Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండామిట్‌…కథ అడ్డం తిరిగింది

డామిట్‌…కథ అడ్డం తిరిగింది

- Advertisement -

ఇరాన్‌ యుద్ధంలో బెడిసికొడుతున్న ట్రంప్‌ వ్యూహాలు
అనుకున్నదొకటి… జరుగుతోంది మరొకటి
చమురు మార్కెట్లపై ప్రభావం


ఇరాన్‌ యుద్ధం అమెరికా, ఇజ్రాయిల్‌ వ్యూహాలకు అనుగుణంగా సాగడం లేదు. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించకుండా ఇరాన్‌ను నిలువరించాలని, దాని సామర్ధ్యాన్ని దెబ్బతీయాలని అవి భావించాయి. గత సంవత్సరం జరిపిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశాలు అవే ప్రయోగాన్ని చేశాయి. ఈ ఏడాది జనవరి 3న వెనిజులాలో అధికార మార్పిడి కోసం చేసిన ప్రయోగాన్ని ఇరాన్‌లో పునరావృతం చేయాలని అవి అనుకున్నాయి.

రాజధాని టెహ్రాన్‌పై డజన్ల కొద్దీ బాంబులు వేశాయి. సుప్రీం నేత అయతొల్లా ఖమేనీని హతమార్చాయి. దీంతో ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగిపోతుందని ట్రంప్‌ భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. అధికార మార్పిడి జరిగిపోలేదు సరికదా పోరు మరింత ఉధృతమవుతోంది. ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ సుప్రీం నేతగా ఎంపికయ్యారు. ఆయన నేతృత్వంలో ఇజ్రాయిల్‌పై, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు ముమ్మరమయ్యాయి.

వాషింగ్టన్‌ : గత నెల 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌ వందలాది క్రూయిజ్‌- బాలిస్టిక్‌ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. మధ్యధరా సముద్ర ప్రాంతంలోని సైప్రస్‌, ఇజ్రాయిల్‌ మొదలుకొని అరేబియా సముద్రంలోని ఒమన్‌ వరకూ అనేక లక్ష్యాలపై దాడులు చేసింది. గల్ఫ్‌ సహకార మండలి దేశాలైన సౌదీ అరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, యూఏఈ, ఖతార్‌, ఒమన్‌లపై, వాటి ఆర్థిక వ్యవస్థలపై కూడా దాడి చేసింది. బాలిస్టిక్‌ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థల కన్నుగప్పి అగ్రరాజ్యం యొక్క స్థావరాలను తాకాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఇరాన్‌ ప్రయోగిస్తున్న క్రూయిజ్‌ క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులు చౌకైనవి. ఉదాహరణకు ఒక్కో షాహెద్‌-136 డ్రోన్‌ ఖరీదు యాభై వేల డాలర్లు మాత్రమే. అలాగే పాట్రియట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్షిపణి ఖరీదు ఒక్కో రౌండుకు మిలియన్‌ డాలర్లు మాత్రమే. అయితే అవి అమెరికా, గల్ఫ్‌ అరబ్‌, ఇజ్రాయిల్‌ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగి పోతున్నాయి. బ్యారల్‌ ముడి చమురు ధర 120 డాలర్లు దాటిపోయింది. సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. ఇరాన్‌ యుద్ధం అనేక అసాధారణ ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. రెండు అణ్వాయుధ దేశాలు అణ్వాయుధాలు లేని దేశంపై యుద్ధానికి దిగాయి. యుద్ధంలో ఓ దేశాధినేతను హతమార్చడం ఇదే మొదటిసారి. ఓ దేశం అనేక దేశాలపై విరుచుకుపడడం కూడా ఇదే ప్రథమం. 21వ శతాబ్దంలో తొలిసారిగా అమెరికా సైనిక మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది.

అధికార మార్పిడి కోసం వైమానిక దాడులు జరిపిన సందర్భాలు గతంలో లేవు. గత వారం రోజులలో ఇరాన్‌ తన నౌకా దళాన్ని, వైమానిక దళాన్ని కొంత మేర కోల్పోయినప్పటికీ యుద్ధాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. ఇరాన్‌ యుద్ధంలో గెలిచామని ప్రకటించి పోరుకు ముగింపు పలకాలని అమెరికాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ అధికారులు ట్రంప్‌నకు సలహా ఇచ్చారు. సుప్రీంనేత ఖమేనీ హతమయ్యారని, ఇరాన్‌ అణు-క్షిపణి కార్యక్రమాలు నిర్వీర్యమయ్యాయని వారు గుర్తు చేశారు. అయితే దీంతోనే ట్రంప్‌ సంతృప్తి చెందుతారా లేక ముందుకు సాగుతారా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా నిలిచింది. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ద్వయం ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. పైగా స్వదేశాలలో అప్రతిష్టను మూటకట్టుకుంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -