Tuesday, July 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎన్నికల ప్రజాస్వామ్యంపై కారుమేఘాలు

ఎన్నికల ప్రజాస్వామ్యంపై కారుమేఘాలు

- Advertisement -

”బీహార్‌ ఓటర్ల జాబితాలో విదేశీయులకు చోటు’ ఎన్నికల సంఘ ప్రకటన: ఇండియా కూటమి డేటాపై సందేహాలు”-ఒక ప్రధాన జాతీయ పత్రిక పతాక శీర్షిక ఘోష ఇది. ఎంతమాత్రం నమ్మశక్యం కానిదిగా కనిపించింది. దీనిపై ఇది వరకు మేము రాసిన సంపాదకీయంలో ప్రత్యేక నిశిత పున:పరిశీలన (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-ఎస్‌. ఐ.ఆర్‌) కోసం భారత ఎన్నికల సంఘం (సి.ఇ.సి) జూన్‌ 24న ఒక పత్రికా ప్రకటనలో విడుదల చేసిన కాలక్రమణికను పూర్తిగా పొందుపర్చాము. మా పాఠకుల సౌకర్యార్థం ఆ క్రమాన్ని మరోసారి గుర్తుచేస్తాము:బూత్‌ స్థాయి అధికారులు (బి.ఎల్‌.ఓలు) ఈ ఫారాలను ఇంటింటికీ పంపిణీ చేసి మళ్లీ భర్తీ చేసిన తర్వాత సేకరించి పరిశీలిస్తారు. అంతేగాక పైస్థాయి అధికారులు వాటి హేతుబద్ధీకరణ, క్రమబద్ధీకరణ, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాట్లలో తగు కొత్త మార్పులు చేయాలి. పోలింగ్‌ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు జాబితా తుది ఆమోదం తీసుకోవాలి. ముసాయిదా ఓటర్‌ జాబితాలను 2025 ఆగష్టు1లోగా ప్రచురించాలి. తుది జాబితాను 2025 సెప్టెంబరు 30లోగా సిద్ధం చేయాలి.”

ఈసీ ఖండించకపోతే..?
నిజంగా జరగాల్సింది అదయితే ఎన్నికల సంఘం బీహార్‌ ఓటర్ల జాబితాలో విదేశీయులు బయటపడ్డారని చెప్పడమేమిటి? సెప్టెంబరు 30లోగా ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశమే లేదు. అంటే తప్పనిసరిగా కొందరు ఇ.సి అధికారులు ఈ తప్పుడు కథనాలను వదిలారన్నమాట. అత్యున్నత న్యాయస్థానంలో ఈ సమస్య జులై 28న విచారణకు వస్తుంది గనక ఈలోగా దురభిప్రాయం వ్యాప్తి చేయడానికి ఈ పనిచేసి వుండాలి. ఇది అధికారికంగా చేసిన లీకా లేక ఎవరైనా లోపాయికారిగా చేశారా అనేది అటుంచి దీనిపై చట్టపరమైన ఖండన విడుదల చేయకపోతే ఈసీనే అందుకు బాధ్యత వహించవలసి వుంటుంది. ఈ బాధ్యతలకు సంబంధించిన ఈ అంశం మరింత తక్షణ ప్రాధాన్యత గలదిగా తయారవడానికి మరో కారణం కూడా వుంది. ఈ ప్రత్యేక సునిశిత పున:పరిశీలనను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్దిష్ట ఉత్తర్వు ఇవ్వక పోయినప్పటికీ (ఎందుకంటే పిటిషనర్లు అలాంటిది అడగలేదు గనక) ఈ మౌలిక ప్రశ్నలపై ఈసీ సూటిగా సమాధానాలు చెప్పవలసే వుంటుంది.

కీలక ప్రశ్నలు
మొదటి ప్రశ్న: ఒక ఓటరు పౌరసత్వ హోదాను నిర్ణయించేందుకు ఈసీఐకి అధికారం వుందా? ఈ విషయం హోంశాఖ పరిధిలోదనీ, ఒక వ్యక్తి పౌరుడా కాదా అనేది ఆ మంత్రిత్వ శాఖనే నిర్ణయించగలదనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్‌ను ఈ పరిశీలనకు అర్హమైన పత్రంగా చూడటానికి నిరాకరించిన ఈసీ వైఖరిని వారి తరపు న్యాయవాది సమర్థించినప్పుడు కోర్టు ఇలా చెప్పింది: ”పౌరసత్వం అనేది ఎన్నికల సంఘం నిర్ణయించేది కాదు, హోంశాఖ తేల్చవలసింది”
రెండవ ప్రశ్న: ఈ సమయంలో దీన్ని ఎందుకు చేపట్టినట్టు? ఈసీ గనక కేవలం పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో వుండాలని భావించి వున్నట్టయితే ”ఈ ప్రక్రియను మరింత ముందుగా ప్రారంభించి వుండవలసింది” అని చెప్పింది. ఈ సమయంలో దీన్ని చేపట్టడంపై కీలకంగా ప్రశ్నిస్తూ బీహార్‌ ఎన్నికల నుంచి దీన్ని వేరు చేయవచ్చునా అని కూడా అడిగింది.

దీని వాస్తవిక పర్యవసానాలేమిటో జస్టిస్‌ ధూలియా నొక్కి చెప్పారు: ”2025లో అప్పటికే ఓటర్ల జాబితాలో వున్న వ్యక్తిని గనక మీరు తొలగించేట్టయితే సదరు వ్యక్తి దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లవలసి వుంటుంది. ఈ మొత్తం తతంగం ముగియాలంటే అప్పుడు ఆ వ్యక్తి ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేసే హక్కు నిరాకరించబడుతుంది. పౌరులు కాని వారెవరూ ఓటర్ల జాబితాలో వుండకుండా సునిశిత కసరత్తుతో మీరు మొత్తం జాబితాలను ప్రక్షాళన చేయడంలో తప్పేం లేదు. కానీ మీరు రానున్న ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు నిర్ణయించితే” అంటూ ఇంకా ఇలా వాస్తవ పరిస్థితిని చెప్పేలా హెచ్చరించారు. ”మీరు గనక ఈ పత్రాలను ఉన్నఫళాన చూపించమని అడిగితే నేను కూడా ఇప్పటికిప్పుడు వాటిని తీసుకు రాలేకపోవచ్చు. ఆచరణాత్మకంగా ఆలోచించండి. మీరు పెట్టిన గడువు ఎలా వుందో చూడండి” ఈసీఐ చూపించాలని పట్టుపడుతున్న పత్రాలను ప్రస్తావిస్తూ అన్న మాటలివి. అవి అచ్చంగా జాతీయ పౌరసత్వ చట్టం చెప్పిన జాబితాలోవే కావడం కొట్టవచ్చినట్టు కనిపిస్తుందన్న వాస్తవాన్ని దృష్టికి తెచ్చారు.

ఏం చేస్తారు? ఎలా?
ఇక చివరగా మూడవ ప్రశ్న: ఈసీ ఎలాంటి పద్ధతులను అనుసరిస్తుంది? ఓటు హక్కును రద్దు చేయ వలసిన పరిస్థితి వస్తే ఈసీ ఏ పద్ధతిని అనుసరిస్తుందో స్పష్టం చేయాలని న్యాయమూర్తులు అడిగారు. జస్టిస్‌ ధూలియా ఒక ప్రశ్న సూటిగా వేశారు: ” ప్రజా ప్రాతినిధ్య చట్టం (ఆర్‌పీఏ)లో ఆకస్మిక పున:పరిశీలన కింద ఓ ఓటరును తొలగించాల్సి వస్తే మౌఖికంగా వారి వాదన వినాలని వున్నప్పుడు ఈ సునిశిత పరిశీలనలో అందుకు అవకాశం వుండదని చెప్పగలరా?”
ఆర్‌పీఏ నిబంధనల ప్రకారం ఓటర్ల తొలగింపునకు సంబంధించిన సందర్భాలన్నిటిలోనూ, చనిపోయారని ఖచ్చితంగా నిరూపణ అయినప్పుడు తప్ప-ఓటరుకు నోటీసు ఇవ్వడం తప్పనిసరి, వారి వాదన వినిపించే అవకాశ మివ్వాలి. ఈ ప్రశ్నలడగడం గురించి మాట్లాడే సందర్భంలో కొన్ని పత్రాలను స్వీకరించవచ్చు కదా అనే అంశం వచ్చింది. ఆ క్రమంలో ఆధార్‌, ఓటరు ఫొటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్‌), రేషన్‌ కార్డు ఈ ప్రత్యేక సునిశిత పున: పరిశీలన (ఎస్‌.ఐ.ఆర్‌)కు అర్హమైన పత్రాలుగా తీసుకోవచ్చు కదా అని సుప్రీంకోర్టు ఈసీ ని అడిగింది. ఈసీ విడుదల చేసిన 11 పత్రాల జాబితాపై ఇప్పటికే విస్తృత భయాందోళన, గందరగోళం తలెత్తిన నేపథ్యంలో ఆ పరిధిని మరింత విస్తరించేందుకు దీనివల్ల అవకాశం కలగొచ్చు. ప్రజలను వెంటాడుతున్న ఖచ్చితమైన ప్రశ్నలు కొన్ని వున్నాయి. సమానావకాశాలు కలిగిస్తూ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీకి సర్వాధికారాలు వున్నాయనడంతో ఎవరూ విభేదించరు. అయితే జూన్‌ 24 ఉత్తర్వు కమిషన్‌ చెప్పిన పద్ధతి, ఇచ్చిన కాలవ్యవధి గతంలో అనుసరిస్తున్న వరవడిలో ఎన్నడూ లేనంత తేడాగా వున్నాయి. ఎస్‌.ఐ.ఆర్‌కు సంబంధిత శాసన నిబంధనలలో గానీ, నియమావళిలో గానీ ప్రాతిపదికే లేదు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను దొడ్డిదోవన ప్రవేశపెట్టే ప్రయత్నంగా ఇది గోచరిస్తుంది. దీని ఫలితం ఏమంటే-భారీ సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం. మరీ ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా ఉపేక్షకు గురైనవారు, డిజిటల్‌ సామర్థ్యం లేనివారే దానివల్ల నష్టపోతారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి తతంగమే చేపట్టవచ్చునని ఈసీ సూచనగా అంటున్నది గనక ఈ ప్రశ్నలకు సహేతుకమైన, అర్థవంతమైన పరిష్కారాలు తేలవలసిందే. లేకపోతే అసలు ఎన్నికల ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోతుంది.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ జులై 16 సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -