Saturday, January 3, 2026
E-PAPER
Homeజాతీయంస్వచ్ఛ నగరంలో మృత్యు జలాలు

స్వచ్ఛ నగరంలో మృత్యు జలాలు

- Advertisement -

ఇండోర్‌లో 15కి పెరిగిన మరణాలు
మా బిడ్డను పరిహారం బతికిస్తుందా?
ప్రశ్నించిన పసికందు తల్లిదండ్రులు

భోపాల్‌ : బిజెపి డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పాలనలోని మధ్యప్రదేశ్‌ స్వచ్ఛమైన తాగునీటిని కూడా అందించలేకపోతోంది. దేశంలో ‘స్వచ్ఛనగరం’గా ఎనిమిదిసార్లు అవార్డు అందుకున్న ఇండోర్‌ నగరంలోని భగీరథపురాలో కలుషితమైన నీటిని తాగి మరణించిన వారి సంఖ్య శువ్రకారం నాటికి 15కి పెరిగింది. వీరిలో ఆరు నెలల చిన్నారి కూడా ఉంది. ఈ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసిన నీటిని తాగి గత 10 రోజుల్లో రెండు వేల మందికి పైగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. గురువారం వరకూ 272 మంది ఆసుపత్రుల్లో చేరారని, 71 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 32 మంది రోగులు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

పదేళ్లకు పుట్టిన బిడ్డ మరణించాడు… పసికందు మరణంతో కన్నీరు మున్నీరు
ప్రార్థనలు, మొక్కుల తరువాత పదేళ్లకు పుట్టిన బిడ్డ మరణించాడని భగీరథ్‌పురాలోని మరాఠీ మొహల్లాలో బాలుడు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆరు నెలల చిన్నారి అవ్యాన్‌ సాహు అమ్మమ్మ కృష్ణ సాహు మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి పరహారం తీసుకోలేదు. మా బిడ్డ పోయాడు. పరిహారం తనను బతికిస్తుందా? డబ్బు కంటే మా బిడ్డ గొప్పవాడు’ అంటూ రోదించారు. పెళ్లయిన పదేళ్లకు ఎన్నో మొక్కుల తర్వాత తన కూతురుకు బిడ్డ పుట్టాడని, ఇంతలోనే కలుషిత నీటి వల్ల మరణించాడని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పాలపొడిలో మున్సిపల్‌ కుళాయి నీటిలో కలిపి ఇవ్వడమే ప్రాణం తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, తిరస్కరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలుషిత నీటి వల్ల ఏ తల్లీ బిడ్డను కోల్పోకుండా చూడాలని అదే ప్రాంతానికి చెందిన అనితా సేన్‌ కోరారు. ఇప్పటికైనా స్వచ్ఛమైన నీటిని అందించాలని అన్నారు.

నీటికి బదులు విషం పంపిణీ చేశారు : రాహుల్‌గాంధీ ఆగ్రహం
ఇండోర్‌లో నీటికి బదులు విషం పంపిణీ చేయడం వల్లే మరణాలు సంభవించాయని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదలు మరణించినప్పుడలా ప్రధాని మోడీ మౌనంగా ఉంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఇండోర్‌లో నీటికి బదులు విషం పంపిణీ చేసినా మోడీ ప్రభుత్వం మొద్దునిద్రపోతోందని అన్నారు. ఇండోర్‌లోని ప్రతి ఇల్లు శోక సంద్రంగా మారిందని అన్నారు. నీరు మురికిగా ఉందని, దుర్వాసన వస్తోందని ప్రజలు పదేపదే ఫిర్యాదు చేసినా ఎందుకు వినిపించుకోవడం లేదని, ఎందుకు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులు, నేతలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. స్వచ్ఛమైన నీరు అవసరం కాదని, అది జీవించే హక్కు అని అన్నారు. మధ్యప్రదేశ్‌ దుష్పరిపాలనకు కేంద్రంగా మారిందని అన్నారు. దగ్గు మందుతో చిన్నారుల మరణాలు, ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు పిల్లలను చంపడం, ఇప్పుడు కలుషిత నీటి మరణాలు సంభవించాయని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -