Monday, February 9, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగ ప్రమాణాలు పాటించని 'మరణశిక్షలు'

రాజ్యాంగ ప్రమాణాలు పాటించని ‘మరణశిక్షలు’

- Advertisement -

95 శాతం కేసుల్లో ఇదే తీరు
ఉన్నత న్యాయస్థానాల్లో నిలబడని శిక్షలు
ట్రయల్‌ కోర్టుల తీర్పులపై తీవ్ర ప్రశ్నలు : ‘స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌’ నివేదిక

గతేడాది దేశవ్యాప్తంగా ట్రయల్‌ కోర్టులు విధించిన మరణశిక్షల్లో దాదాపు 95 శాతం కేసులు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేవని ఒక కీలక నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని నల్సార్‌ విశ్వ విద్యాలయానికి చెందిన ‘స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌’ విడుదల చేసిన ఈ నివేదిక.. భారత న్యాయవ్యవస్థలో మరణశిక్షల విధానంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

న్యూఢిల్లీ : స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌ అధ్యయనం ప్రకారం.. 2025లో ట్రయల్‌ కోర్టులు తీర్పు చెప్పిన 83 మరణశిక్ష కేసుల్లో 79 కేసులు (95.18 శాతం) సుప్రీంకోర్టు నిర్దేశించిన రాజ్యాంగ రక్షణ ప్రమాణాలను పాటించలేదు. ‘మనోజ్‌ వర్సెస్‌ మధ్యప్రదేశ్‌ స్టేట్‌’ కేసులో ఈ ప్రమాణాలను సుప్రీంకోర్టు నిర్దేశించింది. అలాగే ‘వసంత సంపత్‌ దుపారరే వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో న్యాయమైన విచారణ (ఫేర్‌ ట్రయల్‌) హక్కులో భాగంగా చేర్చింది.

హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో తిరస్కరణే ఎక్కువ
ట్రయల్‌ కోర్టులు విధించిన మరణశిక్షల్లో అధికం పైస్థాయి కోర్టుల్లో నిలబడటం లేవని నివేదిక స్పష్టం చేస్తున్నది. గత పదేండ్లలో హైకోర్టులు విచారించిన 1085 మరణశిక్ష తీర్పుల్లో 106 కేసుల్లో (9.77 శాతం) మాత్రమే మరణశిక్షను ధృవీకరించాయి. 191 కేసుల్లో 326 మందిని (34.65 శాతం) పూర్తిగా నిర్దోషులుగా విడుదల చేశాయి. నిర్దోషులుగా విడుదలైన కేసుల శాతం.. ధృవీకరించిన కేసుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

సుప్రీంకోర్టులో ఒక్క మరణశిక్ష కూడా నిలబడలేదు
గత మూడేండ్లలో సుప్రీంకోర్టు ఒక్క మరణశిక్షను కూడా ధృవీకరించలేదు. 2025లో హైకోర్టులు పరిశీలించిన కేసుల్లో 25 శాతం మరణశిక్షలు రద్దు చేసి, నిర్దోషులుగా ప్రకటించాయి. ఇక సుప్రీంకోర్టు విచారించిన కేసుల్లో 50 శాతం కంటే ఎక్కువ కేసుల్లో నిందితులను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో 364 మంది నిరపరాధులు అనవసరంగా మరణశిక్షలో బాధలు అనుభవించారని నివేదిక పేర్కొంది.

తగ్గని మరణశిక్షల విధింపు
పైస్థాయి కోర్టుల్లో తిరస్కరణలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ట్రయల్‌ కోర్టులు మరణశిక్షలు విధించడం మాత్రం కొనసాగుతోంది. 2025లో సెషన్స్‌ కోర్టులో 94 కేసుల్లో 128 మందికి మరణశిక్ష విధించాయి. ఇందులో పురుషులు 118 మంది, మహిళలు 10 మంది ఉన్నారు. 2025 డిసెంబర్‌ 31 నాటికి 574 మంది మరణశిక్షను అనుభవించబోయేవారిలో ఉన్నారు. ఇది 2016 తర్వాత ఒక ఏడాదిలో అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.

” అధిక సంఖ్యలో నిర్దోషుల విడుదల, శిక్షల తగ్గింపు చూస్తే.. మరణశిక్షను అతిశయంగా, అన్యాయంగా వినియోగిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో న్యాయవ్యవస్థ విశ్వసనీయత, దాని న్యాయబద్దత ప్రశానర్థకమవుతోంది” అని నివేదిక పేర్కొన్నది. రాజ్యాంగ రక్షణలు పాటించకుండా విధిస్తున్న మరణశిక్షలు.. నిరపరాధుల జీవితాలనే కాదు, భారత న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్నీ తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

పదేండ్లలో 1200 మందికి పైగా మరణశిక్షలు
గత పదేండ్ల గణాంకాలను పరిశీలిస్తే.. భారత్‌లోని సెషన్స్‌ కోర్టులు 2016-2025 మధ్య 1279 మందికి మరణశిక్షలు విధించాయి. ఇందులో కొందరికి ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో మరణశిక్షలు ఉండటంతో ఈ సంఖ్య 1310కి చేరుకున్నది. అయితే ఈ శిక్షల్లో 70 కేసులకే హైకోర్టు ఆమోదం లభించడం గమనార్హం.

పెండింగ్‌ కేసులు
దేశవ్యాప్తంగా 312 కేసులు (478 మంది) హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ట్రయల్‌ కోర్టు తీర్పు నుంచి హైకోర్టు విచారణ వరకు సగటు సమయం దాదాపు మూడేండ్లుగా నమోదవుతోంది. జమ్మూకాశ్మీర్‌ హైకోర్టులో సగటు పెండెన్సీ 11.5 సంవత్సరాలుగా ఉండటం గమనార్హం. అలహాబాద్‌ హైకోర్టులో అత్యధికంగా 91 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

జీవిత ఖైదు సురక్షిత ప్రత్యామ్నాయం కాదు
మరణశిక్షకు బదులుగా రెమిషన్‌ లేని జీవిత ఖైదు వినియోగం పెరుగుతోందని అధ్యయనం హెచ్చరించింది. ఈ శిక్ష అంతగా సురక్షితమైన ప్రత్యామ్నాయం కాదనీ, ఇది మనిషిలో ఉన్న అత్యంత ముఖ్యమైన అంశం ‘ఆశ’ను లేకుండా చేస్తుందని పేర్కొన్నది. ఇక 2015లో న్యాయ కమిషన్‌.. ఉగ్రవాదం, దేశద్రోహం కేసులు మినహా మరణశిక్ష పూర్తిగా రద్దు చేయాలని సూచించింది. కానీ భారత్‌ ఇంకా సాధారణ నేరాలకూ ఉరిశిక్షను కొనసాగిస్తున్న 55 దేశాల్లో ఒకటిగా ఉన్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -