ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి…
ఈ బాధ్యత కమ్యూనిస్టులదే
కార్పొరేట్ల ప్రయోజనాలకే కేంద్రం పని చేస్తోంది
అమెరికా అధ్యక్షులు ట్రంప్‌తోనూ భారత్‌కు ముప్పు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ఖమ్మం బోసు బొమ్మ సెంటర్‌లో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ.. బహిరంగ సభ
త్రీ టౌన్‌లో రెడ్ షర్ట్స్ వాలంటీర్ల కవాతు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మోడీ పాలనలో దేశానికి ప్రమాదం ఏర్పడిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పారు. మహిళలు, దళితులు, మైనార్టీల పరిస్థితి ప్రమాదకర స్థితికి చేరిందన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ప్రజల మధ్యన పనిచేస్తూ.. ప్రజలను మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజలను అంటిపెట్టుకొని పని చేసే వారే నిజమైన కమ్యూనిస్టులని తెలిపారు. అటువంటి వారిలో ఒకరు యర్రా శ్రీకాంత్ అని అన్నారు. శ్రీకాంత్ స్ఫూర్తితో ప్రజాతంత్ర ఉద్యమాలను నిర్మించాలని సూచించారు. ఖమ్మంలోని బోసుబొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన యర్రా శ్రీకాంత్ విగ్రహాన్ని శనివారం బీవీ రాఘవులు ఆవిష్కరించారు. అనంతరం ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం దివాళా తీయిస్తోందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. దిగుమతి సుంకం లేకుండా అమెరికా నుంచి వివిధ పంట ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రయివేటీకరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని తెలిపారు. ఇటువంటి చర్యలను వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో కరెంటు కట్ అవుతుందని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దును వ్యతిరేకిస్తూ మార్చి 24న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలో వైషమ్యాలు సృష్టించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
దేశానికి ట్రంప్ ప్రమాదం
అమెరికా అధ్యక్షులు ట్రంప్‌తో దేశానికి ప్రమాదం పొంచి ఉందని రాఘవులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దిగుమతి సుంకం లేకుండా పంట ఉత్పత్తులను దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కోడి కాళ్లు, సోయాబీన్, మొక్కజొన్న, పాల ఉత్పత్తులు, మిర్చి, పసుపు తదితర అమెరికా పంట ఉత్పత్తులను దేశం దిగుమతి చేసుకోవడం ద్వారా పౌల్ట్రీ, డెయిరీ రంగాలు దివాళా తీస్తాయన్నారు. 38 శాతంగా ఉన్న పాడి రైతులతో పాటు కౌలు రైతులు తీవ్రంగా దెబ్బతింటారని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) పోరాట ఫలితంగానే పేదలకు ఇండ్ల పట్టాలు : పోతినేని, నున్నా
సీపీఐ(ఎం) పోరాట ఫలితంగానే ఖమ్మంలోని 6,670 మంది పేదలకు ఇండ్ల పట్టాలు వచ్చాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోరాటంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. త్రీ టౌన్ పరిరక్షణ కమిటీకి నేతృత్వం వహించారని, ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం తపించారని అన్నారు. భూదాన్ భూముల్లో పదేండ్లుగా పేదలు ఉంటుంటే ఏమి చేశారని? ఇప్పుడు ఇండ్లను కూల్చడం ఏంటి అని ప్రశ్నించారు. శ్రీకాంత్‌తో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్న నేత అని కొనియాడారు. బోసు బొమ్మ సెంటర్ భవిష్యత్తులో శ్రీకాంత్ సెంటర్ గానూ మారాలని ఆకాంక్షించారు.
ఖమ్మం గాంధీ చౌక్ నుంచి ‘యర్రా’ కవాత్..
శ్రీకాంత్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఖమ్మం గాంధీచౌక్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు రెడ్ షర్ట్స్, శారీస్ ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మనవళ్లు ప్రదర్శించిన కర్ర సాము ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మాదినేని రమేష్, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, చింతలచెరువు కోటేశ్వరరావు, సత్తుపల్లి, మధిర డివిజన్ కార్యదర్శులు శీలం సత్యనారాయణ రెడ్డి, మడుపల్లి గోపాల్‌రావు, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, శ్రీకాంత్ సతీమణి యర్రా సుకన్య తదితరులు పాల్గొన్నారు.
స్ఫూర్తిదాయక నేత శ్రీకాంత్
అసలైన కమ్యూనిస్టులా జీవించిన శ్రీకాంత్ ప్రజల మనస్సులో చిరస్థాయిగా, స్ఫూర్తిదాయకంగా నిలిచారని రాఘవులు అన్నారు. బూర్జువా పార్టీలు రకరకాల రూపాల్లో ప్రజలను ఆకర్షిస్తాయని, కులమత భావాలను రెచ్చగొట్టడమే కాకుండా అవసరమైతే మోడీలా దౌర్జన్యాలకు దిగైనా ప్రజలను తమ మార్గంలోకి తెచ్చుకుంటాయని చెప్పారు. కమ్యూనిస్టులు ప్రజల్లో ఉండి ఇటువంటి వాటిని తిప్పి కొట్టాలని సూచించారు.



