నాన్న అని రెండు అక్షరాలలో అనంతమైన ప్రేమ దాగి ఉంది. నాన్నని ఇష్టపడని వారు ఉండరు .నాన్న మీద కనిపించే ప్రేమ కొందరిదైతే కనిపించని అభిమానం మరికొందరిది. కొడుకైనా కూతురైనా నాన్న చేతుల్లో పెరిగి, నాన్న నేర్పిన అడుగులలో నడిచి, నాన్న అంత అవ్వాలని ఆశపడి, నాన్న మీద గౌరవం పెంచుకొని, నాన్నను తమలో నింపుకుంటారు.
నాన్నని ఆకాశమని, నాన్న నా రోల్ మోడల్ అని నాన్నంటే త్యాగం అని రకరకాల భావనలు.
”మాతదేవోభవ, పితదేవోభవ
ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ…” అన్నారు. అందులో అమ్మ తర్వాత స్థానం, గౌరవం నాన్నది. నాన్నంటే ఓ ధైర్యం నాన్నంటే ఓ భద్రత నాన్నంటే ఓ భరోసా!
పసిపిల్లగా అమ్మ పురిటి నొప్పుల తర్వాత ఈ భూమి మీద జన్మించిన బిడ్డ అమ్మానాన్నల అనురాగపు కానుక. ఆ బిడ్డను చూసి మురిసిపోతారు తల్లి తండ్రులు. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయినా భర్తగా ఆ నవమాసాలు మోస్తుండగా భార్య పడిన వేదనని గమనించి ఆ బాధను తానూ అనుభవిస్తాడు తండ్రి. కానీ కంటికి కనిపించడు. అర్థం చేసుకునే మనసుకే తండ్రిగా రూపుదిద్దుకొని ఓ వ్యక్తి అంతర్మథనం తెలుస్తుంది. అలా నాన్నగా మారిన ఆ ఆనంద క్షణాలు ఎంత అపురూపమో! తనని నాన్నగా మార్చిన భార్య మీద అంతులేని ప్రేమ! తనను తను నాన్న అనిపించేందుకు పుట్టుకొచ్చిన పసిపాప లేదా బాబు మీద గుండెల నిండా నింపుకున్న వాత్సల్యం! ఒక్కసారిగా జలదరించిన మనసుతో ఆనందం నిండిన హదయంతో ఆ క్షణం నుంచి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతాడు నాన్న.
ఏ చిన్న కదలిక వచ్చినా, ఏ విషయమై ఏడ్చినా కలవరపడతాడు. చుట్టూ ఉన్న భార్య, అత్త, అమ్మ నవ్వుకున్నా తన ఆరాటంలో తానుంటాడు. ఆ బిడ్డ కోసం ఏమేం చేయాలో ఆలోచన చేస్తాడు. అక్షరాలా అమలు పరుస్తాడు. ఒళ్ళు హూనం చేసుకుంటాడు. అధికంగా కష్టపడతాడు. అడిగినవి అడగనివి అందించేందుకు అహోరాత్రులు శ్రమ పడతాడు .
అత్త అని పిలిచినా, అమ్మ అని పిలిచినా నన్ను మొదట పిలవలేదని అలకలు పోడు. నాన్నా అని పిలిచిన మొదటి పిలుపు విన్నప్పుడు మాత్రం విశ్వాన్ని జయించినంత సంబరపడతాడు.
ఒకప్పుడు కేవలం భర్త మాత్రమే సంపాదించి తెచ్చే కాలం నుంచి ఇప్పుడు భార్యాభర్త ఇద్దరూ కష్టపడి ఉద్యోగాలు చేసే స్థాయి వరకు ఇద్దరి ఆశయం ఆ పిల్లలను బాగా చదివించాలి. తమకున్నంతలో మంచి బట్టలు కొనివ్వాలి. వారికి కడుపునిండా పెట్టాలి. వారి ముఖాలలో నవ్వులను చూసి మురిసిపోవాలి. వారికి మంచి చదువు అందించడం కోసం ఈ పోటీ ప్రపంచంలో తమ శక్తిని మించి ఫీజులు కట్టి అప్పులు చేసైనా ఉన్నత విద్యలు చదివించి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపన!
ఈ పరంపరలో నాన్న కఠినంగా ఉన్నట్లు నటిస్తాడు. దుర్వాసుడిలా కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఒక్కోసారి దండిస్తాడు. ఎక్కడ చేతికి అందకుండా పోతారో అన్న భయంతో కర్ర తీసుకొని బాదేస్తాడు. ఇది సగటు నాన్నలలో కొందరి పరిస్థితి.
కొందరు నాన్నలు కూతురు గాని కొడుకు గాని అడిగారంటే కొండమీది కోతినైనా తెచ్చి అందిస్తారు. వారికి జీవితంలో కష్టం ఏంటో తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. చివరికి వారు అవసాన దశలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఉంటే మాత్రం తట్టుకోలేరు.
నాన్నలో కొడుకు, నాన్నలో అన్న, నాన్నలో బావ, నాన్నలో అల్లుడు, నాన్నలో బాబాయి, నాన్నలో పెద్దనాన్న, నాన్నలో తాత గా రకరకాలుగా నాన్నను పిల్లలు దర్శిస్తారు. చివరికి నాన్న పసిపిల్లాడుగా మారిపోతాడు. తాను కన్న బిడ్డలకు మారాం చేసే బిడ్డలా రూపాంతరం చెందుతాడు.
జీవితంలో రకరకాల దశలలో నాన్న తన విధులను నిర్వర్తిస్తూ అవకాశాలు లేక అల్లాడుతూ.. దొరికినప్పుడు తనని తాను నిరూపించుకుంటూ నిత్యం యుద్ధం చేస్తుంటాడు! నాన్న పిల్లలకు కష్టం వస్తే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాడు. ఒక్కోసారి నాన్న తన పిల్లల మీద అతి ప్రేమతో అవినీతిని కూడా ఆశ్రయిస్తాడు. తన పిల్లల కోసం పడరాని పాట్లు పడతాడు.
అటువంటి నాన్న మీద మన తెలుగు చిత్రసీమలో అనేకమైన పాటలు ఉన్నాయి. ధర్మదాత సినిమాలో డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన పాట ఘంటసాల గళంలో… ”ఓ నాన్నా నీ మనసే వెన్నా/ అమతం కన్నా అది ఎంతో మిన్న/ ముళ్ళ బాటలో నీవు నడిచావు/ పూలతోటలో మమ్ము నడిపావు/ ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో/ పరమాన్నం మాకు దాచి ఉంచావు..” నాన్న గురించిన గొప్ప పాట.
ఈ మధ్య నాన్న అనగానే గుర్తుకు వచ్చే టైటిల్ సాంగ్ ”నాన్నకు ప్రేమతో…”. సినిమా పేరు ‘నాన్నకు ప్రేమతో’. రచన దేవి శ్రీ ప్రసాద్. గానం దేవి శ్రీ సాగర్.. ”ఏ కష్టం ఎదురొచ్చినా/ కన్నీళ్లు ఎదిరించినా/ ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన/ నాన్నకు ప్రేమతో ..నాన్నకు ప్రేమతో/ ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో/ అంకితం నా ప్రతిక్షణం..” మంచి పాటగా అందరి మన్నన పొందింది.
ఒక జానపద గీతం వివిధ గాయకుల నోట జనం పాటగా నిలిచింది. గడ్డం సంతోష్, సాయి చంద్, మధుప్రియ తదితరులు పాడిన ఈ పాట..
”నాన్న నాన్నా నాన్నా నీ మనసంతా మంచిదో నాన్న/ నాన్నా నాన్నా నాన్నా నీ ప్రేమెంత గొప్పదో నాన్న/ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము/ భూమి మీద పడ్డప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట/ ముద్దు పెట్టుకుని గుండెకు అద్దుకుంటవు/ బారసాల చేసి గాబురంగా చూసుకుంటవు..” విశేషంగా జనాదరణ పొందిన పాట ఇది.
అమ్మానాన్నలకు కలిపి ఉన్న పాటలు ఎన్నో ఉన్నాయి. సినిమాల కథనాలలో నాన్న కోసం నాన్న పాత్ర కీలకంగా ఉన్న కథనాలు నేపథ్యంగా వచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి సినిమాలలో ‘ఆనిమల్’ తెలుగు సినిమా నాన్న మీద ప్రేమను ఏ విధంగా చూపించినా అందులో నాన్న నువ్వు నా ప్రాణం అనే పాట అనంత శ్రీరామ్ రచన సోను నిగం గళంలో అందరినీ కదిలించింది.
”నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే/ నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే/ నువ్వే కదా నువ్వే కదా సీతార నా కలకి/ నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట/ నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా/ ఇదిగో ఇది నా మాట..”
ఈ పాట నాన్న మీద ప్రేమనంతా అక్షరాలలో నింపిన పాట అనిపించక మానదు!
