Saturday, December 27, 2025
E-PAPER
Homeజాతీయంఒడిశాలో మూక హత్యకు సీడబ్ల్యూఎఫ్‌ఐ ఖండన

ఒడిశాలో మూక హత్యకు సీడబ్ల్యూఎఫ్‌ఐ ఖండన

- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిశాలో బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడిపై మూకదాడి, దారుణ హత్య ఘటనపై భారత నిర్మాణరంగ కార్మికుల సమాఖ్య (సీడబ్ల్యూఎఫ్‌ఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భయానక ఘటనను తక్కువ చేసి చూపించడానికి అధికారులు చేసే ఏ ప్రయత్నానైన్నా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. ప్రతక్ష్యసాక్షులు, ఈ దాడిలో ప్రాణాలతో బయట పడిన వారి వ్యాఖ్యలు ఈ ఘటన విదేశీయులకు వ్యతిరేకంగా జరిగినదిగా స్పష్టం చేస్తుందని సీడబ్ల్యూఎఫ్‌ఐ ప్రకటనలో తెలిపింది. మూకదాడికి తెగబడిన వారు బాధితుల గుర్తింపును విచారించారని, ఆధార్‌ కార్డులు చూపించాలని బలవంతం చేశారని తెలిపింది. బాధితుల్ని ‘బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు’గా ముద్ర వేశారని విమర్శించింది. ఈ ఘటన ఏదో ఒక్కసారిగా జరిగింది కాదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారానికి ప్రత్యక్ష ఫలితమని పేర్కొంది. బీజేపీ తమ రాజకీయ లాభం కోసం బెంగాలీ మాట్లాడే వలసకార్మికులను ‘విదేశీ అక్రమ వలసదారులు’గా ప్రచారం చేస్తుందని, ఇది కార్మికులపై మూకదాడులకు వాతావరణం సృష్టించిందని విమర్శించింది. కార్మిక వర్గ భద్రతకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని సీడబ్ల్యూఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ కేసులో ఆరుగుర్ని అరెస్టు చేసినా, నిందితులకు సాధ్యమైనంత కఠినమైన శిక్షను నిర్ధారించడానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును డిమాండ్‌ చేసింది. అలాగే, మృతుడి కుటుంబానికి రూ కోటి, గాయపడినవారికి రూ25 లక్షలు తక్షణ పరిహారం అందించాలని ఒడిశా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వలసకార్మికులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అలాగే, ఈ దాడిలో మరణించిన జుయెల్‌ షేక్‌ కుటుంబానికి సంఘీభావాన్ని సీడబ్ల్యూఎఫ్‌ఐ ప్రకటించింది. ఈ అనాగరిక హత్యను ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తన అనుబంధ సంస్థలకు సీడబ్ల్యూఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -