Tuesday, May 13, 2025
Homeబీజినెస్దలాల్‌ స్ట్రీట్‌ జిగేల్‌

దలాల్‌ స్ట్రీట్‌ జిగేల్‌

- Advertisement -

– సెన్సెక్స్‌ 3000 పాయింట్ల పరుగు
– పెరిగిన రూ.16 లక్షల కోట్ల సంపద
– కాల్పుల విరమణతో మద్దతు
– యూఎస్‌- చైనా మధ్య టారిఫ్‌ ఒప్పందం ప్రభావం

ముంబయి: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దలాల్‌ స్ట్రీట్‌ను జిగేల్‌ మనిపించింది. మరోవైపు అమెరికా, చైనా వాణిజ్య చర్చలు, రష్యా,ఉక్రెయిన్‌ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి అంశాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2975 పాయింట్లు లేదా 3.7 శాతం పెరిగి రూ.82,429.90కి చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ916 పాయింట్లు లేదా 3.8 శాతం లాభంతో 24,925 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 3000 పైగా పాయింట్లు పెరిగింది. 2024 డిసెంబర్‌ 16 తర్వాత సూచీలు ఈ స్థాయిని చేరుకోవడం ఇదే తొలిసారి. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.16 లక్షల కోట్లు పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది.
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారాడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ శుక్రవారం ముగింపు 79,454తో పోల్చితే సోమవారం ఉదయం 80,804 వద్ద ప్రారంభమైన సూచీ.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఇంట్రాడేలో 3,000 పాయింట్లకు పైగా లాభంతో 82,495.97 వద్ద గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 3.85 శాతం, స్మాల్‌ క్యాప్‌ 4.18 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీలో అన్ని రంగాలు పరుగులు పెట్టాయి. ఐటీ, రియాల్టీ సూచీలు ఏకంగా 6.7 శాతం, 5.9 శాతం చొప్పున రాణించాయి. లోహ, ఎనర్జీ, బ్యాంకింగ్‌, కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 5.8 శాతం వరకు పెరిగాయి. గడిచిన ఐదేండ్లలో ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మినహా మిగిలిన షేర్లు లాభాలు చవిచూశాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు గరిష్టంగా 7.6 శాతం వరకు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ చమురు 65 డాలర్లుగా, బంగారం ఔన్సు 3222 డాలర్ల వద్ద నమోదయ్యాయి. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం మార్కెట్లకు కలిసివచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ఓ కొలిక్కి రావడం, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల మద్దతు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -