మరో మూడు వారాల సమయం
అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యలపై ఆలోచిస్తాం
స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అంశంలో నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు స్పీకర్‌కు మరో మూడు వారాల సమయం ఇచ్చింది. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యలపై ఆలోచన చేస్తామని హెచ్చరించింది. బీఆర్‌ఎస్ బీ ఫారం నుంచి కారు గుర్తుపై గెలిచిన శాసన సభ్యులు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో గతేడాది జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీలు ఫిరాయించారని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంలో రిట్ పిటిషన్(సివిల్) వేశారు.
ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. దానం నాగేందర్‌ని ప్రతివాదిగా చేర్చారు. ఈ అన్నీ పిటిషన్లపై గతంలో సీజేఐ ధర్మాసనం విచారణ జరిపి గత జులై 31 వరకు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించారు. అయితే… స్పీకర్ కార్యాలయం ఈ మూడు నెలల కాలం ముగించే సమయానికి.. మరింత గడువు కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సందర్భంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌తో పాటు, మరో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు మిస్ లీనియస్ అప్లికేషన్లు వేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, పిటిషనర్లు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరుల తరపున ఏఓఆర్ మోహిత్ రావు హాజరయ్యారు.
పదింటిలో ఎనిమిది పరిష్కారం
తొలుత స్పీకర్ తరపున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మొత్తం పది అనర్హత పిటిషన్లలో ఎనిమిదింటిని స్పీకర్ పరిష్కరించారని కోర్టుకు నివేదించారు. గత విచారణ తరువాత జరిగిన పురోగతిని ధర్మాసనానికి నివేదించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొంత సమయం అడిగారని తెలిపారు. అందువల్ల మిగిలిన రెండు పిటిషన్ల పరిష్కారానికి మరో మూడు వారాల సమయం కావాలని కోరారు. మార్చి నెల మధ్యలోగా మిగిలిన వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని కోర్టుకు వివరించారు.
అప్పుడు ఆలోచిస్తాం
స్పీకర్ తరపు అభ్యర్థనపై పిటిషనర్ల తరపు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 16 నెలలుగా ఈ కేసు నడుస్తోందని, ఉద్దేశపూర్వకంగానే విచారణలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఒక ఎమ్మెల్యే గెలిచిన ఆరు నెలలకే పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్యే కుమార్తె కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే సంబంధిత ఎమ్మెల్యే ప్రచారం చేశారని ఉద్వేగంగా వాదనలు వినిపించారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునేలా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం, గత ఆదేశాల ప్రకారం కేసులో పురోగతిని స్పీకర్ కార్యాలయం తెలిపిందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మరో మూడు వారాలు సమయం ఇస్తున్నట్టు జస్టిస్ సంజయ్ కరోల్ వెల్లడించారు. అప్పటికీ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకపోతే, కోర్టు ధిక్కరణ చర్యలపై ఆలోచన చేస్తామని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కోర్టులో జరిగిన వాదనలను సోషల్ మీడియాలో పలువురు న్యాయ వాదులు, ఇతరులు వైరల్ చేస్తోన్న అంశంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి చేయొద్దని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా మార్చి 12న ఈ పిటిషన్లపై మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది.



