పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి తగ్గిన కేటాయింపులు
న్యూఢిల్లీ : పేద కుటుంబాలకు స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఎల్పీజీ పథకానికి బడ్జెట్‌లో కోత విధించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-2027లో.. గతేడాది సవరించిన అంచనాలతో (ఆర్‌ఈ) పోలిస్తే ఈ బడ్జెట్‌లో దాదాపు 28 శాతం తగ్గింపు ఉంది. బడ్జెట్ పత్రం ప్రకారం.. 2024-25లో పేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ల కోసం వాస్తవ బడ్జెట్ రూ. 12,700 కోట్లు.
దీన్ని 2025-26 బడ్జెట్ అంచనాలో (ఆర్‌ఈ) రూ. 9,100 కోట్లకు తగ్గించారు. కానీ తర్వాత రూ. 12,736 కోట్లకు సవరించారు. అయితే ఫిబ్రవరి 1, 2026న సమర్పించిన 2026-27 బీఈలో దీన్ని మళ్లీ రూ. 9,200 కోట్లకు తగ్గించారు, ఇది సవరించిన అంచనాల (ఆర్‌ఈ) నుంచి సుమారు 28 శాతం తగ్గుదల కనిపించింది. కిరోసిన్, బొగ్గు, కట్టెలు, ఆవు పేడ, పంట వ్యర్థాల వంటి సాంప్రదాయ కాలుష్య ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనాలకు మారడానికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు మద్దతు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద పేద కుటుంబాలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు అందిస్తారు. ఈ పథకం కవరేజ్ తక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు.
ఇంటర్న్‌షిప్ పథకంలో కోత
2025-26 సాధారణ బడ్జెట్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి రూ.10,831.07 కోట్లు కేటాయించగా, తర్వాత దాన్ని కేవలం రూ. 526.39 కోట్లకు సవరించారు. ఇప్పుడు 2026-27 బడ్జెట్ అంచనాల్లో ఇది రూ. 4,799.96 కోట్లుగా ఉంది. సవరించిన అంచనాల్లో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ, ఇది గతేడాది బడ్జెట్ అంచనాల్లో సగానికంటే తక్కువగా ఉంది. ఇది ఈ పథకంలో ఏదో సరిగ్గా జరగడం లేదని సూచిస్తుంది.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ యోజన 2024-25 బడ్జెట్‌లో ప్రారంహించారు. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఐదేండ్లలో 10 మిలియన్ల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలనేది లక్ష్యం. దీంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఆచరణాత్మక పని అనుభవంతో వారికి సహాయం చేయడం దీని లక్ష్యం. కానీ నిధుల కోతలతో పథకాలు అడుగు ముందుకేయటం కన్నా.. అంకెలగారడీనే తలపిస్తోందని మహిళలు, నిరుద్యోగ యువత పేర్కొంటున్నారు.
ఎల్పీజీ సబ్సిడీలో అస్థిరత
వంట గ్యాస్‌పై సబ్సిడీ గతంలో అన్ని కుటుంబాలకు అందుబాటులో ఉండేది. కానీ తర్వాత చాలా రాష్ట్రాల్లో దీన్ని నిలిపివేశారు. ఇప్పుడు కేవలం పేద కుటుంబాలకు మాత్రమే ఈ సబ్సిడీ లభిస్తుంది. 2024-25లో రూ. 375 కోట్ల సబ్సిడీని నేరుగా గృహ ఖాతాలకు బదిలీ చేశారు, కానీ 2025-26కి బీఈ రూ.1,500 కోట్లుగా ఉంది. అయినప్పటికీ, సబ్సిడీని రూ. 1,000 కోట్లకు సవరించారు. ఇప్పుడు దాన్ని మళ్లీ రూ. 1,500 కోట్లకు పెంచారు. ఇంకా ఎన్ని సార్లు సవరణలు జరుగుతాయో చూడాలి.



