ఈ ప్రతిపాదిత బడ్జెట్‌ను సవరించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నేడు ఎస్వీకేలో నిపుణులతో రౌండ్‌టేబుల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ రంగాలకు ప్రభుత్వం కోత పెట్టింది. ఇది పేదలు, దళితులు, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రభుత్వం ప్రతిపాదిత బడ్జెట్‌ను సవరించి ఆయా తరగతులకు న్యాయం చేయాలి’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై శనివారం హైదరాబాద్‌లోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో నిపుణులతో రౌండ్‌టేబుల్ సమావే శాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. రూ.3, 24,233 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారని వెస్లీ తెలిపారు. 2025-26లో బడ్జెట్‌లో రూ.3,04,000 కోట్లకుపైగా ప్రతిపాదన పెట్టి దాదాపు రూ.26వేల కోట్లు ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ కూడా అదే రకంగా ఉండొచ్చని అంచనా వేశారు. వ్యవసాయ, దళిత, గృహనిర్మాణం, నీటిపారుదల, విద్యుత్ తదితర ముఖ్యమైన రంగాలకు గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్‌లో నిధుల కోతపెట్టా రనీ, ఇది ఆందోళనకరమని తెలిపారు. ”ప్రతిపౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం” అనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌ను ఆర్థికమంత్రి చెప్పి అందుకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు. రైతు భరోసా కోసం రూ. 25 వేల కోట్లు అవసరముంటే, రూ.18 వేల కోట్లు మాత్రమే ప్రతిపాదించారని తెలిపారు. మహాలక్ష్మి పథకానికి మహిళలకు రూ.2,500 ఊసే లేదని తెలిపారు.
కౌలు రైతులకు మొండిచేయి చూపిందనీ, వ్యవసాయ కూలీలకు రూ.12వేల ప్రతిపాదనలేదని పేర్కొ న్నారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకుపైగా ఇండ్లు లేనివారుంటే, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.5,500 కోట్లు మాత్రమే ప్రతిపాదన చేశారని తెలిపారు. దళితుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన దాంట్లో రూ. 4,076 కోట్లు కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణానికి గతం కంటే కూడా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,344 కోట్లు కోత పెట్టారని తెలిపారు. నీటి పారుదల రంగానికి రూ.790కోట్లు కోత పెట్టారనీ, అదనంగా కేటాయించాల్సిన వ్యవసాయ రంగానికి రూ.777 కోట్లు గత బడ్జెట్ కంటే తగ్గించారని పేర్కొన్నారు. విద్యుత్ రంగానికి రూ.326 కోట్లు తగ్గించారనీ, మైనారిటీల, వెనుకబడిన తరగతుల, గిరిజనుల సంక్షేమానికి కేటాయింపులు లేవని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం దళిత బంధు కింద రూ.10లక్షల చొప్పున ఇస్తామనగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 లక్షలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ..బడ్జెట్‌లో కనీసం ఆ ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదనీ, విద్యా, వైద్యం ప్రయివేటీకరణను అరికట్టాలంటే నిధులు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో దీన్ని బలపరచాలని సూచించారు. కానీ.. నిధులు నామ మాత్రంగా పెంచినట్టుగా చూయించారని తెలిపారు. వాస్తవానికి విద్యా, వైద్యాన్ని ప్రయివేటీకరణ నుంచి అరికట్టడానికి అవి ఏమాత్రం సరిపోవని, వాటికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.
వడ్డీలకే దాదాపు రూ. 21 వేల కోట్లు, రుణాల కోసం మరో రూ.20 వేల కోట్లు, వాయి దాలకు, ఉద్యోగస్తుల వేతనాలు, పెన్షన్లు.. వీటికే 73 శాతం వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో ఖర్చు పెట్టగలిగేది రూ.43 వేల కోట్ల కంటే అదనంగా ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యత కలిగిన రంగాలకు నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడ డానికి, దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనారిటీల సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప మరోకటి కాదని విమర్శించారు.
సంక్షేమ రంగాలకు కోత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



