Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి కంటే డీసీసీ పవర్‌ఫుల్‌.!

మంత్రి కంటే డీసీసీ పవర్‌ఫుల్‌.!

- Advertisement -

అధ్యక్షులు చెప్పిన వారికే ఎమ్మెల్యే టికెట్లు
డీసీసీల నియామకంపై కసరత్తు షురూ…
ఎంపికపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలకు బాధ్యతలు
అన్ని అర్హతలున్న వారికే పగ్గాలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులంటే ఇప్పటివరకు అలంకారప్రాయమే. అప్పుడప్పుడు జిల్లాల్లో జరిగే సమావేశాలకు అధ్యక్షత వహించడం తప్ప ఇప్పటివరకు ఏనిర్ణయం తీసుకునేందుకు వారికి అవకాశం రాలేదు. స్థానికంగా సీనియర్‌ నాయకులుంటే వారిదే హవా. అధ్యక్షులు వస్తుంటారు..పోతూంటారు. కానీ సదరు సీనియర్‌ నాయకుడి కన్నుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఆయన చెప్పిన నాయకుడికే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే అనవాయితీ నడుస్తున్నది. ఏదో ఒక పేరు సూచించాలంటూ సదరు నేతను అడిగే… ఆయన చెప్పిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టేడం అనవాయితీగా మారింది. కానీ పార్టీ చేపట్టిన సంస్థాగత సంస్కరణల్లో భాగంగా ఈ సీన్‌ మారిపోతుంది. రానున్న కాలంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంటే మంత్రి కంటే పవర్‌ఫుల్‌ కానున్నారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా ఉండకపోవచ్చు.

కానీ జిల్లా కాంగ్రెస్‌పై సర్వాధికారాలను కట్టబెట్టేలా కనిపిస్తున్నాయి. పార్టీపై పట్టు, సమస్యలపై అవగాహన, పార్టీని నడిపించే సత్తా. సమన్వయం చేసే చతురత వంటి అర్హతలు ఉన్న వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2018 ఎన్నికలకు ముందుగానే ఇలాంటి ఆలోచన చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దేశ వ్యాప్తంగా పార్టీ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీకి ప్రధాన శత్రువైన బీజేపీ బలాన్ని తగ్గించడం, సొంత బలాన్ని పెంచుకునేందుకు వీలుగా హస్తం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. రానున్న కాలంలో డీసీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే అవకాకాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీటితోపాటు మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన అధ్యక్షులను నియమించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లలో కూడా ఆయన జోక్యం చేసుకోనున్నారు. పార్టీ పరంగా కొన్ని అధికారాలను కట్ట బెట్టడం ద్వారా డీసీసీ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారనేది అధిష్టానం ఆలోచన.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ
డీసీసీల నియామకాలను ఏఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు 21 మంది సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. మాజీ ముఖ్యమంత్రి, సీడబ్య్లూసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు, స్పీకర్‌గా పని చేసిన వారిని తెలంగాణ డీసీసీల నియామకాలకు ఇన్‌చార్జీలుగా వేసింది. దీన్నిబట్టి డీసీసీల నియామకాలకు అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆయా నియామకాలు పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా జరుగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. డీసీసీలకు భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుండడంతో డీసీసీ పదవి దక్కించుకునేందుకు పోటీ పెరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇన్‌ఛార్జీలు వీరే
డీసీసీల నియామకం కోసం అధిష్టానం 21 మంది ఇన్‌చార్జీలను నియమించింది. వి. నారాయణ స్వామి, సీపీ జోషి, శక్తి సిన్హా గోహిల్‌, బెన్ని బెహనన్‌, అంటోని, హిబి హెడెన్‌, జారిత లెయిట్‌ప్లాంగ్‌, శోభ ఓజా, బీవీ శ్రీనివాస్‌, అజరుసింగ్‌, రిజ్వాన్‌ అర్షిత్‌, టి.సిద్ధిఖీ, సోపియా ఫిర్ధోస్‌, శ్రీనివాస్‌ మనే, అమిన్‌ పటేల్‌, ఎం నారాయణ స్వామి, శరత్‌ రావత్‌, బిస్వా రంజన్‌ మహంతి, నభజ్యోతి పట్నాయక్‌, దెబసిస్‌ పట్నాయక్‌, జాన్స్‌ అబ్రహం, కె. మహేంద్రన్‌ తదితరుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -