కూతురు పుట్టిందంటే వెలుగులు చిందినట్టే, ఇల్లు అంతా నవ్వులతో పూలమాల వేసినట్టే. అమ్మని అల్లరి చేస్తూ, నాన్నని ముద్దాడుతూ… ప్రతి మూలలో పండుగ తెచ్చే పసిడి పాపాయే. చెప్పక ముందే అవసరం గమనించే గుణం. కుటుంబానికే కానుకగా దొరికే వరం. నాన్నకి చారు, అమ్మకి మాట, అన్నకి ధైర్యం. ఇంటి ప్రతి కోణంలో ఆమె ఆధారమై నిలుస్తుంది. పాపాయి పెద్దదై దేశాన్నే నడిపించినా, మరచిపోదు తల్లిదండ్రుల చిన్న కోరికలు. కూతురు ఉన్న ఇంట్లో దుఃఖం నిలవదు. ఆమె నవ్వు వింటే బాధలే కరిగిపోతాయి. కూతురు అంటే ఆడపిల్ల కాదు, ఒక సామ్రాజ్యం! ఈ రోజు డాటర్స్ డే సందర్భంగా…
”ఏది అవసరమో అదే సమయానికి చేసేది… చెప్పక ముందే ‘నాకు లేట్ అవుతుంది’ అంటే వంట చేసి వెళ్ళిపోతుంది… ఎవరికి ఏం నచ్చుతుందో అదే తెచ్చిపెడుతుంది…” – ఇలాంటి చిన్నచిన్న పనులే కూతురి మహిమను, కుటుంబంలో ఆమె ప్రాధాన్యతను చూపిస్తాయి. కూతురు అంటే కేవలం పిల్ల కాదు, ఇంటి హదయం, భావోద్వేగాల కాపరి, ఆనందానికి మూలం.
ప్రపంచానికి కూతుళ్లే ఉదాహరణ
భారతదేశంలో అబ్బాయికి బదులుగా ఆడపిల్ల అంటే అబ్బా అనే కళంకం నుండి దూరంగా ఉండటానికి, అమ్మాయిల వివక్షకు వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి, లింగాల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మనం డాటర్స్ డే జరుపుకుంటాం. ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే, మహిళల నాయకత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. కరోనా సమయంలో జర్మనీకి అంగెలా మెర్కెల్, న్యూజిలాండ్‌కి జసిండా ఆర్డెన్, తైవాన్‌కి సారు ఇంగ్-వెన్ లాంటి మహిళా నాయకులు తమ దేశాలను సమర్థవంతంగా కరోనా నుంచి కాపాడారు. వారు చూపింది కేవలం రాజకీయ ప్రతిభ కాదు – శాంతం, సహనం, దయ, స్పష్టత. అంటే… కూతురు ఇంట్లో ఉంటే ఇల్లు వెలిగిపోతుంది, దేశానికి నాయకురాలు అయితే దేశం వెలిగిపోతుంది!
తండ్రి ప్రేమ
నేటి తండ్రులు కూతురిని ‘ప్రిన్సెస్’లా పెంచుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే. ఆ ప్రేమ వల్ల కూతుళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ అతి రక్షణ వల్ల చిన్న సమస్యలకే భయపడే స్వభావం రావచ్చు. దీనికి ఒక ఉదాహరణ… ఒక కూతుర్ని ఎప్పుడూ కారులోనే స్కూల్‌కి తీసుకెళ్లేవారు. ఒక రోజు బస్సులో వెళ్ళమన్నప్పుడు, సగం దారిలో వుండగానే తండ్రికి కాల్ చేసి ”డాడీ, అందరూ నన్ను చూస్తున్నారు, నాకు టెన్షన్ వస్తుంది!” అని ఏడ్చేసింది. ప్రేమతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడం కూడా చాలా ముఖ్యం.
తల్లిదండ్రులకు కూతురు భరోసా: కనిపించని శ్రమ
ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా ‘టాబ్లెట్ వేసుకున్నారా?’ అని అడిగేది ఎక్కువగా కూతురే. నాన్న పని ఒత్తిడితో ఇంటికి వస్తే, ‘డాడీకి బాగోలేదేమో’ అని గమనించేది ఆమెనే. అబ్బాయి అయితే ఎక్కువగా ‘Wi-Fi’ సరిగ్గా వర్క్ అవుతున్నదా?’ అని అడుగుతాడు. ఇది నిజం. కూతురులో ఉండే భావోద్వేగ తెలివితేటలు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) వారికి కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకునే శక్తినిస్తాయి.
కమ్యూనికేషన్స్ నిపుణుడు ఆల్ఫోర్డ్ చెప్పినట్లుగా, కుమార్తెలు తమ కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి ‘కనిపించని శ్రమ’ను గణనీయంగా పెట్టుబడి పెడతారు. కుటుంబ సమావేశాలను నిర్వహించడం, విభేదాలపై సున్నితంగా వ్యవహరించడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడం, సాంస్కతిక అంచనాలను వ్యక్తిగత బాధ్యతలతో సమతుల్యం చేయడంలో ముందుంటారు కూతుర్లు.
ఆప్యాయత, అనుబంధం:
అత్తా, పిన్ని, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, బాబారు, మామ… అందరినీ ఆప్యాయంగా పలకరించి అనుబంధాలను కలిపేది కూతురే.
కూతురు ఉన్న ఇంట్లో పండుగే పండుగ.
చిన్ననాటి నుండి బొమ్మల పెళ్లి, బొమ్మల కొలువులు, పుట్టినరోజుల సందడి… పెద్దయ్యాక పండుగలు, సెలబ్రేషన్లు… అన్నీ కూతురే హుషారుగా చేస్తుంది.
దసరా సందర్భంగా ఒక అమ్మాయి బొమ్మల కొలువు పెట్టింది. గదంతా బొమ్మలతో నిండిపోయింది. నాన్న అడిగాడు… ”ఇన్ని బొమ్మలు తిరిగి ఎవరు సర్దుతారు?” అని. దానికి ఆమె సమాధానం… ”డాడీ, ఈ పండుగ తర్వాత మీరు సర్దుకోవాలి… నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి!”అంది. తాను చేయడమే కాదు, తన వాళ్లతో కూడా ఎంతో చాకచక్యంగా పన్లు చేయిస్తుంది కూతురు. కూతురు ఉన్న ఇల్లు ఎప్పుడూ ఆనందకరంగా, సరదాగా ఉంటుంది.
తల్లిదండ్రులకు సూచనలు
ఆమెను ముందడుగు వేయనివ్వండి: మా కుమార్తెలు ఎంత గొప్పవారనే దాని గురించి ఆలోచించుకోవాలి. ఈ రోజు ఆమె ఏమి చేయాలనుకుంటున్నదో ఆమెకు తెలియజేయండి. పార్కులో సైక్లింగ్ చేస్తున్నదా? చాలా బాగుంది. ఆమె స్నేహితులతో గడపాలని కోరుకుంటే, అది ఆమె ఎంపికగా ఉండనివ్వండి.
కూతురు చేసే చిన్న పనిని గుర్తించి అభినందించాలి: ‘బాగా చేసావు’ అనే మాటే ఆమెకు ప్రేరణ.
బాధ్యతలను పంచుకోవాలి. లేదంటే ఆమె ఒత్తిడికి గురవుతుంది. స్వయం సంరక్షణ నేర్పాలి. ఎందుకంటే కూతురు తనను తాను చూసుకోవడం కూడా నేర్చుకోవాలిగా మరి.
నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇవ్వాలి. తద్వారా ఆమె స్వతంత్రత పెరుగుతుంది.
కూతురు ఒక ఆశీర్వాదం
కూతురు పుట్టి ఒడిలోకి రాగానే ఆ ఫీలింగ్… బుడిబుడి అడుగులు వేసినప్పుడు.. అమ్మా అని పిలిచినప్పుడు… బడికి వెళ్ళేటప్పుడు ఇచ్చిన ముద్దు జ్ఞాపకం… కాలేజీకి వెళ్లేటపుడు ఇచ్చిన హాగ్… యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు చెప్పిన ఊసులు… ఇంటి మనిషే మాయమైనప్పుడు అన్ని తానై నడిపింది. ”నాకు ధైర్యం, బలం, బలహీనత నా కూతురే…” అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు.
కూతురు పువ్వు కాదు ఫైర్
ఎదిగిన బిడ్డల ఉన్నతి మనం గెలిచిన జీవితం. డాటర్స్ డే ఒక్కరోజు కాదు… ప్రతి రోజూ జరుపుకోవాల్సిందే!
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్