Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమోసానికి సైబర్‌ నేరగాళ్ల ప్లాన్‌

మోసానికి సైబర్‌ నేరగాళ్ల ప్లాన్‌

- Advertisement -

– రూ.18లక్షలు బదిలీని నిలువరించిన సైబర్‌ క్రైమ్‌
నవతెలంగాణ-నల్లగొండ టౌన్‌

సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు భయపడిన రిటైర్డ్‌ టీచర్‌ డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు సిద్ధపడగా.. విషయం తెలిసిన వెంటనే ఆ నగదు నేరగాళ్లకు బదిలీ కాకుండా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కాపాడారు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ పుచ్చకాయల దేవేందర్‌రెడ్డికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్‌ చేసి ‘బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నావు.. మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తాం.. మీరు అరెస్ట్‌ కాకుండా ఉండాలంటే మేమిచ్చిన అకౌంట్‌ నెంబర్‌కు వెంటనే రూ.18 లక్షలు డిపాజిట్‌ చేయాలి’ అని భయభ్రాంతులకు గురిచేశారు. దాంతో భయపడి బాధితుడు ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐ బ్యాంకుకి వెళ్లి రూ.18 లక్షలు డిపాజిట్‌ చేయాలని మేనేజర్‌ను కోరడంతో.. అనుమానం వచ్చిన మేనేజర్‌ వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ విష్ణుకుమార్‌, సిబ్బంది అక్కడికి చేరుకొని దేవేందర్‌ రెడ్డిని విచారించగా.. జరిగిన విషయం తెలిపారు. అతనికి వచ్చిన ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ను పరిశీలించి సైబర్‌ నేరగాళ్లకు తిరిగి కాల్‌ చేసి ప్రశ్నించగా తడపడుతూ వెంటనే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. ఈ సందర్భంగా సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ప్రభుత్వ సంస్థలు లేదా అధికారులు బెదిరించడం, భయపెట్టడం చేయరు. వీడియో కాల్స్‌ ద్వారా అరెస్టులు చేయరు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అటువంటి కాల్స్‌ వస్తే వెంటనే www.cybercrime.gov.in లో లేదా 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌ చేసి రిపోర్ట్‌ చేయాలని సూచించారు. సకాలంలో స్పందించి సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా బాధితుడిని కాపాడిన నల్లగొండ సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ విష్ణు, హెడ్‌ కానిస్టేబుల్‌ రియాజ్‌, కానిస్టేబుల్‌ మోక్షిద్‌ను జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -