Sunday, June 15, 2025
E-PAPER
Homeసోపతినాన్నకు మాట తక్కువ, ప్రేమ ఎక్కువ

నాన్నకు మాట తక్కువ, ప్రేమ ఎక్కువ

- Advertisement -

తండ్రి గురించి మనం చిన్నప్పటి నుంచి ఒకే రకమైన చిత్రాన్ని ఊహించుకుంటూ వచ్చాం. అది కఠినంగా ఉండి, కట్టడి చేయగలిగే, ప్రేమని పైకి వ్యక్తం చేయని, బాధ్యతల్ని మోసే ఒక మహాశక్తిగా వుండే రూపం. కానీ సమాజం మారుతుంది. ఆ చిత్రానికి ఇప్పుడు రంగులొచ్చాయి. నెమ్మదితనంతో, సరదాగా నవ్వుతూ, పిల్లల్ని ఆడిస్తూ, దగ్గర కూర్చోబెట్టుకుని చదివించే నాన్న కనిపిస్తున్నాడు. భుజాలమీదకెక్కించుకుని, గోరుముద్దలు తినిపిస్తూ చిన్నారుల ఆలనా పాలనా చూసే తండ్రులు నేడు ఎంతోమంది వున్నారు. వారందనికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు.
పిల్లలకు ఇప్పుడు అమ్మ పాత్రను కూడా తండ్రులు పోషిస్తున్నారు. పిల్లలకు పాలు పట్టే తండ్రులు, ఇంట్లో కూరలు వండే తండ్రులు, స్కూల్లో వదిలి వెళ్లే తండ్రులు, రాత్రి కథ చెప్పే తండ్రులు ఇవన్నీ మానవ సంబంధాలలో పునర్నిర్మాణం చెందుతున్న తండ్రిత్వం ఆకారాలు.
తండ్రి ప్రేమ కనిపించదు, కానీ తెలిసిపోతుంది
ఒక తండ్రి తన కూతురిని ప్రేమగా చూస్తే… ఆమె అత్తారింట్లో ప్రేమతో పూలు పూయిస్తుందని. తండ్రి ప్రేమను అనుభవించిన పిల్లలు, ఇతరులను అర్థం చేసుకునే, ఆదరించే గుణాన్ని పొందుతారు. సైకాలజీలో దీన్ని ఎమోషనల్‌ మోడలింగ్‌ అంటారు. ఒక తండ్రి చూపించే ప్రేమ, ఆప్యాయత, భద్రత పిల్లల్లో పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుంది.
కానీ చాలామంది తండ్రులు ఇప్పటికీ ఒక అపోహలో బతుకుతున్నారు ‘ప్రేమ చూపిస్తే పిల్లలు చెడిపోతారు’ అని.
అలాగని ప్రేమించరా? ప్రేమిస్తారు! కానీ వ్యక్తపరచలేరు. ఎందుకంటే వారు చిన్నతనంలో చూసింది అదే. కానీ ప్రేమను మాటలతో, హత్తుకోవడంలో, చిన్న ఆశీర్వాదంలో, ఓ శభాష్‌ అనడం లోనే కాదు… మౌనంగా పక్కన కూర్చోబెట్టుకునే భరోసాలోనూ చూపించవచ్చు.
ఈ తరం తండ్రులు మునుపటిలా కాకుండా ఆత్మీయతతో ప్రేమను చూపిస్తున్నారు. ఆఫీస్‌లో వున్నప్పుడు కూడా కాస్త సమయం దొరికితేనో, వీలు కల్పించుకునో వీడియోకాల్‌ చేసి పిల్లలతో హోం వర్క్‌ చేయించడమో, చేసిన హోం వర్క్‌ చెక్‌ చేయడమో చేసే తండ్రి, సెలవుల్లో కూతురితో షాపింగ్‌ చేసే తండ్రి… ఇవన్నీ కేవలం మారుతున్న తండ్రిత్వం చిత్రాలే కాదు, అది నిశ్శబ్దంగా నడుస్తున్న మనుషుల మనసు విప్లవం.
తండ్రి జీవితం ప్రయాణానికి మార్గదర్శి
తండ్రి మాటలు జీవన గమ్యాన్ని చూపిస్తాయి. ఆయన చూపించే దారిలో శక్తి, శాంతి, సామర్థ్యం ఉంటాయి. అతను గట్టిగా ఉంటాడు, కానీ లోపల వాత్సల్యంతో కరిగిపోతాడు. పిల్లలు జీవితంలో ముందడుగు వేయడానికి తాను జీవితంలో వెనక్కి తగ్గడానికి కూడా వెనుకాడకుండా పిల్లల్ని ముందుకు నడిపిస్తాడు.
ఇప్పటి తండ్రి:
– అమ్మలా ముద్దు పెడతాడు
– గురువులా గమ్యం చూపుతాడు
– స్నేహితునిలా అర్థం చేసుకుంటాడు
– యోధుడిలా జీవితాన్ని కాపాడతాడు
తండ్రి ప్రేమ నిద్రలో మురిపించే లాలిపాట. నిదానంగా మార్గం చూపే వెలుగు. ఆ ప్రేమ మాటల్లో వినిపించకపోవచ్చు కానీ జీవితం మొత్తం అలానే సాగిపోతుంది.
ఫాదర్స్‌ డే రోజున, తండ్రిని గౌరవించడమే కాదు, అర్థం చేసుకోవడం ఆయనకిచ్చే నిజమైన బహుమతి.
(జూన్‌ 15వ తేదీన ఫాదర్స్‌ డే సందర్భంగా)
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -