వీహెచ్‌టీకి హైదరాబాద్ జట్టులో మార్పులు
హైదరాబాద్ : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ను ముందుండి నడిపించిన సివి మిలింద్.. విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లోనూ హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు. రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ వరుస పరాజయాలు చవిచూసింది. దీంతో హెచ్‌సీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టులో మార్పులు చేసింది. పేసర్ కార్తికేయ కక్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. సీనియర్ పేస్ ఆల్‌రౌండర్ సివి మిలింద్‌ను జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ సింగ్ స్థానంలో మిలింద్ కెప్టెన్సీ బాధ్యతలు సైతం వహించనున్నాడు. నేడు జరిగే గ్రూప్ దశ మూడో మ్యాచ్‌లో అసోంతో హైదరాబాద్ తలపడుతుంది. రాహుల్ సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు హెచ్‌సీఏ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.



