మూసాపేట మండలం వేములలో ఘటన
దుండగులను శిక్షించి.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి : కేవీపీఎస్ నాయకులు మల్లెల మాణిక్యం రాజు
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
సర్పంచ్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీ జరుగుతున్న సమయంలో దళిత యువతిని దుండగులు లాక్కెళ్లి సామూహిక లైంగికదాడి చేసి.. ఆ తర్వాత హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో జరిగింది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సర్పంచ్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దళిత యువతి(21)ను అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైతు వేదిక భవనంలోకి లాక్కెళ్లినట్టు తెలిసింది. ఆమె కేకలు వేయకుండా నోరును గుడ్డతో మూసేశారు. సామూహిక లైంగికదాడి చేశారు. రెండు మూడు గంటలపాటు హింసించి ఆ తర్వాత చంపేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితురాలి కోసం కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మృతదేహాన్ని ఉదయం గ్రామస్తులు గమనించారు. అయితే, విషయాన్ని బయటకు చెప్పడానికి బాధిత కుటుంబం భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఓ వ్యక్తి ద్వారా విషయం తెలుసుకున్న కేవీపీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు మాణిక్యరాజు, జిల్లా ఉపాధ్యక్షులు విష్ణు తదితరులు వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం ఫిర్యాదు చేసి.. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మూసాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
దళిత యువతిపై లైంగికదాడి, హత్య కేసులో దుండగులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వారి వెనుక ఎవరున్నా చట్టం ప్రకారం శిక్ష పడాలని, బాధిత కుటుంబాలనికి సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమి, డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు, రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కోరారు. లేనిచో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
శిక్షపడాలి : శ్రీనివాసులు, యువతి తండ్రి
నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచాను. ఇంటర్ చదివింది.. డిగ్రీ చదువులకు వెళ్లనని చెప్పింది. నా బిడ్డపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టి చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే నా కూతురుకు మనశ్శాంతి ఉంటుంది.
నిందితులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా జిల్లా నాయకులు వి.పద్మ -మహబూబ్‌నగర్ జిల్లా
దళిత యువతిపై లైంగికదాడి, హత్య ఘటన దుర్మార్గం.. సర్పంచ్ ఊరేగింపులో ఎవరూ గమనించరనే దుండగులు దారుణానికి ఒడిగట్టారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.
శిక్షిస్తాం : మూసాపేట ఎస్‌ఐ మొల్కలపల్లి వేణు
దళిత యువతిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
దళిత యువతిపై సామూహిక లైంగికదాడి.. హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



