తిప్పికొట్టడమే మార్గం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad