డిజిటల్ అరెస్టుతో దోపిడీ
చదువుకున్నవారే బాధితులు
పోలీసులనూ వదలని సైబర్ నేరగాళ్లు
నవతెలంగాణ-మిర్యాలగూడ
టెక్నాలజీ సౌకర్యాలు పెరుగుతున్నా కొద్దీ సైబర్ మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు ఫోన్ కాల్‌లో నకిలీ స్పామ్‌లు, సోషల్ మీడియా అకౌంట్లు, క్యూఆర్‌కోడ్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి బలవుతున్న వారు ఎందరో. గతంలో చదువులేని వారిని, అమాయకులను బలిచేయగా.. ఇప్పుడు సైబర్ మోసగాళ్లు చదువుకున్న వారినే టార్గెట్ చేస్తూ పోలీసు, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరు చెప్పి సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవి గతంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగేవి. ఇప్పుడు జిల్లాలకు, గ్రామాలకూ పాకాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజుకు ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
పశ్చిమబెంగాల్, రాజస్థాన్, డిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో చదువుకున్న వారిని టార్గెట్ చేస్తూ మోసగిస్తున్నారు. ఫోన్ నెంబర్‌తోపాటు ఆధార్ నెంబర్‌ను సేకరించి వారికి నేరుగా వాట్సప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. ‘మీరు పెద్ద క్రైమ్‌లో ఇరుక్కున్నారు.. మీరు అనేక మంది యువతులతో చాటింగ్ చేసి వారి అశ్లీల ఫొటోలను సేకరించి బెదిరిస్తున్నారని మాకు ఫిర్యాదులు అందాయి.. మీ పేరు మీద ఫలానా రాష్ట్రంలో కేసులు నమోదయ్యాయి.. మిమ్మల్ని అరెస్టు చేస్తాం.. మాపై ఆఫీసరుతో మాట్లాడుకోవాలి.. మీ కేసు కొట్టేయాలన్నా, బెయిల్ రావాలన్నా డబ్బులు చెల్లించాలి’ అని డిజిటల్ అరెస్టుతో మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ‘మీ కుమారుడు ఫలానా దేశంలో డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నాడు.. మీరు వెంటనే డబ్బులు పంపిస్తే కేసులు లేకుండా చేస్తాం’ అని నమ్మిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారస్థులు, వివిధ వత్తుల్లో పనిచేసే వారు సైతం వీరి బారిన పడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
వేల సంఖ్యలో బాధితులు..
నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఈ ఏడాది సుమారు 6వేల మంది పైగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు పోలీసుల ద్వారా తెలిసింది. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 250 మందికి పైగా బాధితులు ఉండగా.. మిర్యాలగూడ పట్టణంలో 200 మందికిపైగా ఉన్నారు. మిర్యాలగూడలో ఐదుగురు న్యాయవాదులు, పదిమందికి పైగా డాక్టర్లు, పదుల సంఖ్యలో వ్యాపారస్తులు, టీచర్లు, ఉద్యోగస్తులు ఉన్నట్టు సమాచారం. వీరి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు కోట్లల్లో కాజేసినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
మోసపోతున్న మేధావులు..
ఐదు రోజుల కిందట మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్ చేసి ‘మీపై పోక్సో కేసు నమోదైంది. అంతర్జాతీయ క్రిమినల్‌తో మీకు సంబంధం ఉంది’ అని బెదిరించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, మూడ్రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. వాట్సప్ వీడియో కాల్‌లో ఆధారాలు చూపించి, సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించానని, దీనికిగాను రూ.30,70,719 చెల్లించాలని అది కూడా ఆర్టీజీఎస్ చేయాలని బెదిరించారు. అంత డబ్బులు లేవని తాను ఏ తప్పూ చేయలేదని రిటైర్డ్ ఉద్యోగి అనగా.. చివరికి రూ.20లక్షలు చెల్లించు.. మిగతావి తాను సర్దుతానని మూడ్రోజులు మానసికంగా వేధించారు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి ఓ మాజీ ఎమ్మెల్యే సహకారంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో సైబర్ మోసగాళ్ల పని అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.నల్లగొండ జిల్లా కేంద్రంలో.. ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మీపై కేసు నమోదైందని, దాని నుంచి బెయిల్ రావాలంటే తక్షణమే రూ.35 లక్షలు చెల్లించాలని బెదిరించారు. అది నమ్మిన బాధితుడు నగదు చెల్లించాడు.
ఆ నగదు ఇంకా సరిపోదని ఇంకా కావాలని అడగ్గా బంగారాన్ని కుదవ పెట్టేందుకు వెళ్లే దారితో తెలిసిన కానిస్టేబుల్ కలవడంతో విషయం అతనికి చెప్పగా.. వెంటనే బాధితున్ని క్రైమ్ బ్రాంచ్ ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. సైబర్ నేరగాళ్ల పన్నాగంగా వారు తేల్చారు. ఈ ఏడాది జనవరిలో జిల్లాకు చెందిన 57 ఏండ్ల ప్రభుత్వ ఉద్యోగికి ఓ వ్యక్తి పోలీసు అధికారిగా ఫోన్ చేసి.. రూ.2 కోట్ల మనీలాండరింగ్ కేసులో అతని ఆధార్ కార్డును ఉపయోగించారని, వాట్సప్‌లో మొదటగా అరెస్టు వారెంట్, కోర్టు ఆర్డర్లు పంపి భయపెట్టి అతని వద్ద రూ.6.5లక్షలు కాజేశారు. ఈ ఏడాది మార్చి 29న నల్లగొండ జిల్లాలో మరో సైబర్ కేసు నమోదైంది. అందులో హైదరాబాద్‌కు చెందిన 49 ఏండ్ల ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాడు వీడియో కాల్ చేసి ట్రారు అధికారిగా చెప్పుకుని బెదిరించి అతని వద్ద రూ.8.5 లక్షలు కాజేశాడు. ఈ ఏడాది మార్చిలోనే జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది వెలుగుజూసింది.
ఆన్‌లైన్ మోసాలకు గురికావద్దు ఎస్పీ శరత్‌చంద్ర పవార్
ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరిట ఎవరూ ఫోన్లు, వాట్సప్ కాల్ చేయరు. అలా చేస్తే అవి చట్టబద్ధత కాదు. వీడియో కాల్ ద్వారా అరెస్టు చేయబడదు. తప్పుడు కేసులు, అరెస్టు వారెంట్ ఉందని బెదిరిస్తారు. అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, ఓటీపీ ఇవ్వొద్దు. ఆ ఫోన్ కాల్స్‌కు భయపడొద్దు. అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లోలో లేదా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.