బాంబే హైకోర్టు జడ్జిలు ఇద్దరు-జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అఖండ్ చేసిన వ్యాఖ్యానాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న జాతి హత్యాకాండకు నిరసన తెలిపేందుకై అనుమతి కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పెట్టుకున్న అభ్యర్థనను తోసిపుచ్చే క్రమంలో స్వీయశైలీ విశేషమైన ప్రతిభతో వారుచేసిన మందలింపు నివ్వెరపోయేలా వెలువడింది. బాంబే హైకోర్టు ధర్మాసనంపై కూర్చుని వారు ముందు మీ దేశ పౌరుల కోసం దేశభక్తి ప్రదర్శించండి అని పిటిషనర్‌కు చెప్పారు. పితృస్వామిక ఆధిపత్య కంఠ స్వరంతో వారు ఇంకా ఇలా అన్నారు: మన దేశంలో పరిష్కరించుకోవలసిన సమస్యలు కావలసినన్ని వున్నాయి. ఇలాంటిదేదీ అవసరమని మేము భావించడం లేదు. మీరు చాలా హ్రస్వదృష్టితో వ్యవహరిస్తున్నారని చెప్పడానికి నేను విచారిస్తు న్నాను. ఇక్కడ జరుగుతున్నదేమిటనేదాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మీరు గాజా పాలస్తీనాల వైపూ చూస్తున్నారు. మీ దేశం కోసం మీరేమైనా చేయొద్దా? మీదేశం కేసి చూడండి” అన్నారు. అంతటితో ఆగక ”మీరు దేశభక్తులై మెలగండి. ఇది దేశభక్తి కాదు” అని ముక్తాయించారు.
తామే ధర్మమూర్తులుగా మాట్లాడుతున్నామనే భ్రాంతిలో వారు ఇంకా ఇలా సెలవిచ్చారు. ”దానివల్ల ఎంత దుమారం రేగుతుంతో మీకు తెలియదు. పాలస్తీనా వైపో ఇజ్రాయిల్ వైపో పోవడం. ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీని బట్టి చూస్తే దీనివల్ల మన విదేశాంగ విధానంపై పడే ప్రభావమేంటో మీకు అర్థం కాదు.” ఇంకా ఇలా చెప్పారు: ”మీరు భారత దేశంలో రిజస్టరైన సంస్థగా వున్నారు. మీరు చెత్త పోగేయడం, కాలుష్యం, మురికి నీరు, వరదల వంటి సమస్యలు తీసుకోవచ్చు. మేము కేవలం కొన్ని ఉదాహరణలే ఇస్తున్నాము. వాటిపై మీరు నిరసన తెల్పడం లేదు. మన దేశానికి వేల మైళ్ల దూరంలో ఎక్కడో జరుగుతున్నదాని గురించి నిరసన చెబుతున్నారు”.
ఆ సంఘీభావ చరిత్ర తెలిస్తేనా?
ఈ న్యాయమూర్తులకు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర తెలియక పోవడం విచారకరమైన విషయం. అలాగే తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు పాలస్తీనా సమస్యకు మద్దతుగా తీసుకున్న వైఖరి ఏమిటో కూడా వారికి తెలియదనిపిస్తుంది, తమ స్వాతంత్య్రం కోసం, స్వంత దేశాన్ని పొందేందుకు తమకు గల హక్కు కోసం పాలస్తీనా ప్రజలు చేసే పోరాటాన్ని భారత దేశం నిరంతరాయంగా సంఘీభావం చూపుతూనే వుంది. వారికి చెందాల్సిన వారి భూభాగాన్ని వారికి చెందకుండా చేసేందుకు ఇజ్రాయిల్ దశాబ్దాలుగా దూరంగా వుంచుతూనే వుంది. ఈ విషయాల్లో వారు పూర్తి అజ్ఞానంలో మునిగి తేలుతున్నారనిపిస్తుంది. గాజాలో సాగుతున్న ఘోరమైన జాతి హత్యాకాండపై అంతర్జా తీయంగా అంతకంతకూ ఖండన పెరుగుతున్న అంశంలోనూ వారు అంతే అజ్ఞానంలో వున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం, అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివిధ సంస్థలు స్పష్టంగా ప్రకటించిన అభిప్రాయాలు దాన్నే ప్రతిబింబిస్తున్నా యి. ఆఖరుకు ఫ్రాన్స్‌తో సహా పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు కూడా గాజా ప్రజలను ఆకలితో మాడ్చే ఇజ్రాయిల్ ఘాతుకాలను వ్యతిరేకించాల్సిందేనని అంతర్గత నిరసనను ఎదుర్కోవలసి వచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనను ఘోరంగా ఉల్లంఘిస్తూ ఆ ప్రజలను తిండి లేకుండా మాడ్చి లొంగదీసు కోవాలని చూడటాన్ని వారు నిరసిస్తున్నారు.
ప్రభుత్వం కూడా దిగిరాలేదా?
ఇప్పటికి వచ్చేసరికి భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్ జాతి హత్యాకాండ తీవ్రత నిజమేనని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో భారత దేశ శాశ్వత ప్రతినిధి ఇలా పేర్కొన్నారు:”అక్కడ ఆరోగ్యం, విద్యా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా వున్నాయి. గాజాలో 95 శాతం ఆస్పత్రులు దెబ్బ తినిపోవడమో నాశనం చేయబడటమో జరిగింది. మానవ హక్కులకు సంబంధించిన హైకమిషనర్ కార్యాలయం చెప్పే వివరాల ప్రకారం 6,50,000 మందికి పైగా పిల్లలు ఇరవై మాసాలుగా ఎలాంటి బళ్లు, చదువులు లేకుండా వున్నారు.” కనుక జస్టిస్ రవీంద్ర ఘగే, గౌతమ్ అఖండ్ అనే ఇద్దరు న్యాయమూర్తులు అంటున్నట్టు ఇది కేవలం విదేశాంగ విధానంపై దుమ్ము రేపే నిరసన కాదు. మానవతా మహోపద్రవం సంభవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే మట్టి కరవాల్సిన పరిస్థితి.
కమ్యూనిస్టు వ్యతిరేక జాడ్యం
ఈ జడ్జిలు ఇలా మాట్లాడటానికి కారణం కేవలం విదేశాంగ విధానం గురించిన ఆందోళన మాత్రమే కాదు. వారు అంతగా రెచ్చి పోవడం వెనక కచ్చితంగా కమ్యూనిస్టు వ్యతిరేక మనస్తత్వం ఇమిడి వుంది. వారు ఎంతో అయిష్టంగానే అంగీకరించిన సమస్యలు-చెత్త పోగు పోయడం, వరదలు, కాలుష్యం వంటివి కమ్యూనిస్టులు చేపట్టే ప్రాథమిక సమస్యలే.సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రతిరోజూ క్షేత్ర స్థాయిలో అలాంటి సమస్యలపై కృషి చేయడంలో నిమగమై వుంటారు. అయితే స్థానిక సమస్యలపై చురుగ్గా పని చేసినంత మాత్రాన అంతర్జాతీయ ప్రాధాన్యతగల అంశాలపై నిరసన సంఘీభావం ప్రకటించే హక్కు లేకుండా పోదు. ఆ హక్కులు భారత రాజ్యాంగంలోనే పొందుపర్చబడి వున్నాయి.
అంబేద్కర్ స్పష్టీకరణ
వాస్తవానికి భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థ స్వతంత్రత, కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి విడదీయడం అనే అంశంపై పూర్తి స్పష్టంగా వుంది. 1948 డిసెంబర్ 10న న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి చెప్పే 50వ అధికరణంపై మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ ఇలా అన్నారు: ”న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సంబంధించిన ఈ అధికరణం విషయంలో మా మధ్య ఎలాంటి తేడాలు రాలేదు. దీని ద్వారా మేము న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వుండాలనే అంశం చెప్పదలిచాము. కనుక ఆది ఆ విధంగానే ఆదేశిక సూత్రాలలో భాగంగా వుంటుంది”. మరో సందర్భంగా 1949 మే 14న కూడా అంబేద్కర్ ఇదే విషయం మళ్ళీ ప్రకటించారు. ”రాజ్యాంగంలో ఈ అధికరణం ద్వారా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వుండాలని మాత్రమే గాక సమర్థవంతంగా వుండాలని కూడా మా ఉద్దేశమని నేను చెప్పదలచాను”.అయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ చీకటి కాలంలో ”న్యాయ వ్యవస్థ స్వయం సమర్థత” అనే ఈ భావన ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ పైత్యపు లక్షణాలు బాంబే హైకోర్టు న్యాయమూర్తుల్లోనే గాక సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ఉత్తర్వులలో కూడా అవి గోచరించడం విచారం కలిగిస్తుంది. అయోధ్య తీర్పు, జమ్ము కాశ్మీర్ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని హరించడం, మనీ లాండరింగ్ చట్టం సవరణలకు ఆమోద ముద్ర వేయడం ద్వారా ఇ.డి కి ఆయుధాలివ్వడం ఈ కోవకు చెందినవే. దిగువ కోర్టుల నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ ఈ పోకడలే ప్రదర్శితమవుతున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థగా, నిబద్దంగా వ్యవహరించాలనే పోకడ కనిపిస్తోంది.
నాజీ జర్మనీ పాఠాలివే
చరిత్ర చెప్పిన పాఠాలు మర్చిపోతే అవే పునరావృతమవుతాయి. నాజీ జర్మనీలో నురేంబర్గ్ శాసనాలు ఇందుకొక ప్రమాదకర హెచ్చరి కలుగా వున్నాయి. యూదులకు పౌరహక్కులు లేకుండా సమాజ జీవితం నుంచి దూరంగా వుంచడానికి తెచ్చిన శాసనాలవి. వాటికవే న్యాయ పరమైన ఉత్తర్వులు కాకున్నా న్యాయం చేకూర్చే ప్రక్రియను అవి దాదాఫు తలకిందులు చేశాయి. యూదులూ మైనారిటీలను వేధించేందుకు, సమాజం నుంచి పౌర జీవితం నుంచి వెలివేసేందుకు నాజీ పాలకులు తమ పథకంలో న్యాయ వ్యవస్థను కూడా భాగంగా చేసుకున్నారు. ధైర్యశాలులైన ఏ కొంత మందినో మినహాయిస్తే అది కూడా అందుకు అనుగుణంగా పనిచేసింది. జడ్జిలు, ప్రాసిక్యూటర్లు ఈ వివక్షతాయుత చట్టాలే అమలు చేశారు. రాజకీయ అవసరాలు, రాజ్యం భావజాలానికి, న్యాయ సూత్రాలకు తిలోదకాలిచ్చారు.
ఇప్పుడు మన దేశంలో హిందూత్వ భావజాలం విషపూరతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మన ప్రజాస్వామ్య, లౌకిక, రిపబ్లిక్ అలాంటి ప్రమాదకర పరిస్థితినే ఎదుర్కొంటున్నది. న్యాయవ్యవస్థతో సహా మొత్తం రాజ్యంపై అది ఫాసిస్టు తరహా మెజారిటీ వాదాన్ని రుద్దాలని చూ స్తుంది. న్యాయవ్యవస్థతో సహా అన్ని రంగాలూ ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇంకా దాన్ని విస్మరించడమంటే వినాశాన్ని కొనితెచ్చుకోవడమే. ఒక వ్యాఖ్యాత దీనిపై గగుర్పాటు కలిగేలా ఇలా హెచ్చరిక చేశారు: ”కోర్టులు కూడా హిందుత్వ తర్కం మొదలెట్టడం అంటే మనం దిగులు పడవలసిన సమయం వచ్చిందన్న మాటే. ఇప్పటికే మన నెత్తిపైకి కూడా నీళ్ళు వచ్చేశాయి..” కనుక మనం ఈ ప్రమాదకర పోకడను అడ్డుకుని వెనక్కు కొట్టకపోతే దాని కబంధ హస్తాల్లో చిక్కుకు పోవలసిందే.
(జులై 28-ఆగస్టు3
‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
న్యాయవ్యవస్థలో ప్రమాదకర పైత్యాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES