Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంరాయితీలకు కోత

రాయితీలకు కోత

- Advertisement -

వంటగ్యాస్‌, ఎరువుల సబ్సిడీలకు తగ్గిన బడ్జెట్‌ కేటాయింపులు
ప్రజా పంపిణీ వ్యవస్థను పట్టించుకోలేదు
స్మార్ట్‌ సిటీ మిషన్‌ ఊసే లేదు

నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
2026-27 బడ్జెట్‌లో సబ్సిడీలకు కేంద్రం కోత విధించింది. ముఖ్యమైన వంటగ్యాస్‌, ఎరువుల సబ్సిడీలకు కోత విధించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పసల్‌ బీమా యోజన, కేంద్ర విద్యా సంస్థలకు కేటాయింపులను తగ్గించింది. వంట గ్యాస్‌ సబ్సిడీకి భారీగా కోత విధించారు. 2025-26 బడ్జెట్‌లో రూ.15,120.51 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.11,084.51 కోట్లకు తగ్గించారు. పంటల బీమా పథకం ప్రధాన మంత్రి పసల్‌ బీమా యోజన్‌కు కేటాయింపులు తగ్గించారు. 2023-24 బడ్జెట్‌లో రూ.15,000 కోట్లు కేటాయించగా, 2024-25లో రూ.14,473.46 కోట్లకు తగ్గించారు. దాన్ని 2025-26లో రూ.12,267 కోట్లకు తగ్గించగా, ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపుల్లో కూడా రూ.12,200 కోట్లకు తగ్గించారు. పీఎం కిసాన్‌ పథకానికి కూడా కేటాయింపులు తగ్గాయి. 2024-25లో రూ. 66,121.20 కోట్లు కేటాయించగా, 2025-26లో రూ. 63,500 కోట్లకు తగ్గించారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపుల్లో ఎటువంటి పెంపు లేకుండా గత కేటాయింపులు మాదిరిగానే రూ. 63,500 కోట్లు కేటాయించారు.

ఎరువులకు ఇచ్చే సబ్సిడీని సైతం తగ్గించారు. రైతులు ఎక్కువగా వినియోగించే యూరియాకు కేటాయింపులు తగ్గాయి. 2022-23 బడ్జెట్‌లో రూ.1,65,217 కోట్లు కేటాయించగా, 2023-24లో రూ.1,31,100 కోట్లకు, 2024-25 బడ్జెట్‌లో రూ.1,19,000 కోట్లకు తగ్గించారు. 2025-26 బడ్జెట్‌లో రూ.1,26,475.40 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,16,805 కోట్లకు తగ్గించారు. అలాగే పాస్ఫరస్‌, పొటాషియం ఎరువులకు సంబంధించి 2025-26 బడ్జెట్‌లో రూ. 60 వేల కోట్లు కేటాయించగా, 2026-27 ప్రస్తుత బడ్జెట్‌లో రూ.54 వేల కోట్లకు తగ్గించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి పీఎంజీకేఏవైకి గత బడ్జెట్‌లో రూ.2,27,753.65 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌ లో రూ.2,27,429 కోట్లకు తగ్గించారు. పంచదారకు సంబంధించి గత బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.200 కోట్లకు తగ్గించారు. ఉన్నత విద్యా రంగంలో ఐఐఎస్‌ఈఆర్‌లకు కేటాయింపుల్లో కోత విధించారు.

2024-25లో రూ.1,457.67 కోట్లు కేటాయించగా, 2025-26లో రూ.1,335 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,296.12 కోట్లకు కేటాయింపులు తగ్గించారు. ఐఐఎస్‌లకు కేటాయింపుల్లో కోత విధించారు. 2025-26లో రూ. 892 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.838.76 కోట్లకు తగ్గించారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ ఆర్‌ఏఎంజీకి రూ.95,692.31 కోట్లు కేటాయించారు. గతంలో ఉన్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎకు గత బడ్జెట్‌లో రూ.88 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లకు తగ్గించారు. కేంద్ర సాంస్కృతిక పథకాలు, ప్రాజెక్టులకు కేటాయింపుల్లో కోత విధించారు. 2025-26లో రూ 827.53కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 596.39 కోట్లకు తగ్గించారు. మెట్రో ప్రాజెక్టులకు కోత విధించారు. 2025-26 బడ్జెట్‌ లో రూ.5,930.14 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌ లో రూ.4,068.80 కోట్లు కేటాయించారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ కు అసలు నిధులే కేటాయించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -