ఐదుసార్లు ఛాంపియన్
మళ్లీ ధోనీపైనే ఆశలు
గాయంతో టోర్నీకి నాథన్ ఎల్లిస్ దూరం
28నుంచి ఐపీఎల్ సీజన్-19 ప్రారంభం
చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్(సిఎస్‌కె) అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తునే ఉన్నాడు. ఇతని సారథ్యంలోనే ఆ జట్టు ఐదుసార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరో ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు జరిగిన 18 సీజన్‌లలో ఏకంగా 12సార్లు ప్లే-ఆఫ్స్‌కు చేరిన గొప్ప రికార్డు చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం. దీంతో సీఎస్‌కే పేస్ విభాగంలో ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు ఉన్నారు. మ్యాట్ హెన్రీని రూ. 2 కోట్లు, ఫౌల్క్స్‌ను రూ. 75 లక్షలకు సీఎస్‌కే మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు..
రెండేండ్లక్రితం సారథ్య పగ్గాలను వదులుకున్న ధోనీ.. ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పు చేసుకోవాలని చూస్తున్నాడు. గొప్ప ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో 2025 సీజన్‌లో చెన్నై 10వ స్థానానికి పరిమితమైంది. ఆ సీజన్‌లోనూ ధోనీ బ్యాటింగ్‌కు దిగే సమయానికి మ్యాచ్ చేజారిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఈ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాలని చూస్తున్నాడు. కెప్టెన్ కూల్, ఛేజింగ్ కింగ్‌గా పేరుగాంచిన ధోనీని టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఫలితం రాబట్టవచ్చని జట్టు యాజమాన్యం కూడా భావించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గాయాల బెడద…
సీజన్-19 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. స్టార్ బౌలర్ పథీరణను మినీ వేలానికి ముందు విడుదల చేయడం, తాజాగా ఎల్లిస్ సేవలను సిఎస్కే కోల్పోవడంతో ఆ జట్టు బౌలింగ్ బలహీనంగా మారింది. ఎన్నో ఆశలతో ఆ జట్టు మినీ వేలంలో దక్కించుకున్న పేస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. నాథన్ ఎల్లిస్‌కు డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేస్తాడనే పేరు ఉంది. రూ.2 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.
నాథన్ ఎల్లిస్ గతంలో 2021 నుంచి 2025 వరకు పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 17 మ్యాచ్‌లు ఆడి, 19 వికెట్లు పడగొట్టాడు. ఎల్లిస్ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడు ఐపీఎల్ 2026కు దూరమైన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే అతడికి రీప్లేస్‌మెంట్‌ను మాత్రం సీఎస్కే.. ఇంకా తీసుకోలేదు. ఐపిఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మార్చి 30న ఈ మ్యాచ్ జరుగుతుంది.
రాజస్థాన్ రాయల్స్‌కు సామ్ కరణ్…
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ కూడా గాయంతో ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 2.4 కోట్లకు దక్కించుకుంది. అయితే గ్రోయిన్ గాయం కారణంగా అతను మైదానంలోకి అడుగుపెట్టలేకపోతున్నాడు. ఆల్ రౌండర్ కోటాలో కీలకమైన కరణ్ లేకపోవడం రాజస్థాన్‌కు పెద్ద మైనస్ కానుంది.
పథీరణకు ఎదురుదెబ్బ…
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేలంలో ఏకంగా రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరాణాకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఒసి) నిరాకరించింది. ఫిట్‌నెస్ టెస్టులో పతీరాణ విఫలం కావడమే దీనికి ప్రధాన కారణం. టి20 వరల్డ్ కప్ సమయంలో తగిలిన గాయం ఇంకా తగ్గకపోవడంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు :
గైక్వాడ్(కెప్టెన్), సంజూ శాంసన్, ధోనీ(వికెట్ కీపర్లు), కాంబోజ్, ఓవర్టన్, గుర్‌ప్రీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, దూబే, ఆయుష్ మాత్రే, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్, ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, షార్ట్, అమన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్, చాహర్, హెన్రీ.



