నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ లోని నిజాంసాగర్ రోడ్ ల రెండు వ్యాపార సముదాయాలు, ఓ ప్రైవేట్ పాఠశాల, ఏడు అపార్ట్మెంట్లు ఉన్న ప్రదేశంలో నడిరోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రాకపోకలు ఎక్కువగా జరిగే ఈ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు బలహీనంగా, వంగిన స్థితిలో ఉండటం వల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయం ప్రజల్లో నెలకొంది.
ప్రత్యేకంగా ఐరన్ (ఇనుప) స్తంభం సంఖ్య 33కేవీ సిఎంఆర్ ,64, సిఎం 56 మరియు సిమెంట్ స్తంభాలు జేడీ ,70, నజ్స్ర్బ్ 10, 11 ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ స్తంభాలు కూలిపోతే పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, స్థానిక నివాసులు తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చి, అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.