నాన్న మీద గజల్ గాయకుడు శ్రీనివాస్ పాట డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు రచించినది.
”చెట్టుకేమో విత్తుకు ఋణమున్నది తెలియలేదు/ నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు/ నాన్న నాకు చొక్కా తొడగడం తెలిసింది కానీ/ కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు/ ముద్దులాడి నన్ను పైకి ఎగురవేయుట తెలుసు కానీ/ తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియదు/ చెయ్యి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ/ నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు..” అంటూ ఉన్నతమైన భావనను నాన్నను గురించి తెలిపారు.
‘హారు నాన్నా’ సినిమా నానీ, మణాల్ సేన్ నటనలో వచ్చింది..
‘ఐ హేట్ యూ డాడీ’ అనే షార్ట్ఫిల్మ్ చిత్రించి అనేక అవార్డులను అందుకున్న నటుడు, దర్శకుడు రామ్ రావిపల్లి నాన్న మీద ప్రేమనంతా ఆ లఘు చిత్రంలో చూపించారు.
‘మా నాన్న సూపర్ హీరో’ అని సినిమాతో సయాజి రావు తండ్రిగా సుదీర్ బాబు కొడుకుగా నటించిన ఒక పాట చూస్తే ఎవరికైనా నచ్చేస్తుంది. నాన్నంటే ఎవరికి ఇష్టం ఉండదు మరి! ఆ పాటను రచించినది లక్ష్మీ ప్రియాంక.. గాయకుడు నజీరుద్దీన్.
”నోరారా తిడితే నాన్నా/
చెయ్యారా కొడితే నాన్న/
ఏమన్నా నువ్వే నాన్నా/
ఇష్టం పోనే పోదే/
ఛీ అన్నా నువ్వే నాన్న/
పో అన్నా నువ్వే నాన్నా/
ఏమన్నా నువ్వే నాన్నా/
ఇష్టం నువ్వంటే/
నువ్వుంటే నాతో/
ఇంకేమైనా అసలు వద్దంట/
కష్టాలు ఏమైనా ఇష్టంగా మార్చేస్తా..”
అంటూ ఈ పాటలో తను చెప్పే కథలో మా నాన్నే హీరో అనడం, నాన్న మాట కరుకైనా మనసు ముత్యం. అందుకనే నాన్నంటే ఇష్టం అనడం.. చాలా సహజమైన భావవ్యక్తీకరణ నాన్న పట్ల లక్ష్మీ ప్రియాంక చేసింది.
నాన్నతో పాటు ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు ఒక ధైర్యం.
నాన్నుంటే దేన్నైనా ఎదుర్కొనేందుకు ఒక ధీమా వచ్చేది, ఓ నమ్మకం.
నాన్న చిటికెన వేలుపట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అదో విధమైన గర్వం నాలో.
మొదటి సారి హైస్కూల్ నుంచి కాలేజీకి అడుగు పెట్టినప్పుడు ఓ స్నేహితుడిలా ఎన్నో విషయాలు చెప్పారు.
నాన్న ఇచ్చే బలం కొండంత. అదే నాలో మనస్థైర్యం, ఆత్మ విశ్వాసాన్ని కొండంతలుగా పెంచాయి.
నాన్నంటే, ప్రేమకు మారు పేరు అయినా నా కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముఖ్యమైనదో నాన్నా మీరు పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి.
నా తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేసారు నాన్న.
అంతులేని వాత్సల్యానికి ప్రతిరూపం. నాలో ధైర్యాన్ని నింపి, ఈ ప్రపంచంలో బతికేందుకు అనుక్షణం ఆసరా ఇచ్చేది నాన్న.
నా కోసం ఎన్నో త్యాగాలు చేసి మమ్మలిని ప్రేమిస్తూ, జీవించడం నేర్చుకున్న వ్యక్తిగా నాన్న పరిపూర్ణ మూర్తిమత్వం ఇప్పుడు బాగా అర్దమవుతోంది.
నాన్న మొదటి సారి తాత అయినప్పుడు ఆ కళ్ళలో దాచుకోలేని సంతోషం, ఆనందం. నేను ఎన్నడూ చూడని మరో కోణం నాన్నలో. చిన్నపిల్లాడిలా మురిసిపోతూ మనవలు చేసే ప్రతి పని అబ్బురంగా చూస్తూ ఉండే ఆయనలో గంభీరం పోయి చిలిపితనం కనిపించేది.
నాన్న మరణం జీర్ణించుకోలేకపోయినా, అది నిజం భరించాలని, ఈ లోకంలో లేని నాన్న ప్రేమలోని గాఢత లోతెంతో తెలిశాక నా గుండె బరువెక్కిపోతుంది.
అప్రయత్నంగా మనసు నాన్న తాలూకూ జ్ఞాపకాలవైపు మళ్ళుతుంది.
‘నాన్నా! ఐ లవ్ యు’ – సంచికలో మణి వడ్లమాని రచన.
ఉత్తముడైన ఒక తండ్రికి కుమారుడు ప్రేమగా ఇచ్చిన నివాళి. గుర్తుంచుకోవలసిన పద్యాల సంకలనం. తెలుగు పద్యమూ – మా నాన్న… కోట పురుషోత్తం రచన.
‘నేను నాన్నా ఓ చీమ కథ’ – ఎన్ ధనలక్ష్మి రచన. ‘నాన్న ఎక్కడికెళ్ళాడు’ – వేణు గోపాల్ మద్దు. ‘స్వగతం నాన్న’ – బి.ఎన్.వి పార్థసారథి వ్యాసం. ఉదయలక్ష్మి వడ్లమూడి ‘నాన్న పాడిన గీతం’ ప్రజాశక్తిలో వడ్లమూడి నాగేశ్వరరావు ప్రజాకవి గురించి రచించారు. ‘నాన్న నాకేమిచ్చారు’ – అవసరాల రామకష్ణారావు గారి కథ. ఇంకా మరెందరో రచయితలున్నారు.
ఎందరు కవులు తమ కలాలకు పదును పెట్టినా ఎందరు పిల్లలు నాన్నను తమ తమ భాషలలో వర్ణించినా, కీర్తించినా ఎన్ని ఉపమానాలు, అలంకారాలు జోడించినా నక్షత్రాలతోనూ, ఆకాశం తోనూ సాక్షాత్తు దైవంగాను భావించినా, ఎన్ని రకాలుగా చెప్పినా నాన్నను గురించి ఇంకా చెప్పాల్సింది మిగిలి ఉంటుంది.
నాన్న ఓ బంధం.
నాన్న ఓ బాధ్యత.
నాన్న ఓ గురువు.
నాన్న సర్వస్వం.
నాన్నా.. నీ కోసం ఎన్ని మాటలమూటలు పేర్చను.
చిన్నతనంలో తప్పటడుగుల నుంచీ
పెద్దయ్యాక ఎదిగిన పనిమంతురాలిగా
నన్ను తీర్చిదిద్దేందుకు ఎంత కష్టపడ్డావో..
నీ గురించి చెప్పడానికి ఏ శబ్దకోశం సరిపోతుంది?
నాకోసం ఎంత తపన పడ్డావో..
ఎన్ని బొమ్మలు కొన్నావో ..
చాక్లెట్లిస్తూ బట్టలు కొంటూ ..
మిఠాయిలు తినిపిస్తూ లాలిస్తూ పాలిస్తూ
నేనడిగినవి సమకూరుస్తూ ..
ఎన్నిచోట్లకు తిప్పావో..
ఏం చేసి ఫీజులు కట్టావో.
ఎన్ని అవస్థలు పడ్డావో…
నా భవిష్యత్తుకు ప్రణాళికలెన్ని వేసావో
నాకంట కన్నీరు కారనీక
కనురెప్పవు నీవై కాపాడావు…
నను ఓ అయ్య చేతిలో పెట్టి
నా జీవితానికి పరిపూర్ణత నిచ్చావు
నా బిడ్డలను గుండెలపై ఎక్కించుకుని
తాతను నేనని మీసం తిప్పావు …
నేనెక్కడున్నా నా గురించి పరామర్శలు చేసావు..
నా గురించి ఎందరికి గొప్పలు చెప్పావో
నీ గురించి నేనెంతని చెప్పను?
నన్ను సష్టించిన బ్రహ్మవు నీవు
నా స్థితికి కారణం నీవు
నన్ను నడిపించే లయకారుడవు నీవు
దైవత్వానికి ప్రతిరూపం నీవు
నీవు లేని నేను లేను
నాలో నిండిన ఓ నాన్నా
నీకిదే నా వినమ్ర నీరాజనం .
నాన్న మనసు నిండా నిండిపోయే తరగని ధనం ఆ ప్రేమామత హదయం ఉన్న ప్రతి నాన్నకి వినమ్ర వందనం.
డా. సమ్మెట విజయ
9989820215
నాన్నా.. నువ్వంటే నాకిష్టం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES