Saturday, February 7, 2026
E-PAPER
Homeజాతీయండేంజర్‌ బెల్స్‌

డేంజర్‌ బెల్స్‌

- Advertisement -

అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు నష్టం
పెరగనున్న వార్షిక వాణిజ్య లోటు
తడిసి మోపెడయ్యే దిగుమతుల బిల్లు
ట్రంపునకు మోడీ జీ హుజూర్‌
సందిగ్ధంలో భారత సార్వభౌమత్వం


భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ఉత్పత్తులపై 18 శాతం సుంకాన్ని విధించేందుకు అమెరికాను అనుమతించడం ద్వారా ప్రధాని మోడీ ట్రంప్‌నకు లొంగిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌ మాటలను బట్టి చూస్తే అమెరికా ఉత్పత్తులపై భారత్‌ ఎలాంటి పన్ను విధించబోదు. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేస్తుంది. ఇంధనం, వ్యవసాయ ఉత్ప త్తులు, టెక్నాలజీ, బొగ్గు తదితరాలతో సహా మొత్తం అర ట్రిలియన్‌ డాలర్ల విలువ కలిగిన అమెరికా వస్తువులను కొనుగోలు చేస్తుంది. వాణిజ్య ప్రకటనపై ఇప్పటి వరకూ ఎలాంటి సంయుక్త ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ రెండు దేశాల అధికారులు చెబుతున్న దానిని బట్టి ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇది ఓ సంప్రదాయ వాణిజ్య ఒప్పందంలా కాకుండా ఒక ప్రకటనలా కన్పిస్తోంది.

న్యూఢిల్లీ : భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మోడీ అధికారంలోకి రాక ముందు మన ఉత్పత్తులపై అమెరికా 2.93 శాతం సుంకాన్ని మాత్రమే విధించింది. మోడీ దానిని 18 శాతానికి పెంచేందుకు తల ఊపారు. ఉక్కు, రాగి, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌, ఆటోమొబైల్‌ విడి భాగాలు వంటి రంగాలు ఇప్పటికే అమెరికా వాణిజ్య విస్తరణ చట్టం కింద సుంకాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తులలో ఈ రంగాల ఉమ్మడి వాటా 10.4 శాతం. వాటి ఎగుమతుల విలువ 8.3 బిలియన్‌ డాలర్లు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఈ సుంకాలను ఎత్తివేయని పక్షంలో ఈ రంగాలపై 20-50 శాతం టారిఫ్‌ భారం పడుతుంది.

పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘన
వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడీకి నిపుణులు ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒప్పందం ప్రకటనకు, అమెరికాలో భారత వ్యాపారవేత్తపై అభియోగాలు మోపడానికి ఏమైనా సంబంధం ఉందా? లేకుంటే ఎప్‌స్టీన్‌ పత్రాల లీకేజీతో సంబంధం ఉందా? లేదా ఈ ఏడాదిలో క్వాడ్‌, జీ-20 శిఖరాగ్ర సదస్సులు జరగనున్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని హడావిడిగా ఒప్పందాన్ని పూర్తి చేశారా?. ఈ ప్రశ్నలకు ప్రధాని నుంచి సమాధానాలు లభించాలన్నది నిపుణుల డిమాండ్‌. పార్లమెంట్‌ అనేది భారత ప్రజాస్వామ్యానికి అత్యున్నత దేవాలయం అని చెప్పే ప్రధానమంత్రి దానిని విస్మరించి కీలక నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగానే వాణిజ్య ఒప్పందాన్ని సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఇది ఏడు దశాబ్దాల పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘించడమే.

మన ఆర్థిక, భౌగోళిక రాజకీయ విధానాలపై అమెరికా ప్రకటనలు చేస్తుంటే మన ప్రభుత్వం నిస్సహాయంగా వాటిని అనుసరిస్తున్నట్లు కన్పిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆమోదయోగ్యం, అనివార్యం అయినప్పటికీ మన విదేశాంగ, ఆర్థిక విధానాలలోని కీలక అంశాలను నిర్దేశించే అధికారాన్ని ట్రంప్‌కు మోడీ ఎందుకు ధారాదత్తం చేశారన్నదే ప్రశ్న. ఇది మన సార్వభౌమత్వాన్ని, జాతీయ ప్రయోజనాలను అమెరికా చేతిలో పెట్టడం కాక మరేమిటని నిపుణులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న సూత్రాన్ని ప్రధాని మోడీ కానీ, బీజేపీ నేతలు కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదని సమృద్ధ భారత్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌, ‘ది గ్రేట్‌ ఇండియన్‌ మంథన్‌’ (పెంగ్విన్‌) సంపాదకుడు పుష్పరాజ్‌ దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు.

పస లేని బీజేపీ వాదన
బంగ్లాదేశ్‌, వియత్నాం (20 శాతం), పాకిస్తాన్‌ (19 శాతం), చైనా (34 శాతం)లతో పోలిస్తే భారత్‌ పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉంటాయని బీజేపీ చెబుతోంది. అయితే ఈ దేశాలలో కొన్నింటికి స్పెషల్‌ జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ) కింద ఐదు శాతం రాయితీ లభిస్తోంది. భారత్‌కు ఈ రాయితీని అమెరికా గతంలోనే ఉపసంహరించుకుంది. కాబట్టి బీజేపీ చేస్తున్న వాదనలో వాస్తవం లేదని అర్థమవుతోంది. పైగా చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు భారత్‌తో పోలిస్తే పోటీ ప్రయోజనాన్ని పొందుతున్నాయి. అంటే సరఫరాల విషయంలో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో, బలమైన తయారీ కేంద్రాల ఏర్పాటులో అవి మన కంటే ముందంజలో ఉన్నాయి. అదీకాక ఒప్పందం ప్రకారం మన దేశానికి దిగుమతి అయ్యే అమెరికా ఉత్పత్తులపై పన్నులేవీ విధించరు. అలాంటప్పుడు ఆయా దేశాలతో పోలిస్తే మనకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని ఎలా చెబుతారు?

ఇక చమురు ‘చౌక’ కాబోదు
రష్యా నుంచి చమురును కొనుగోలు చేయబోమని మోడీ హామీ ఇచ్చారని ట్రంప్‌ చెబుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఇప్పటికే బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మనం దిగుమతి చేసుకున్న చమురులో రష్యా వాటా 31 శాతం ఉండగా ఈ నెలలో అది 9 శాతానికి పడిపోయింది. అంటే రష్యా ముడి చమురుపై మనకు లభిస్తున్న రాయితీలు తగ్గిపోతున్నాయన్న మాట. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది. ఇప్పటికే ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తోంది. అయితే ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలపై ఎలాంటి రాయితీలు లభించవు.

అమెరికా ఒత్తిడికి తలవంచి విదేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడం లేదా పూర్తిగా నిలిపివేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇరాన్‌, వెనిజులా దేశాల నుంచి కూడా చమురు దిగుమతులను అమెరికా ఒత్తిడితో నిలిపివేసింది. అంటే మన సార్వభౌమత్వానికి విఘాతం కలిగినట్లే కదా. అమెరికా విధించిన జరిమానాలు అన్యాయం, అసమంజసం, సహేతుకం కాదు అని గగ్గోలు పెట్టిన మన పాలకులు…ఇప్పుడు మన దిగుమతి విధానాలను మరో దేశం శాసించడానికి ఎలా అంగీకరిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అమెరికా పుణ్యమా అని ఇరాన్‌, రష్యాలతో మనకున్న దశాబ్దాల నాటి సంబంధాలు బలహీనపడ్డాయి.

గాలిలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదం
మన అధికారులు చెబుతున్న దాని ప్రకారం భారత్‌ ఐదు సంవత్సరాల కాలంలో అక్కడి నుంచి 500 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అయినప్పటికీ మన వార్షిక వాణిజ్య లోటు ఏటా 363 డాలర్లకు చేరుకుంటుంది. పైగా మన దిగుమతుల్లో సగానికి పైగా అమెరికా వస్తువులే ఉంటాయి కాబట్టి అది చెప్పిన దానికి తలవంచాల్సిందే. ఎందుకంటే వాణిజ్యాన్ని ట్రంప్‌ ఇప్పటికే ఓ ఆయుధంగా మార్చేసి బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. విదేశీ ఉత్పత్తులపై మరింతగా ఆధారపడితే మన పాలకుల ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదం గాలిలో కలిసిపోయినట్లేనా?.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -