సెప్టెంబర్‌లో రెట్టింపు
17 శాతం పెరిగిన దిగుమతులు
న్యూఢిల్లీ : భారత వాణిజ్య లోటు అమాంతం పెరిగి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎగుమతుల కంటే దిగుమతులు భారీగా పెరగడంతో ఈ లోటు ఏర్పడింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణంకాల ప్రకారం.. ఏడాదికేడాదితో పోల్చితే 2025 సెప్టెంబర్‌లో భారత ఎగుమతులు స్వల్పంగా 0.8 శాతం పెరిగి 67.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు ఏకంగా 11.3 శాతం ఎగిసి 83.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 16.6 బిలియన్లకు ఎగిసింది. గతేడాది ఇదే మాసంలో లోటు 8.6 బిలియన్లుగా ఉంది. దీంతో పోల్చితే వాణిజ్య లోటు రెట్టింపు అయ్యింది.
అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం అధిక సుంకాలను విధించడం ద్వారా భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మేలో అమెరికాకు 8.8 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా.. సెప్టెంబర్‌లో 5.5 బిలియన్లకు పడిపో యాయి. అయినప్పటికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం గమనార్హం. మరోవైపు బంగారం, వెండి, ఎరువులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతులు భారీగా పెరిగాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో భారత ఎగుమతులు 4.45 శాతం పెరిగి 413.3 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 3.55 శాతం పెరిగి 472.8 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి.