ఈవారం 14 సైబర్ ఫిర్యాదుల స్వీకరణ
వారియర్స్ కు టీ షర్ట్ పంపిణీ చేసిన ఎస్పీ
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ ను కేటాయించి ప్రత్యేకంగా సైబర్ పై పోరాటాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో 19 పోలీస్ స్టేషన్లలో సైబర్ విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్ కు ప్రత్యేకంగా టీ షర్ట్స్ ను అందజేసి ప్రోత్సహించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్ ను గుర్తించే విధంగా హైదరాబాద్ నుండి సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు ప్రత్యేకంగా తయారు చేయించి జిల్లాకు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అవగాహన తప్పనిసరి అని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు పోలీసు మీకోసం సదస్సులు ఏర్పాటు చేసి యువతకు, ప్రజలకు ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న పద్ధతులను సవివరంగా ఎప్పటికప్పుడు వివరించాలని సూచించారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 నంబర్ కు సంప్రదించాలని తెలియజేయాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న cybercrime.gov.in అనే వెబ్సైట్ లో ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది ప్రస్తుత సమాజంలో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పోలీసు వ్యవస్థలో అందించబడిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కేసుల చేతనను, దర్యాప్తును కొనసాగించి నేరస్థులను పట్టుకోవాలని సూచించారు.
బాధితులకు వీలైనంత త్వరగా సరైన న్యాయం అందించినప్పుడు పోలీసు వ్యవస్థపై ఉన్న గౌరవం మరింత పెరుగుతుందని సూచించారు. పోలీస్ స్టేషన్లో వచ్చిన ఫిర్యాదుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన దర్యాప్తులను చేసి కేసులను చేదించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో నకిలీ జాబ్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో ప్రజలు యువత నిరుద్యోగులు మోసపోతున్నారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ డి.ఎస్.పి హసీబుల్లా, ఏఎస్ఐ సురేందర్, సైబర్ సిబ్బంది సంతోష్, ఏసుదాస్, శివ సాయి, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.
వారంలో నమోదైన సైబర్ నేరాల వివరాలు
మొత్తం 14 ఫిర్యాదులు అంతగా అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. నేరడిగొండలో బాధితునికి లాటరీలో డబ్బులు వచ్చిందని రూ.18 వేల జీఎస్టీ కడితే లక్ష రూపాయలు వస్తాయని చెప్పి మోసం చేసిన ఘటన ఫిర్యాదు ద్వారా వెలుగులోకి వచ్చింది. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితురాలు ఇంస్టాగ్రామ్ లో ఆభరణాలు ఖరీదు చేసి వాట్సప్ ద్వారా తాము చేసిన ఆర్డర్లు ట్రాకింగ్ చేయవచ్చు అని మోసపోవడం జరిగిందని ఫిర్యాదు అందింది.
అనవసర లింకులను ఓపెన్ చేయడం వల్ల తెలియని అప్లికేషన్లు మొబైల్ లో డౌన్లోడ్ అయి, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉన్నందున పట్టణంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఇంద్రవెల్లిలో బయటి దేశాలలో ఉద్యోగం నెలకు లక్షల సంపాదించవచ్చని నమ్మబలికి, బాధితుని వద్ద నుండి రూ.70వేలను తస్కరించడంతో ఫిర్యాదు అందింది. ఆన్లైన్ లో లోన్ అప్లికేషన్ ద్వారా నకిలీ లోన్ అప్లికేషన్లు వివరాలను పొందుపరచడంతో అతని అకౌంట్ నుండి సైబర్ నేరగాళ్లు రూ.23 వేలను తిరస్కరించగా ఫిర్యాదు అందింది.