పెండ్లి చేసుకోట్లేదని మరదలిని చంపిన బావ
ముషీరాబాద్‌లో ఘటన
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
వరుసకు మరదలు అయ్యే యువతితో పెండ్లికి ఆమె కుటుంబీకులు నిరాకరించడంతో కక్ష పెంచుకున్న యువకుడు.. ఇంట్లోకి చొరబడి తల్లి కండ్లెదుటే యువతిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపూజీనగర్ నివాసముండే కాంతారావు, లక్ష్మి దంపతుల కుమార్తె పవిత్ర(19). ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. పవిత్రను వరుసకు బావయ్యే రహమత్‌నగర్ చెందిన ఉమాశంకర్ వివాహం చేసుకోవాలనుకుని.. ఆమె తల్లిదండ్రులతో విషయం ప్రస్తావించాడు. అయితే అతను టైల్స్ వేసే పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతని ప్రవర్తన నచ్చని కాంతారావు దంపతులు పెండ్లికి నిరాకరించారు. దాంతో కక్ష పెంచుకున్న ఉమాశంకర్ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో తల్లీకూతుళ్లు ఉన్న సమయంలో వచ్చాడు. పవిత్రతో తనకు ఎందుకు వివాహం చేయరని లకిëతో వాదించాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో మరదలి మెడపై పొడిచి హత్య చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో కత్తి, నిందితుని ఫోన్ లభ్యమైంది.
తల్లి కండ్లెదుటే కుమార్తె దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



