Monday, January 19, 2026
E-PAPER
Homeజాతీయంకోడి పందేల బరి వద్ద దళితులపై దాడి

కోడి పందేల బరి వద్ద దళితులపై దాడి

- Advertisement -

నిర్వాహకులను శిక్షించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌.. బాధితులకు పరామర్శ
అమరావతి :
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఉప్పులూరు కోడి పందేల బరి వద్ద దళితులను బట్టలూడదీసి, తాళ్లతో కట్టేసి అమానుషంగా హింసించిన నిర్వాహకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్ట విరుద్ధంగా కోడి పందేలు నిర్వహించినవారిపైనా, వారిని అనుమతించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలందరూ దీనిని తీవ్రంగా నిరసించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ మాల్యాద్రి, యం హరిబాబు తదితరులు ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న నిర్వహించిన కోడి పందేల బరి వద్ద నిర్వహించే పత్తలా ఆట కోసం నిర్వాహకులు తోట్లవల్లూరుకు చెందిన 11 మందిని కూలికోసం తీసుకువెళ్లారని, వచ్చిన డబ్బుల్లో లెక్క తేడా రావడంతో, కూలికి వచ్చినవారే ఆ సొమ్మును తీశారనే నెపంతో బట్టలూడదీసి, తాళ్లతో కట్టేసి, అత్యంత దారుణంగా, అమానుషంగా హింసించారని తెలిపారు. ఆ దారుణాన్ని వీడియో కూడా చిత్రీకరించడం వారి రాక్షసానందానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును సైతం ధిక్కరిస్తూ, అధికార పార్టీ అండదండలతో రాష్ట్ర మంతటా బరులువేసి పందేలను నిర్వహించి కోట్లలో కోడి పందేలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం గుడ్లప్పగించి చూసిందే తప్ప ఎక్కడా నిలువరించే ప్రయత్నం చేయలేదని అన్నారు. పైగా ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం ప్రత్యక్షంగా హాజరై ప్రోత్సహించారని, అలాంటి ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

అమానుషానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష : వ్యకాస, కెవిపిఎస్‌
పని కోసం వచ్చిన బీసీ, దళిత వ్యవసాయ కార్మికులను డబ్బుల్లో వ్యత్యాసం వచ్చిందని తాళ్లతో కట్టేసి, అర్ధనగంగా ఉంచి, దుర్భాషలాడుతూ, చితకబాదిన నిర్వాహకులపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆంధప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో అక్రమంగా, చట్ట విరుద్ధంగా కోడి పందేలు ఆడించి, ఆపై పందెం డబ్బుల్లో వ్యత్యాసం రావడంతో అక్కడ పని చేయడానికి వచ్చిన బీసీ, దళిత వ్యవసాయ కార్మికుల చేతులను తాళ్లతో కట్టేసి, అర్ధనగంగా ఉంచి దుర్భాషలాడుతూ కూలీలను చితకబాదినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పామర్తి గోపిచంద్‌, మరో ఏడుగురు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది వ్యవసాయ కార్మికులను నిర్బంధించి డబ్బులు ఇవ్వకపోతే మీ సంగతి తేలుస్తాం, చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. రాష్ట్రంలో రౌడీలకు, గూండాలకు, అరాచక శక్తులకు ఆస్కారం లేదని, అటువంటి వారిని రాష్ట్రం నుంచి వెలివేస్తామని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని, ఈ ఘటనకు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాధితులైన వ్యవసాయ కార్మికులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారంతోపాటు, దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కోడి పందేలు నిషేధించాలని, అరాచకాలు, అక్రమా లపై కఠిన చర్యలు తీసు కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ నలు నిర్వహిం చాలని సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

దోషులను కఠినంగా శిక్షించాలి
కోడి పందేల బరిలో పనికి పిలిచి డబ్బులు ఎగవేతకు కుట్ర పన్ని, పని కోసం వచ్చిన వారిపైనే దొంగతనం మోపి 11 మందిని అర్ధనగంగా.. చేతులు కట్టేసి దాడి చేసిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) డిమాండ్‌ చేసింది. ఇది ఆటవిక చర్యగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అభివర్ణించారు. ఈ అమానుషానికి పాల్పడిన అహంకారులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలాన్ని అధికారులు వెంటనే సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -