Thursday, December 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవెంటాడుతున్న మృత్యువు

వెంటాడుతున్న మృత్యువు

- Advertisement -

గాజాలో వైద్య సరఫరాలను అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌

గాజా : వైద్య సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్న గాజా వాసుల విషయంలో ఇజ్రాయిల్‌ అమానుషంగా వ్యవహరిస్తోంది. వారిని మృత్యు ముఖంలోకి నెడుతోంది. గాజాలో ఆరోగ్య వ్యవస్థ అసాధారణ రీతిలో ఏ క్షణాన అయినా కుప్పకూలిపోయే ప్రమాదం తలెత్తింది. గాజాలోకి వైద్య పరికరాలు, మందులు ప్రవేశించకుండా ఇజ్రాయిల్‌ అడ్డుకుంటుండడంతో వేలాది మంది రోగులను మృత్యువు వెంటాడుతోంది. గాజాలోని ఆస్పత్రులలో పరిస్థితి దారుణంగా, భయానకంగా ఉన్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మునీర్‌ అల్‌-బర్ష్‌ తెలిపారు. అత్యవసర వైద్య సరఫరాలను ఇజ్రాయిల్‌ అడ్డుకుంటోందని, ఫలితంగా కీలక కేసులకు వైద్యులు చికిత్స అందించలేకపోతున్నారని ఆయన చెప్పారు. అత్యవసర మందులు, వైద్య పరికరాలను గాజాలోకి ఇజ్రాయిల్‌ అనుమతించకపోవడంతో రోగుల ప్రాణాలు కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నా యని గాజా వైద్యులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు.

అక్టోబరులో కాల్పుల విరమణ అమలు లోకి వచ్చినప్పటికీ హమాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఉల్లంఘిస్తోంది. వైద్య సహాయక వాహనాలను గాజాలోకి ప్రవేశించని వ్వడం లేదు. గాజాలో ఇప్పటికే ఆరోగ్య ఎమర్జెన్సీ అమలులో ఉండగా ఇజ్రాయిల్‌ అమానవీయ చర్యలతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. మందులు, వైద్య సరఫరాల కొరత తీవ్రంగా ఉన్నదని, ముఖ్యం గా శస్త్రచికిత్సలు చేసేందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేదని వైద్యులు చెబుతున్నారు. మూడు వంతుల సరఫరాలకు ఆటంకం కలుగు తోందని, దీనికితోడు కరెంటు కష్టాలు, జనరేటర్ల కొరత వెంటాడుతోందని వారు తెలిపారు. 30 ఏండ్ల క్రితం పాలస్తీనా అథారిటీ ఏర్పడిన తర్వాత ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఎన్నడూ ఎదురవలేదని మునీర్‌ అల్‌-బర్ష్‌ చెప్పారు. రెండు సంవత్సరాలకు పైగా కొనసాగిన యుద్ధంలో దాదాపు గాజా ఆస్పత్రులన్నింటి పైన దాడులు జరిగాయి.

ఫలితంగా వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 34 ఆస్పత్రులు సహా 125 ఆరోగ్య కేంద్రాలకు నష్టం వాటిల్లింది. 1,700 మంది ఆరోగ్య కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. 95 మంది పాలస్తీనా వైద్యులు, సిబ్బంది ఇజ్రాయిల్‌ బందీలుగా ఉన్నారు. వీరిలో 80 మంది గాజాకు చెందిన వారే. ఇజ్రాయిల్‌ దాడులలో గాయపడిన వేలాది మంది బాధితులు విదేశాలలో చికిత్స పొందేందుకు అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు. చికిత్స అందకపోవడంతో సుమారు నాలుగు వేల మంది గ్లుకోమా రోగులు శాశ్వతంగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం తలెత్తింది. గూడును కోల్పోయి తాత్కాలిక శిబిరాలలో తలదాచుకుంటున్న 40వేల మంది గర్భిణుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఐదు సంవత్సరాల లోపు వయసున్న మూడు లక్షల మందికి పైగా పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. విదేశాలలో చికిత్స కోసం అనుమతి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న 1,156 మంది రోగులు అది రాకముందే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -