– అదాని ఏజెన్సీగా ‘అల్లూరి’ని మార్చిన ప్రభుత్వం
– రేగులపాలెం, చింతలపూడి సభల్లో వి. శ్రీనివాసరావు
అమరావతి : అల్లూరి ఏజెన్సీని అదాని ఏజెన్సీగా ప్రభుత్వం మార్చేసిందని, ఆదివాసీల హక్కులను కాలరాసి, వారి ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టిందని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణంతో గిరిజనుల, రైతుల ఉనికికే ప్రమాదమన్నారు. తక్షణం హైడ్రో పవర్ ప్రాజెక్టుల జిఒ 51ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ రేగులపాలెంలో సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు అధ్యక్షతన, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న అధ్యక్షతన బహిరంగ సభలు జరిగాయి. వీటికి పెద్ద సంఖ్యలో గిరిజనులు, ప్రజలు తరలివచ్చారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… పెదకోట వద్ద తలపెట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టు వల్ల ఆదివాసీ ప్రాంతాలు, పర్యావరణం దెబ్బతింటాయన్నారు. గ్రామసభ అనుమతి లేకుండా, పర్యావరణ ప్రభావాలపై సమగ్ర అధ్యయనం చేయకుండా హైడ్రోపవర్ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం దారుణమన్నారు. గిరిజన సలహా మండలిలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల రద్దు కోసం తీర్మానం చేయాలన్నారు. పోడు భూములకు హక్కు పట్టాలు జారీ చేయాలని కోరారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఎంత మాత్రమూ నిజం లేదన్నారు. ఇప్పటికే నిర్మించిన అనేక ప్రాజెక్టుల్లో ఆదివాసీలకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. అనంతగిరి మండలంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మూడుసార్లు పర్యటించి ఆదివాసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. 300 మందికి చెప్పులు పంపిణీ చేసి మండలంలో సుమారు ఏడు వేల ఎకరాల భూమిని అదానికి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం హైడ్రోపవర్ ప్రాజెక్టులకు అనుమతులివ్వగా వాటిని రద్దు చేయాల్సిందిపోయి సామర్థ్యాన్ని పెంచుతూ టిడిపి కూటమి ప్రభుత్వం జిఒ 51 జారీ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయన్నారు. అటవీ వనరులు, శారద, రైవాడ జలాలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ.. అదానికి భూములను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తహతహలాడుతోందన్నారు. గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు ప్రజల భూములను కార్పొరేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేసిందీ వివరించారు. ఆయా బహిరంగ సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ప్రభావిత ప్రాంతాల్లోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పీసా కమిటీ సభ్యులు, ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల రద్దు కోసం ఏకగ్రీవ తీర్మానం
హైడ్రో పవర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని, జిఒ 51ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రేగులపాలెం, చింతలపూడిల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
హైడ్రో ప్రాజెక్టులతో ఆదివాసీలకు ప్రమాదం
- Advertisement -
- Advertisement -