Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్మశాన వాటికకు దారి లేదంటూ.. దళిత యువకుని అంత్యక్రియలు అడ్డగింత

శ్మశాన వాటికకు దారి లేదంటూ.. దళిత యువకుని అంత్యక్రియలు అడ్డగింత

- Advertisement -

– ఎస్‌ఐ రియాజ్‌ పాషా చొరవతో తాత్కాలిక పరిష్కారం
– శాశ్వత పరిష్కారం చూపాలంటున్న గ్రామస్తులు
నవతెలంగాణ-గార్ల

శ్మశాన వాటికకు దారి లేదంటూ కొంతమంది రైతులు ఓ దళిత యువకుని దహన సంస్కారాలు నాలుగు గంటలపాటు అడ్డుకున్న ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని గోపాలపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కంపాటి ఉపేందర్‌ చెరువులో పడి మరణించగా పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాలు నిర్వహించేందుకు బుధవారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. కాగా, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామంలో 6 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్మశాన వాటికకు దారి లేదంటూ సమీపంలోని రైతులు అడ్డుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు దహన సంస్కారాలు చేయడానికి అడ్డు పడొద్దని ఎంత బతిమిలాడినా వినిపించుకోకపోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శ్మశాన వాటికకు వెళ్లకుండా రైతులు అడ్డుకోవడంతో గ్రామానికి దూరంలో రోడ్డు ప్రక్కన బొంద తీయగా అక్కడ సైతం పూడ్చవద్దని కొంతమంది అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎస్‌.కె.రియాజ్‌ పాషా గ్రామస్థులు, రైతులతో మాట్లాడి తాత్కాలికంగా సమస్యను పరిష్కారించి శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయించారు. కాగా, గత ఆరు సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులతో నిర్మించిన శ్మశాన వాటికకు దారి లేకపోవడంతో గ్రామస్తులు దహన సంస్కరాలు చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భూమిలేని దళితులు, అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు చనిపోయినప్పుడు ఇలాంటి దుస్థితి రావడం దారుణం. ఎన్నిసార్లు అధికారులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదు. దాంతో సెంటు భూమి లేని నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు దహన సంస్కారాల కోసం మృతుని కుటుంబం పడిన బాధలు బంధువులను, గ్రామస్థులను,అంత్యక్రియల కు హజరైన ప్రతి ఒక్కరినీ కన్నీటిని పెట్టించాయి. కాగా, గ్రామంలో భూమిలేని పేదలు ఎవరు చనిపోయినా శ్మశాన వాటికకు వెళ్లాలంటే దారి సమస్య ప్రతిసారి ఉత్పన్నమవుతుందని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు, ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తీసుకోవాలని గ్రామస్తులు, గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాలు కోరుతున్నారు. చెరువులో పడి మృతిచెందిన యువకుడు ఉపేందర్‌ కుటుంబానికి గ్రామానికి చెందిన ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు గ్రామస్థుల సహకారంతో సేకరించిన రూ.16,700 ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -