డ్యాం సేఫ్టీ పేరుతో ఎల్‌ఎమ్‌డీ పరిధిలో నివాసితులకు నోటీసులు
ప్రభుత్వ పర్మిషన్‌తోనే ఇండ్లు కట్టుకున్నం
చట్టం పేరుతో మమ్మల్ని ఆగం చేస్తారా? : నిర్వాసితులు
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నిర్వాసితుల కన్నీటి గాథ..
అక్కడే ఉన్న ప్రభుత్వ భవనాలకు రూ.కోట్ల నిధులు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎమ్‌డి) చుట్టూ ఒకటే ఆందోళన. సుమారు 40 ఏండ్ల కిందట డ్యాంలో గ్రామాలు కోల్పోయి 120 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి.. వారికి 20 ఏండ్ల కిందట 60 గజాల చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించగా.. అక్కడే నివాసముంటున్నారు.. ఇప్పుడు వారికి ఇరిగేషన్ శాఖ నుంచి నోటీసులు అందాయి. డ్యాం భద్రతా చట్టం 2021 ప్రకారం.. డ్యాం కట్ట నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ ఉండకూడదని, వాటిని తొలగించకపోతే జైలు శిక్ష విధిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో పట్టాభూముల్లో ఇండ్లు కట్టుకున్నవారూ భయాందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో డ్యాం సమీపంలోనే ఉన్న డైట్ కాలేజీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచింది. దీని సమీపంలోనే ఐటీ టవర్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలూ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ పట్టణ సమీపంలో మానేరు నదిపై 24 టీఎంసీల సామర్థ్యంతో 1978లో లోయర్‌మానేరు డ్యాంకు శంకుస్థాపన జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకుని 1985లో తాగు, సాగునీటి అవసరాల కోసం వినియోగంలోకి వచ్చింది. ఈ డ్యాం అల్గునూర్ నుంచి సూర్యాపేట వరకు అంటే 7 జిల్లాలు 33 మండలాలకు సంబంధించిన 9లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఎల్‌ఎమ్‌డీ ఆనకట్టకు, ఎన్‌హెచ్ బైపాస్ రోడ్డు మధ్యన డ్యాం నిర్మాణ సమయంలో పలు నిర్మాణాలు వెలిశాయి. సదరు డ్యాంలో ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారికి కట్టను ఆనుకునే అప్పటి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. నిర్వాసితులంతా ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 21 డిసెంబర్ 2021 తేదీన జాతీయ డ్యాం భద్రత యాక్ట్ – 2021 అమలులోకి తెచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం.. డ్రయినేజీ వ్యవస్థ, రిలీఫ్ వెల్స్ పరిస్థితి, పనితీరుతోపాటు కట్ట నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలుగానీ, కట్టడాలుగానీ జరపకూడదు. డ్యాం భద్రతా దృష్ట్యా ఆ కట్టడాలను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులు వారం కింద ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో డ్యాం భద్రత యాక్ట్ ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరినామా లేదా రెండూ విధిస్తామని హెచ్చరించారు. గతంలో వచ్చినా అప్పటి ప్రభుత్వం నోటీసులు జారీ చేయలేదని తెలిసింది. దీని గురించి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజరు ప్రస్తావించలేదని తెలిసింది. తాజాగా నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నివాసితుల గొంతుకలో ఆవేదన
ఈ ఏకపక్ష నిర్ణయాన్ని నోటీసులు అందుకున్న కుటుంబాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ‘నవతెలంగాణ’ సదరు నివాస ప్రాంతాల్లోని ప్రజలను కదలించగా.. వారి ఆవేదనను చెప్పుకొచ్చారు. ’35 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం. స్థలాలు, నగలన్నీ అమ్ముకుని ఇక్కడ ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు రోడ్డున పడేస్తారా?’ అంటూ రాజేశ్వరి అనే ఒక నివాసితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బి.అంజయ్య అనే మరో నివాసి మాట్లాడుతూ.. 1990లోనే పట్టా స్థలాన్ని కొనుగోలు చేశామని, లింక్ డాక్యుమెంట్లతో పాటు నల్లా, విద్యుత్ కనెక్షన్లు కూడా ఉన్నాయని తెలిపారు. ’30 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. అప్పుడు అనుమతులు తీసుకుని ఇండ్లను నిర్మించుకున్నాం. కష్టపడి కొనుగోలు చేసుకున్న ఈ స్థలాలకు 200 మీటర్ల వరకు ఉండకూడదని ఆనాడే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు బతికేది ఎలా?’ అంటూ అంజలి అనే నివాసి ప్రశ్నించారు. ”ప్రత్యామ్నాయం చూపకుండా నోటీసులిస్తే ఎక్కడికి వెళ్లాలి?” అని గర్షకుర్తి రాజశేఖర్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న కుటుంబాలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ‘డ్యాం చివరన ఉన్న మా ఇండ్లకు ఏనాడూ వరద రాలేదు. కనీసం నీటి నిల్వ సైతం లేదని, సీసీ రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థతో సురక్షితంగా ఉన్న మా ఇండ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరిస్తున్నారు.
‘డ్యాం’కు ప్రమాదం..ఇండ్లు ఖాళీ చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES